గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు అన్నవరం దేవేందర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
అన్నవరం దేవేందర్ నిరంతరకవి. ఆయన కవిత్వంలో తెలంగాణ జీవితం, భాష తొణికిసలాడతాయి. ‘‘మంకమ్మతోట లేబర్ అడ్డ ’’ ప్రపంచీకరణ నేపథ్యాన్ని, చితికిన పల్లెలు పట్టణాలకు వలసపోవడం చిత్రించింది. ఇప్పటివరకు (11) కవితా సంకలనాలు తెలుగులో (2) ఆంగ్ల కవితా సంకలనాలు Farmland Fragrance, unyielding sky వచ్చినాయి. ‘‘ఊరి దస్తూరి’’ కాలమ్ గత యాబై సంవత్సరాలుగా గ్రామాలలో చోటు చేసుకున్న పరిణామాలను కళ్ళకు కట్టింది. ‘‘మరోకోణం’’ సామాజిక వ్యాసాలు వెలువడినాయి. ఇంత సుధీర్ఘ సాహితీ ప్రస్థానం ఉన్న కవి అరవయవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరిపిన ఇష్టాగోష్ఠి ఇది.
1. కవిత్వం రాయాలనే బలమైన కోరిక ఎట్లా పుట్టింది. ఏ కవుల నుండి మీరు ప్రేరణ పొంది కవిత్వం రాస్తున్నారు. మిమ్ములను కదిలించిన కవితా సంకలనాలు ఏవి?
జ. 1980వ దశకంలో కవిత్వాన్ని ఆసక్తిగా చదువుతున్న సందర్భంలో 1990 తర్వాత నాకు కవిత్వం రాయాలనిపించింది. ముఖ్యంగా శ్రీశ్రీ, శివ సాగర్, చెరబండరాజు, గోపి, వరవరరావు, శివారెడ్డి, సి. నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదవడం వల్ల ప్రేరణ లభించింది. జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య వీళ్ళ కవిత్వం ఇష్టం అనిపించేది. నాకు వ్రాయాలనే ఆసక్తి కలిగించింది.
2. కవికి వ్యక్తిగత జీవితం, సాహిత్య జీవితం రెండూ ఉంటాయంటారు. కవిత్వంలో ప్రతిపాదించిన విలువలను జీవతంలో ఆచరించవలసి ఉందా? సాహిత్యాన్ని జీవితాన్ని వేరుగా చూస్తారా?
జ. కవి యొక్క సామాజిక వ్యక్తిగత ఆలోచనల ప్రతిఫలనాలే కవిత్వం. కవిత్వం, కవి జీవితం ఆచరణల ప్రతిబింబం కావాలి. ఆచరణ లేకుండా రాసే చిలుక పలుకులు ప్రజలు గమనిస్తారు. ఎవరికైనా సాహిత్యమూ జీవితము వేరువేరు కాదు.
3. ఇటీవల ఫేస్బుక్, వాట్సప్ వచ్చినంక కవిత్వానికి ఎక్కువ ప్రాచుర్యం దొరికింది. రోజూ ప్రచారంలో ఉండాలనే యావ కవిత్వాన్ని పలుచన చేయదా? బలమైన కవిత్వం వస్తలేదనే విమర్శ ఉంది. మీ అభిప్రాయం చెప్పండి?
జ. ఫేసుబుక్, వాట్సాప్,సోషల్ మీడియాలో కవిత్వం విస్త•తంగా వస్తుంది. దాన్ని ఆహ్వానించాల్సిందే. నవతరం కవులు ఆ మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు, వీటినీ వాడుకుంటున్నారు. కవిత్వం పలచన అవ్వడం ఎప్పుడూ ఉన్నదే. ఈ తరంలోనూ గొప్ప కవిత్వం మరింత చిక్కగా వస్తుంది.
4. సాహిత్య సమూహాలు ఎవరి గుంపులోని వారిని వారు ఆకాశానికి ఎత్తుతున్నారు. దానిలో సాహితీ విలువలు ఉన్నా లేకున్నా అనే విమర్శ ఉంది. వివరిస్తారా?
జ. ఇదంతా విలువలు పతనం అవుతున్న ప్రచారపు దశ. సమూహాలు ఎవరికి వారివే ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఆకాశానికి ఎత్తుకున్న అందులో పస లేకుంటే రాలిపోవుడే కదా.
5. ఈనాడు సాహిత్య విమర్శ అంటే ఆహా! ఓహో అని పొగడడమే అని స్థిరపడిపోయింది. ఏదైనా విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఓర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమంటారు?
జ. ముందు తరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నేర్చుకోవడం తగ్గిపోయింది నిజమే. నాలుగు కవితలు రాసి నలుగురు మెచ్చుకోవాలనే యావ కూడా పెరిగింది. అయితే ఇందులో కవిత్వం విలువలు లేవు, వచనమే తేలియాడుతూ ఉంది అంటే చిన్నబుచ్చుకుంటున్నారు కూడా. నిజానికి నికార్సయిన మంచి విమర్శకులు కూడా లేని కాలం ఇది.
6. మీరు కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందా?
జ. కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబము కులవృత్తి, సామాజిక నేపథ్యం, పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న చదువు, స్నేహాలు ఇవన్నీ మన ఆలోచనలను ఒక అధ్యయన దృక్పథం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఇంటిలో కవికి ఒక ఒంటరి వాతావరణం ఉండాలి. తన ఆలోచనాసరళికి గాని, రాతకోతలకు గాని తనకు ఒక సొంత స్పేస్ ఉండాల్సిన అవసరం ఉంటది. రాస్తున్న కవి ప్రభావం ఆ కుటుంబం మీదా పడుతుంది. ఇప్పుడు నా సహచరి ఏదునూరి రాజేశ్వరి కథలు రాస్తుంది
7. అన్నవరం శ్రీనివాస్ (మీ తమ్ముడు) మీ ప్రతి పుస్తకానికి ముఖచిత్రం వేసినాడు. ఇది ఆయనకు కూడ కీర్తి సముపార్జించిందనుకొంటున్నారా?
జ. నేను కవిత్వం ఎట్లా రాస్తానో మా తమ్ముడు బొమ్మలు అట్లా గీస్తాడు. నా పుస్తకాలతోపాటు ఇప్పటికే వందలాది పుస్తకాలకు ముఖచిత్రాలు వేశాడు. ఎన్నో చిత్ర ప్రదర్శనలలో తన బొమ్మలు ప్రదర్శించారు. మాది ఒకరిది కవిత్వం మరొకరిది చిత్రం.
8. ఈనాటి కవిత్వం సమాజానికి దూరమై వైయక్తిక అనుభూతులకు పెద్దపీట వేసిందనే విమర్శ ఉంది. మీరేమంటారు?
జ. సమాజానికి దూరమైందని భావన ఏమీ లేదు కానీ, సాహిత్యం ఉద్యమానికి ఆయువు ఎలానో ఉద్యమాలు కూడా సాహిత్యానికి ఆక్సిజన్ లాంటివి. ఉద్యమాల వెలుగులోనే అభ్యుదయ విప్లవ కవిత్వం వచ్చింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం నుంచి తెలంగాణ కవిత్వం వచ్చింది. అట్లాగే దళిత స్త్రీవాద సాహిత్యం కూడా సృష్టించబడింది. ఇప్పుడు సమాజంలో ఒక ఫోర్స్‌గా ఉండాల్సినంతగా ఉద్యమ వాతావరణం లేదు. అందుకే వైయక్తిక అనుభవాలు కవిత్వాలు అవుతున్నాయేమో...
9. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ గత వైభవాన్ని కీర్తించి, ఆంధ్ర వలస పాలకుల దోపిడీని ఎండగట్టిన కవులు తెలంగాణ వచ్చినంక గొంతుకలు మూగపోవడానికి కారణం? ఎలాంటి పీడన లేని సమాజం వచ్చిందంటారా?
జ. దోపిడీ పీడన లేని సమాజం ఎక్కడ వచ్చింది. ఏర్పడకుండా చాపకింద నీరులా పీడన అనచివేత కొనసాగుతూనే ఉంది. కానీ ఇది బానిస భావజాలం అని తెలుస్తలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గత వైభవం, అప్పటి వలసాంధ్ర ఆధిపత్యం సాహిత్య వస్తువులయ్యాయి. ఇప్పుడు అడపా దడపా సాహిత్య సృష్టి జరుగుతుంది. నిజమే కానీ రావాల్సినంత రావడం లేదు.
10. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ కోసం ఆడిపాడిన కళాకారులను ‘‘సాంస్క•తిక సారథి’’లో జీతగాళ్ళుగా తీసుకొన్ని ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగించు కోవడం వలన ప్రజల పాట చచ్చిపోయింది అనే ఒక వాదన ఉంది. మీ వివరణ ఏమిటి?
జ. తెలంగాణ కళాకారులు సాంస్క•తిక సారథిలో వేతనజీవులుగా నియమింపబడటం పెద్ద తప్పు పట్టాల్సినది ఏమీ లేదు. ఎందుకంటే ఉదర పోషణార్థం అందరూ ఉద్యోగాలు చేయాల్సిందే. మనమందరం అట్లా చేస్తున్న వాళ్ళమే. అయితే పోరాటాల పాట తిరిగి పుట్టాల్సిందే.
11. తెలంగాణలోని వాగ్గేయకారులు తాము నడిచి వచ్చిన దారిని మరిసి ప్రకృతి కవులుగా మారి, ప్రభుత్వ ప్రచార సారథులుగా మారి పదవుల గండ పెండేరాలను తొడుక్కొన్నారు అన్న విమర్శ ఉంది? మీరేమంటారు?
జ. కవి ఎటువైపు నిలబడాలో కవి నిర్ణయించుకోవాల్సిందే. ప్రభుత్వంలో కవి, రచయి• భాగమై పనిచేయడం మంచిదే కదా. కవి రచయిత నడపాల్సిన సంస్థను ఇంకెవరో అనామకునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది. అయితే ప్రభుత్వంలో నిలబడ్డ కవి, రచయిత, కళాకారుడు తన ప్రజా దృక్పథానికి మాత్రమే అనుగుణంగా ఉండాలి. ఒక జడ్జిలాగా స్వతంత్రంగా వ్యవహరించాలి.
12. ప్రజల కోసం పని చేసే మేధావులు ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని సంపాదించి, ప్రజలను మరచిపోవడం వలన పౌర సమాజం లుప్తమయింది అంటారు. పౌర సమాజం క్రీయాశీలంగా ఉంటేనే చట్టబద్ధ పాలన ఉంటుందంటారు? మీ స్పందన తెలపండి?
జ. పౌర సమాజం, ప్రజాసంఘాలు క్రయాశీలంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వానికి కూడా మంచిది. ప్రభుత్వం నడిపే రాజకీయ పార్టీలకు ఎదురు లేకుండా, ఎదురు చెప్పకుండా ఉండాలనుకుంటారు. కానీ అంతిమంగా అది నియంతృత్వం వైపు దారి తీస్తుంది. మనం చూస్తున్నాం. ప్రజా చైతన్యం జాగరూకతతో ఉండాలి. లేకుంటే సమాజం నిర్వీర్యమై పోతుంది.
13. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారిని శత్రువులుగా పరిగణించి అణచి వేస్తున్నారు. ఈ పరిణామం సాహిత్యంలో ఎంతవరకు చిత్రితమవుతుంది?
జ. ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం అధికారంలో పైచేయిగా ఉంది నిజమే. దానితో పాటే మార్కెట్ శక్తులు చేతులు కలిపాయి. ఇప్పుడు రాజ్యాలను మార్కెట్లు బడా పెట్టుబడిదారులు తమ వ్యూహాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆయా సంస్క•తులు మార్కెట్ అనుగుణంగా మార్చుకుంటున్నాయు. ఈ పరిణామాలు సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో స్వల్పంగా చోటు చేసుకుంటున్నాయి. గ్లోబలైజేషన్ తర్వాత ఈ విష పరిణామాలు విస్త•తమై పోతున్నాయి.
14. రాజు కరుణిస్తే విలాసం, రాజు కరుణించకుంటే విలాపం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సృజనకారులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ?
జ. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళుగానే అర్థం చేసుకుంటాం, ఇట్లాంటి వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. సాహిత్య సృజన చేస్తున్నది ప్రజల కోసమా, ప్రభువుల కోసమా అనే ఎరుక నిరంతరం ఉండాలి.
15. మీకు ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు, మీరు రావాలని కోరుకుని రాకపోయిన అవార్డులు ఏమైనా ఉన్నాయా ? అసలు అవార్డుల మీద మీ అభిప్రాయం ?
జ. అవార్డులు పురస్కారాలు సాహిత్య సృజనకు ఒక చిరు ప్రోత్సాహమే తప్ప గీటురాళ్లు కావు. నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, తెలంగాన సారస్వత పరిషత్ పురస్కారంతో పాటు మరెన్నో బాగానే వచ్చాయి. కోరుకుని రాకపోయిన అవార్డులు అని అడిగారు అట్లాంటివి పెద్దగా ఏమీ లేవు. అయితే కవులు ఎవరూ పురస్కారాల కోసం రాయరు. అవార్డు సృజనను సృష్టించలేదు.
16. మీ కవిత్వంలో మీకు నచ్చిన సంకలనం ఏది ? కారణాలు వివరిస్తారా ?
జ. నా కవిత్వంలో నాకు నచ్చింది అని ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ 2005 లోని నా మూడవ కవితాసంపుటి ‘‘ మంకమ్మతోట లేబర్అడ్డా ’’ నా సిగ్నేచర్ పోయెట్రీ. అందులో తెలంగాణా ఉద్యమము, రైతులు, కూలీల వలసలు, ప్రపంచీకరణ దుష్పరిణామాలు కవిత్వీకరించబడ్డాయి.
17. ప్రపంచ వ్యాప్తంగా కొద్దిమంది దగ్గర సంపద పోగుపడే అభివృద్ధి నమూనా కొనసాగుతుంది కదా ! ఈ పరిస్థితి మారి అందరి కోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ?
జ. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు మహా సంపన్నులవుతున్నారు. ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నది. దీనికి దోపిడీ పీడన లేని సోషలిస్ట్ సమాజ నిర్మాణమే అవసరం. అయితే పెట్టుబడిదారీ విధానం బహు జాగ్రత్త, అది రాకుండా దూరదృష్టితో అడ్డుకుంటుంది.
18. తెలంగాణ వచ్చినంక కూడా ప్రకృతి వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతుంది. కారణం ఏమిటి?
జ. తెలంగాణ రావడం అంటే ఏదైనా సోషలిస్టు సమాజం వచ్చినట్టా, కాదు కదా ! పాలకులు వారే పార్టీల పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి. రాజ్య యంత్రాంగం, చట్టాలు, లోగుట్టులు, స్వభావాలు, ప్రభావాలు అవే కదా
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కిరణ్ విభావరి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1.. మీ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మాటలు.....
నా పేరు కిరణ్. విభావరి అనేది నా కలం పేరు.
మా స్వస్థలం విశాఖ. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాం. వృత్తి పరంగా నేనో అధ్యాపకురాలిని. ఐఐటీ ఫౌండేషన్ (మాథ్స్) కోచింగ్ ఇస్తూ ఉంటాను. వందలాది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది, వారికి మంచి శిక్షణ ఇచ్చానన్న ఆత్మ సంతృప్తి ఉంది.
2.. మీ సాహిత్య ప్రస్థానం…
2020 కరోనా మూలంగా నా కోచింగ్ ఆపివెయ్యాల్సి వచ్చింది. అంతకు ముందు, ఒకటి రెండు కథలు రాసి పత్రికకు పంపాను కానీ సమయాభావం వల్ల సీరియస్ సాహిత్యం వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కరోనా లాక్ డౌన్ నాకు బోల్డంత సమయాన్ని మిగిల్చింది. అప్పుడే ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. సృజనశీలుల పరిచయం ఏర్పడింది. Whatsapp లో సాహిత్య గ్రూపుల్లో చేరి, కథలు, కవితలు వాటి పోటీలు వంటి వివరాలు తెలుసుకున్నాను. అంతకు ముందు వరకు ఏవేవో వార పత్రికల్లో వచ్చే కథల్నే తెలుగు సాహిత్యం అని భ్రమించిన నాకు, ఈ సాహిత్య సమాచారం చాలా కొత్తగా తోచింది. ఎన్నో పుస్తకాలు , రచయితలు వారి రచనలు వ్యాసాలు...ఇలా ఎన్నో పరిచయం అయ్యాయి. పరిచయాలూ పెరిగాయి. తెలియని విషయాలు తెలిశాయి.
నాకు కవిత్వం చదవడం మీదున్న ఆసక్తి రాయడం మీద అస్సలు లేదు. రాసి కన్నా వాసి ముఖ్యం అని నా అభిప్రాయం. నాలాంటి భావజాలం కలిగిన మిత్రులతో అప్పుడప్పుడు సాహిత్య గోష్టి చేస్తూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో నా మిత్రురాలు శ్రావణి గుమ్మరాజు ప్రోద్భలంతో మొదటి సారి కవిత రాసి, ఆఖరి నిమిషంలో NATS పోటీకి పంపాను. ఆ పోటీ గురించి ఆ తర్వాత ఇక ఆలోచన చెయ్యలేదు. అయితే కొన్ని రోజుల్లో మీరు ఫైనల్ కాబడ్డారని NATS నిర్వాహకుల నుండి మెసేజ్ చూడగానే నా ఆనందానికి అవధుల్లేవు. అదో అద్వితీయమైన అనుభవం. సినీ కవుల సమక్షంలో నా కవితని వినిపించడం, వారు తిలక్ గారి కవితతో నా కవితని పోల్చడం నిజంగా ఒక మధురమైన అనుభూతి.
ఆ తర్వాత, అదే ఊపులో NATA పోటీకి కూడా కవిత పంపాను. అందులోనూ విజేతగా నిలిచాను. నాకు కవిత్వ భాష తెలియదు కానీ కవిత్వ ఆత్మను పట్టుకోగలిగాను. నేను చెప్పాలి అనుకున్న బలమైన అంశాలను నాదైన శైలిలో చెప్పాను. అయితే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రం అఫ్సర్ గారు మాత్రమే. ఆయన కవితలు యూ ట్యూబ్ లో విని, నేను నా భావాల్ని అక్షరికరించాను. విజయం సాధించాను. ఒకరకంగా నేను ఆయనకు ఏకలవ్య శిష్యురాలిని.
ఈ రెండు పోటీలూ నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎటువంటి సాహిత్య వారసత్వం లేకున్నా, కేవలం ఈ విజయాలే నన్నూ ఒక రచయిత్రిగా నిలబెట్టాయి. ఆ తర్వాత కథల పోటీలో పాల్గొని, స్వెరో టైమ్స్ వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి అందుకున్నాను. మొమ్స్ప్రెస్సో వారు నిర్వహించిన కథల పోటీలో కూడా ప్రథమ బహుమతి అందుకున్నాను.
సాహిత్యం ఒక వ్యసనం అని కొందరు రైటర్స్ చెబుతూ ఉంటారు. నిజమే.. అయితే ఈ విజయాలు అంత కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇక అప్పటి నుండి ఏడాది పాటు కేవలం పోటీలకు మాత్రమే రాయడం మొదలు పెట్టాను. ఏ పోటీకి రాసినా ఏదో ఒక బహుమతి అందుకున్నాను. కానీ ఏదో వెలితి. అందరికన్నా ఉత్తమంగా నిలవాలనే నా తపన నన్ను ఎక్కడా ఆగనివ్వలేదు. ఆ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు చదివాను. నాలో పరిణితి పెరిగింది. మొదట్లో ఉన్నంత ఉబలాటం ఇప్పుడు లేదు. పరుగులు ఆపి ప్రశాంతంగా సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను నేను మెరుగు పరుచుకుని, కలకాలం నిలిచిపోయే ఉత్తమ సాహిత్యం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాను.
3. మీకు బాగా గుర్తింపు తెచ్చిన మీ రచన…
కిరణ్ విభావరి అనగానే కాఫీ పెట్టవు కథ అందరికీ గుర్తుకు వస్తుంది. ఒక ఫేస్ బుక్ గ్రూపు వారు నిర్వహించిన పోటికై ఆ కథ రాశాను. ఒక గంటలో రాసేసిన కథ. కానీ ఆ కథ వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. నా పేరు లేకుండా, వేరే రచయితల పేరుతో ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ కథ నేనున్న ఒక వాట్సప్ గ్రూపులో వేరే వారి పేరుతో రావడం నిజంగా చాలా బాధ వేసింది. దాంతో సారంగ ఎడిటర్ అఫ్సర్ గారిని అభ్యర్థిస్తే, నా వేదనను పాఠకులకు చేరేలా ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో కూడా ప్రచురితం అయ్యింది. ఎందరో పాఠకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆస్ట్రేలియా, UK వంటి దేశాల నుండి పాఠకులు, కొందరు రచయితలు నా నంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చెయ్యడం మరిచిపోలేని అనుభవం. వారంతా ఇప్పుడు నాకు మంచి మిత్రులు అయ్యారు. ఒక యూ ట్యూబ్ చానెల్ వారు ఆడియో కథగా ప్రసారం చేసిన నెలలోనే లక్షన్నర వీక్షకుల ఆదరణకు నోచుకుంది.
4. తపన రచయితల కర్మాగారం అనే గ్రూపు యెందుకు మొదలు పెట్టారు?
గ్రూపు మొదలుపెట్టి ఏడాది పూర్తి అయ్యింది. దాదాపు 6 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ద ప్రతిష్ట రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో నేను ఏదైతే అనుభవించానో అది మరొకరు అనుభవించకుండా ఉండేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశాను. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.
5. ఉత్తమ రచన అంటే ఏమిటి? దానిని. నిర్దేశించే వారు ఎవరు?
నేను రచయిత కన్నా ముందు ఒక పాఠకురాలిని. నా దృష్టిలో పాఠకులే ఉత్తమ రచనల్ని గుర్తిస్తారు. ఈరోజు చదివి రేపు మర్చిపోయే రచనల్ని సాహిత్యం అనరు. ఆలోచన రేకెత్తించాలి. పదికాలాల వరకూ గుర్తు పెట్టుకోవాలి. సమాజంలోని కుళ్ళును ప్రక్షాళన చేయకున్నా, కనీసం స్వేచ్చగా స్వరం వినిపించాలి. ఏ వాదాలనో సిద్ధాంతాలనో బలవంతంగా పాఠకుడి మీద రుద్దకుండా, పాఠకుడికి ఆలోచించగలిగే అవకాశం కల్పించాలి. ఏ వర్గానికో, సమూహానికో కొమ్ము కాయకుండా, సమాజ స్వభావాన్ని నిష్పక్షపాతంతో సమర్ధవంతంగా తెలియజేయాలి.
6. మీకు బాగా నచ్చిన రచనలూ, రచయితలూ…
ఒక రచయిత రాసిన అన్నీ రచనలు అద్భుతంగా ఉండాలనెం లేదు. కాకపోతే కొందరి రచనలు మాత్రం ఎక్కడ కనిపించినా వదలకుండా చదువుతాను. అఫ్సర్, అనిల్ డాని, పి. సుష్మ, వెంకటేష్ పువ్వాడ, తగుళ్ళ గోపాల్ గారి కవితలు ఇష్టంగా చదువుతాను. బాగున్నవి దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. ఇక రచయితల్లో నాకు బాగా నచ్చిన రచయితలు చాలా మంది ఉన్నారు. వివేకానంద మూర్తి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, సన్నపురెడ్డి గారు, సలీం గారు సింహ ప్రసాద్ గారు, సుంకోజి దేవేంద్రాచారి గారు, వెంకట మణి ఈశ్వర్ గారు, మల్లీశ్వరి గారు, కుప్పిలి పద్మ గారు, సమ్మెట ఉమాదేవి గారు, గీతాంజలి గారి రచనలు చాలా నచ్చాయి.
అయితే వ్యక్తిగతంగా మాత్రం, సాహిత్య ప్రస్థానపు తొలినాళ్ళలో ఉండవల్లి గారు, శరత్ చంద్ర గారు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
ఇక ఈ మధ్యే నవలలు చదవడం మొదలు పెట్టాను. నేను చదివిన తొలి నవల, సలీం గారి కాలుతున్న పూల తోట. అది చదివాక కొన్ని క్షణాలు పాటు ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని కూర్చుండి పోయాను. అంత హృద్యంగా ఉందా నవల. అదే నవల మీద సమీక్ష రాసి ఒక పోటీకి పంపిస్తే నాకు ఉత్తమ బహుమతిని తెచ్చిపెట్టింది. ఇక పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి, కేశవ రెడ్డి గారి అతడు అడవిని జయించాడు, సన్నపురెడ్డి గారి కొండ పొలం నాకెంతో ఇష్టమైన నవలలు.
7. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత…
రచనా పరంగా ప్రభావితం చేసిన వారు చాలా మంది ఉన్నారు కానీ తమ ఆదర్శనీయమైన వ్యక్తిగత జీవితంతో ప్రభావితం చేసినవారు మాత్రం సింహ ప్రసాద్ గారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని, నేనూ ఎంత సంపాదించినా అందులో కొంత సమాజం కోసం వెచ్చించాలి అనే నియమం పెట్టుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం కూడా నేనాయన దగ్గరే నేర్చుకున్నాను.
ఇకపోతే, నా కథలన్నిటికి తొలి పాఠకులు, సమీక్షకులు డా. వివేకానంద మూర్తి గారు. ఆయన కూడా ఎన్నో గుప్త దానాలు చేస్తూ, ఎందరికో అండగా నిలిచారు. నాకు ఆదర్శ ప్రాయులు అయ్యారు. నేనెప్పుడైనా నిరాశకు, నిర్లిప్తతకు గురైనా నాకు కొండంత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందించే నా ప్రియతమ మిత్రులు ఆయన.
8. మీ కథా సంపుటి గురించి..
మా నాన్న గారి కోరిక మేరకు కేవలం కొందరు సన్నిహితులకు పంపడానికి లిమిటెడ్ కాపీలతో నఖాబ్ అనే కథల సంపుటి ప్రచురించాను. నిర్మొహమాటంగా వాస్తవం చెప్పాలంటే, ప్రమోషన్ లేనిదే పుస్తకాలు అమ్ముకోవడం చాలా కష్టం. వాణిజ్య ప్రకటనలు తిమ్మిని బమ్మి చేయగలవు. అలా కొన్న కొన్ని పుస్తకాల కుప్పలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. నేను అడిగితే నా పుస్తకాల గురించి మాట్లాడే రచయితలు చాలా మంది ఉన్నారు. కానీ పాఠకుడే నా వాక్యాన్ని ప్రేమించి, దాచుకోవాలనే బలమైన కోరికతో నా పుస్తకం కొనాలి. అంత వరకూ నేను పుస్తకాలు ప్రచురించదలుచుకోలేదు.
9. యువత సాహిత్యంలో వెనుక బడ్డారు అనే విషయం మీద మీ అభిప్రాయం…
తెలుగు సరిగ్గా రాయడం రాకున్నా, విరామ చిహ్నాలు ఎలా పెట్టాలో తెలియకున్నా డైరెక్ట్ గా బుక్స్ వేసి, అవే ఉత్తమ కథలుగా దండోరా వేయించి వేలల్లో పుస్తకాలు అమ్ముకుంటున్న కొందరు యువ రచయితలను చూసి, యువ కలాలకు పదును లేదు అనే భావనలో చాలా మంది ఉన్నారు. కానీ
ఇది కేవలం అపోహ మాత్రమే. ఈ మధ్య కాలంలో ఎందరో యువ రచయితలు తమ వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి రచనలు చేస్తున్నారు. బహుశా వేణుగోపాల్, ఇండ్ల చంద్ర శేఖర్, చరణ్ పరిమి, స్పూర్తి కందివనం, అరుణ్ కుమార్ ఆలూరి, రవి మంత్రి… ఇలా చాలా మంది యువ రచయితలు ఉత్తమ సాహిత్యం అందిస్తున్నారు. అయితే యువ రచయితల అక్షరం అందరికీ చేరడం లేదు. కేవలం కొందర్ని మాత్రమే వెనకేసుకు వస్తున్న సాహిత్య పెద్దలు కూడా ఇందుకు కారణమే. ఈ విషయంలో నేను కొంత అదృష్ట వంతురాలినే. ఇందూ రమణ గారు, జయంతి ప్రకాష్ శర్మ గారు, ప్రభాకర్ జైనీ గారు, ఈత కోట సుబ్బారావు గారి లాంటి పెద్దలు నాకా అవకాశం ఇచ్చారు.
అయితే , ఎంతో మంచి రచనలు చేస్తున్నా గుర్తింపు లేని రచయితలు ఎందరో ఉన్నారు. వారినీ గుర్తించాలి. వారిని ఉత్తమ సాహిత్యం అందించే దిశగా ప్రోత్సహించాలి.
10. విమర్శకుల గురించి మీ అభిప్రాయం…
నిజమైన సాహిత్య విమర్శ, సాహిత్యాన్ని మెరుగు పరుస్తుంది. రచయిత ఇంకొన్ని ఉత్తమ రచనలు చేసేలా ప్రోత్సహిస్తుంది. కానీ నేటి కాలంలో అలాంటి విమర్శకులు కద్దు. కేవలం కొన్ని సమూహాల ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. తాను చూసిందే రంభ అన్నట్టు, తమ వారి రచనలు మాత్రమే గొప్పవి అని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఉత్తమ రచన పాఠకుడి దృష్టికి రావడం లేదు.
11. కొత్తగా కథలు కవితలు రాస్తున్న మహిళలకు అందించాల్సిన ప్రోత్సాహం గురించి మీరేమనుకుంటున్నారు?
కేవలం మహిళలు అనే కాదు. తగిన సాహిత్య వారసత్వమో లేదా పలుకుబడి లేకపోతే ఏ కొత్త రచయితకూ తగిన ప్రోత్సాహం దొరకడం లేదు. కేవలం తమ వర్గానికో, సమూహానికో లేదా తమకు అనుకూలంగా ఉన్న రచయితల రచనలు తప్పా మిగతా వారి రచనల్ని సీనియర్ రచయితలు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ రచన బాగుంది/ చదవండి అనే చిన్న పరిచయ వాక్యం కూడా పొరపాటున మాట్లాడరు. ఈ పరిస్థితి మారాలి.
12. 20,30 ఏళ్లనాటి స్త్రీవాద సాహిత్యం ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నదని మీరు భావిస్తున్నారా?
ఓల్గా గారు రాసిన స్వేచ్ఛ నవల ఇప్పటికీ ఈనాటి సమాజాన్ని అద్దం పడుతోంది. స్ర్తీల గృహిణిత్వానికి, పౌరసత్వానికి మధ్య నిరంతరమైన ఉద్రిక్తత 19వ శతాబ్దంలో ప్రారంభమై ఈరోజుకీ కొనసాగుతూనే ఉంది. ఆమె రాసిన అయోని కథలోని చిన్నారి జీవితం నేటికీ మారలేదు. ఎందరో చిట్టి తల్లులు లైంగిక వేధింపులకు వికృతాలకు గురి అవుతున్నారు. ఇక గీతాంజలి భారతి గారి పెహచాన్ కథలు ఇప్పటికీ వెతలు అనుభవిస్తున్న ముస్లిం స్త్రీల జీవితాలను మనకు గుర్తుకు తెస్తుంది.
సత్యవతి గారి సూపర్ మాం సిండ్రోం చదివి ఇప్పటికీ అనురాధలో తమని తాము చూసుకునే ఇల్లాల్లు ఎందరో!
రంగనాయకమ్మ గారి కల్యాణిలు ఇప్పటికీ మనకు ఎదురవుతూనే ఉన్నారు.
1984 లో సావిత్రి గారు ” బంది పోట్లు ” అనే కవిత రాసారు.
” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది !
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!
వాడికేం ? మగమహారాజని
ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ”
ఈ కవిత ప్రస్తుత సామాజిక పరిస్థితిని అద్దం పట్టడం లేదూ!
సాహిత్యం ఒక పరిణామ క్రమంలో భాగం. వెనువెంటనే మార్పులు ఆశించకపోయినా ఆలోచనా సరళిలో తప్పక మార్పు వస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ మాత్రం స్వేచ్ఛ కూడా నాటి స్త్రీ వాదుల, ఉద్యమకారుల కృషి ఫలితమే కదా. కన్యాశుల్కం, సతీ సహగమనం వంటివి పారద్రోలబడ్డా, వంటింటికే పరిమితం అయిన ఆడవారికి విద్యా, ఆస్తి హక్కులు అందించబడినా అందుకు కారణం సమాజాన్ని ప్రభావితం చేసిన సాహిత్యమే
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సుంకోజి దేవేంద్రాచారి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ బాల్యం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి
మా అమ్మానాన్న సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డెప్పాచారి. స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం గుడ్రెడ్డిగారిపల్లె. మా నాన్న నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మను, ఐదేళ్ల వయసులో నాన్నను కోల్పోయాడు. అమ్మమ్మ ఇంట పెరిగాడు. పెళ్లయ్యాక బతుకుతెరువు వెతుక్కుంటూ కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ చెరువుముందరపల్లెకు చేరుకున్నారు. నేను, మా అక్క అక్కడే పుట్టాం. తీవ్ర కరువు నేపథ్యంలో నాకు రెండేళ్ల వయసులో తిరిగి సొంతూరు వచ్చేశారు. నాన్న బాల్యంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న ఆస్తులన్నీ పోయాయి. తర్వాత సొంతూరులోనే కౌలుకు సేద్యం చేస్తూ కొయ్యపనితో జీవిత నౌక నడిపారు. నాకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు. అందరికీ వివాహాలయ్యాయి.
నా బాల్యమంతా పల్లెటూరులోనే సాగింది. నా చిన్నప్పుడు మా ఊరికి దగ్గరలోని బంజరుభూమిలో రాళ్లు తొలగించి, కంపచెట్లు కొట్టి కాస్త నేలను సాగుయోగ్యంగా మలిచారు అమ్మానాన్న. అందులో మేము చాలా రకాల పంటలు పండించాం. వేరుశనగ, వరి, రాగులు, నువ్వులు, ధనియాలు, మిరప, సజ్జ, టమాటా, ఎర్రగడ్డలు, అలసంద, కంది.. ఇలా. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేస్తూ పెరిగాను. విత్తనం విత్తడం దగ్గర నుంచి కోతలు కోయడం వరకు.. మడకతో దున్నడం మొదలు ఎడ్లబండి తోలడం వరకు.. వ్యవసాయంలో అన్ని పనులూ చేశాను. నాన్నతో పాటు స్కూలు రోజుల్లోనే కొయ్యలు కోసేదానికి వెళ్లేవాడిని. పదమూడేళ్ల వయసులోనే పాతికేళ్ల యువకుడు చేయగలిగినంత శారీరక శ్రమ చేసేవాడిని. నాకు కొండలు గుట్టలు ఎక్కడం అంటే ఇష్టం. ఈత కొట్టడం చాలా సరదా. ఇంట్లో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులున్నా.. బాల్యమంతా సరదాగానే గడిచిపోయింది. ఆ వయసు అలాంటిది.
2. మీకు సాహిత్యం అంటే ఆసక్తి ఎప్పుడు ఎలా ఏర్పడింది?
మా అమ్మ చదువుకోలేదు. కానీ తను అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి అద్భుతమైన కథకులు. మా ఊర్లో కాదరిల్లి (ఖాదర్ వల్లి) తాత, బడేసాబ్ ఉండేవారు. వీళ్లిద్దరూ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి వచ్చేవాళ్లు. ఇంటి ముందు అరుగుమీద కూర్చుని వారి జీవితానుభవాలను కథలుగా చెప్పేవాళ్లు. అవి బాల్యంలో వినడం చాలా బాగుండేది. (వారు చెప్పేవాటిలో కొన్ని అతిశయోక్తులని నాకు పెద్దయ్యాక తెలిసింది. అయినా ఆ కథలు చాలా గొప్పేగా చెప్పేవారు). బడేసాబ్ భార్యను అవ్వ అని పిలిచేవాడిని. ఆమె ముగ్గురు మరాఠీలు, సాసవల చిన్నమ్మ, మాయలఫకీరు.. కథలు చెప్పేది. మా పక్కింటిలో ఉండే చోటీ ఒకే కథను రోజూ చెప్పేది. అది హాస్య కథ. కాదరిల్లి తాత కొడుకు పీరాంసాబ్ మంచి జానపద కథలు చెప్పేవాడు. పొలంలో వేరుశనగ కాయలు ఒలిచేదానికి వెళ్లామంటే రోజంతా కథ చెప్పేవాడు. ఒక్కోసారి ఆ కథ రోజంతా చెప్పినా అయిపోయేది కాదు. తరచూ మా ఇంటికి రాత్రి వేళ మా వీధిలో ఉండేవాళ్లు.. ముఖ్యంగా సాయుబులు ఆడామగా అనే తేడా లేకుండా వచ్చేవాళ్లు. అర్ధరాత్రి దాకా కథలతో సందడిగా ఉండేది.
చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరగడం వలనేమో నాకు బాల్యంలోనే కథలంలే ఆసక్తి ఏర్పడింది. వినడం, నేనూ నా తోటి పిల్లలకు చెప్పడం వలన నాకు పదేళ్ల వయసుకే.. దాదాపు వందకు పైగా కథలు వచ్చేటివి. మా పక్కన ఇంటిలో సురేంద్రరెడ్డి అనే అతను ఉండేవాడు. నాకంటే ఏడెనిమిదేళ్లు పెద్దవాడు. తను పుస్తకాలు బాగా చదివేవాడు. తన వద్ద ట్రంకుపెట్టె నిండుకు పుస్తకాలుండేవి. వాటిని చూస్తే నాకు పెద్ద నిధిలా అనిపించేది. నేను తరచూ వాటిని చదివేవాడిని. అతని దగ్గరే ‘అసమర్థుని జీవయాత్ర’ నవల మొదటిసారి చదివాను. ఇంట్లో బడిపుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే నాన్న అరిచేవాడు. ఇలా ఒకసారి అసమర్థుని జీవయాత్ర చదువుతూ నాన్నకు దొరికిపోయి దెబ్బలు తిన్నా. చెప్తే ఆశ్చర్యపోతారు.. నేను రెండో తరగతి సెలవుల్లో చదివిన మొట్టమొదటి నవల ‘బాటసారి’. ఆ వయసులో అర్థం కాకపోయినా.. నన్నెందుకో అక్షరాలు పిచ్చెక్కించేవి. పుస్తకాల వెంట పరుగులు తీయించేవి. బహుశా.. పేదరికం కారణంగా ఇంట్లో పుస్తకాలను కొనలేని స్థితి కూడా ఈ పుస్తకాల పిచ్చికి ఒక కారణమేమో. ఇప్పుడు మా ఇంట్లో వేల పుస్తకాలున్నాయి. నెలలో ఇప్పటికీ కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా పుస్తకాలు కొంటుంటాను.
నేను ఆరో తరగతి చదివే రోజుల్లో మా కేవీపల్లెలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులోని పుస్తకాలను చూడగానే నాకు పెద్ద నిధి దొరికినట్టు అయింది. 15 రూపాయల మెంబర్ షిప్ కడితే ఇంటికి పుస్తకాలు ఇచ్చేవాళ్లు. మెంబర్ షిప్ కట్టే పరిస్థితి మాకు లేదు. దీంతో సెలవు ఉందంటే చాలు నా కేరాఫ్ అడ్రస్ లైబ్రరీగా మార్చేసుకున్నా. మాకు సాయంకాలం గంటసేపు ఇంటర్వెల్ ఉండేది. పీఈటీ లేరు. దీంతో రోజూ ఆ గంట సేపు లైబ్రరీలో గడిపేవాడిని. అందులోని పుస్తకాలన్నీ రెండుసార్లు చదివేశా. ఇవన్నీ కూడా నాకు తెలీకుండానే నాలో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచాయి.
3. మీ సాహిత్య ప్రస్థానం గురించి...
నేను ఐదో తరగతిలో ఉండగా ‘గడ్డిపరక’ అనే కథ రాసి చందమామకు పంపాను. ఆ కథ చేరిందో లేదో కూడా తెలీదు. నేను ఐదో తరగతిలో ఉండగా చదివిన మొట్టమొదటి డిటెక్టివ్ నవల ‘ఆపరేషన్ ఇన్ చైనా’. మధుబాబు నవలలు విపరీతంగా చదివేవాడిని. అందులోని షాడో పాత్ర అంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్. దాంతో నేనే ఏడో తరగతిలో ఉండగా నా హీరోకు ‘డబుల్ షాడో’ (షాడోకన్నా రెండింతలు బలవంతుడని అర్థం నా ఉద్దేశంలో) అని పేరు పెట్టి ఒక డిటెక్టివ్ నవల రాసే ప్రయత్నం చేశాను. నేను ఏడో తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాక ఇతర పుస్తకాలు చదివే విషయంలో ఇంట్లో ఆంక్షలు తొలగిపోయాయి.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా తాతగారు ముగ్గురు. పెద్ద తాత, రెండో తాత నాటకాలు వేసేవారు. సేద్యం చేసేవాళ్లు. రెండో తాత పెళ్లి కూడా చేసుకోలేదట. నాటకాలే లోకంగా బతికాడు. మా నాన్న నాన్న చివరి వాడు. ఆయన వైద్యం చేసేవాడు. ఉస్తికాయలపెంట అనే ఊరికి కరణంగానూ పనిచేశాడట. మానాన్నకు ఐదేళ్ల వయసు వచ్చేప్పటికే వీళ్లందరూ చనిపోయారు. అంటే నేను చెప్తున్నది సుమారు 70ఏళ్ల నాటి సంగతి. మా తాతల వారసత్వం నాకూ వచ్చిందని ఇంట్లో అంటుంటారు. ఇక మానాన్న మంచి పాటగాడు.
నా మొదటి కథ ‘భూమి గుండ్రంగా ఉంది’ 1998 మార్చి నెలలో స్వాతి వారపత్రికలో వచ్చింది. అయితే దీనికంటే ముందుగా ‘బంగారు పంజరం‘ అనే కథం 17 మార్చి 1997 వార్త దినపత్రికలోని సోమవారం నాటి ‘చెలి’ అనుబంధంలో వచ్చింది.
4. ఇప్పటి వరకు వెలువడిన మీ రచనలు, అముద్రిత రచనల గురించి...
ఇప్పటి వరకూ దాదాపు వంద కథలు రాశాను. కవితలు కూడా కొన్ని రాశాను. పల్లెల్లో ఆడుకునే ఆటలను (ముప్పై ఏళ్ల క్రితం ఆటలు. ఇప్పుడు ఈ ఆటలు పల్లెల్లో కూడా దాదాపు అడటం లేదు). ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో 2005లో సీరియల్‌గా రాశాను. అవి విశాలాంధ్రవారు ‘మనమంచి ఆటలు’ పేరుతో పుస్తకంగా తెచ్చారు. అదే నా మొదటి పుస్తకం. తర్వాత 13 కథలతో ‘అన్నంగుడ్డ’, మరో 13 కథలతో ‘దృశ్యాలుమూడు ఒక ఆవిష్కరణ’, 18 కథలతో ‘ఒక మేఘం కథ’ సంపుటాలుగా వచ్చాయి. ‘నీరు నేల మనిషి’, ‘రెక్కాడినంత కాలం’ నవలలూ పుస్తకాలుగా వచ్చాయి. మొత్తం ఆరు పుస్తకాలు. వీటిలో మూడు పుస్తకాలను విశాలాంధ్రవారు ప్రచురించారు.
ఆంధ్రభూమి దినపత్రికలో ‘వెన్నెముక’, ‘అమ్మానాన్నకు’ అనే నవలలు సీరియల్‌గా వచ్చాయి. ఆంధ్రభూమి మాసపత్రికలో రెండు సంచికల్లో వచ్చిన ‘మిస్సింగ్’ అనే నవల ఉంది. ఇవన్నీ పుస్తకాలుగా రావాల్సి ఉంది. ఇక పుస్తకంగా వేయదగ్గ కథలు సుమారు 30దాకా ఉన్నాయి. వీటిలో పదికి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. ఇక రాసి అచ్చుకాని నవలలు మరో రెండు ఉన్నాయి.
5. వడ్రంగి వృత్తికి. పాత్రికేయ జీవితానికి, రచయితగా కొనసాగటానికి మధ్య ఎలా సమన్వయం కుదిరింది..?
తిరుపతిలో 1994 నుంచి 2002 వరకు ఎనిమిదేళ్లకు పైగా వడ్రంగి వృత్తితో జీవినం సాగించా. ఏ వృత్తిలో ఉన్నా చదవడం, రాయడం అనేవి నాకు ఇష్టమైన వ్యాపకాలుగా ఉండేవి. దీంతో వడ్రంగిగా ఉన్నప్పుడే కొంతకాలం తిరుపతిలో ‘కళాదీపిక’ అనే పక్షపత్రికలో వ్యాసాలు రాసేవాడిని. తిరుపతిలో జరిగే కల్చరల్ కార్యక్రమాలను రిపోర్ట్ చేసేవాడిని. నా పాత్రికేయ జీవితం అలా మొదలైంది. నా చేతిరాతలో ఒక పేజీ రాసి ఇస్తే ఆ పత్రిక ఎడిటర్ వి.ఎస్.రాఘవాచారి గారు నాకు రూ.50 ఇచ్చేవారు. వారు డబ్బు ఇస్తున్నారు కదా అని నేను ఏవంటే అవి రాసేవాడిని కాదు. ముఖ్యంగా ఆ పుస్తకంలో సంగీత, సాహిత్య, నాటక రంగాలవారిని పరిచయం చేస్తూ వ్యాసాలు రాసేవాడిని. బయోడేటా ఎడిటర్‌కు పంపేవారు. నేను దానిని వ్యాసంగా మలిచేవాడిని. అప్పట్లో నేను రాసిన వ్యాసాల్లోని వ్యక్తులు తర్వాత ఆ యా రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.
వడ్రంగి వృత్తికి, పాత్రికేయ జీవితానికి మధ్య.. నాలో ఉండే విపరీతంగా పుస్తకాలు చదవడం, రాయడం అనే పిచ్చి ఒక వంతెనలా నిలిచింది. అయితే.. 2002 సెప్టెంబర్‌లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్-ఎడిటర్‌గా కొత్త జీవితం మొదలు పెట్టాక వడ్రంగం వృత్తిని వదిలేశాను. కుల వృత్తిని వదిలేసి కొత్త వృత్తిలోకి అడుగు పెట్టడానికి ప్రధానకారణం అనారోగ్యం. నిజానికి నేను వడ్రంగిగా ఉన్నప్పుడే ఎక్కువ పుస్తకాలు చదివే వీలున్నింది. నా జీవితం నా చేతుల్లో ఉండేది. ఇప్పుడలా కాదు..
6. ముక్కుసూటి మనిషి అని మీకు పేరుంది. ఎందుకు..?
తప్పును తప్పు అని చెబుతాను. తప్పు చేసిన వ్యక్తి చాలా ‘పెద్దమనిషి’ అయినా భయపడను. ఆ వ్యక్తి నా భవిష్యత్తుకు అడ్డంపడతాడని, నాకు అవార్డులు లేదా బహుమతులు రాకుండా చేస్తాడని తెలిసినా.. మౌనంగా ఉండను. వ్యక్తిగత జీవితంలోనే కాదు... సాహిత్య పయనంలోనూ ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయి. చాలా పేరున్న వ్యక్తులను నిలదీశాను. ఫలితంగా ఇబ్బందులు పడ్డాను. కొన్ని కోల్పోయాను. కోల్పోవడం కాదు.. నాకు రావలసినవి రాకుండా పోయాయి. వాళ్లను ప్రశ్నించినందుకు ఇవి నాకు రాలేదని తెలుసు. దీనికి నేనేమీ బాధపడ్డం లేదు. వాళ్లను ప్రశ్నించినందుకు పశ్చాత్తాప పడ్డమూ లేదు. కాలం (వయసు)తో పాటు నాలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు ముందంత అగ్రెసివ్‌గా ముఖాన్నే మాట్లాడ్డం లేదు కానీ.. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటున్నా. పాతికేళ్ల క్రితం రచయితలంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. వాళ్లు అసాధారణ వ్యక్తులని అనుకునేవాన్ని. అనుభవంతో అర్థమయింది ఏమంటే చాలామంది రచయితలకంటే సాధారణ వ్యక్తులు చాలా ఉన్నతులని. ఇది తెలిశాక రచయితలను ప్రశ్నించాల్సిన అవసరం లేదనిపించింది.
7. కథలు, నవలలు కవితలు రాస్తున్నారు కదా.. మీకు ఏ పక్రియ అంటే ఎక్కువ ఇష్టం?
ప్రారంభంలో కవితలు రాసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర కవితలు రాసి పెట్టుకున్న నోట్‌బుక్స్ నాలుగున్నాయి. కొన్ని కవితలకు బహుమతులు కూడా అందుకున్నా. మూడుసార్లు రంజని కుందుర్తి యోగ్యతాపత్రాలు అందుకున్నాను. తర్వాత కథల్లోకి అడుగుపెట్టాను. కథలు రాస్తూనే నవలలు రాయడం మొదలు పెట్టాను.
కవిత మెరుపులాంటిది. కథ వర్షంలాంటిది. నవల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన గాలివాన లాంటిది. నేను ప్రారంభంలో కవిత్వం ఎక్కువ చదివేవాడిని. తర్వాత కథలు ఎక్కువ చదివాను. ఆ తర్వాత నవలలు ఎక్కువ చదివాను. ఈ మూడు పక్రియల్లోనూ రాశాను. నా మటుకు నాకు నవల ఇష్టమైన పక్రియగా మారింది. మంచి నవలలోనే కవిత్వమూ ఉంటుంది. కథా ఉంటుంది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సవివరంగా చెప్పగలిగే అవకాశమూ ఉంటుంది.
8. సాహిత్యంలో మీకు స్ఫూర్తి కలిగించిన వాళ్లు..?
సాహిత్యం అనేది మనం తినే ఆహారం లాంటిది. బాల్యం నుంచి పెరిగే వయసుతో పాటు.. తినే ఆహారంలో ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. లేదూ ఇష్టపడే ఆహార పదార్థాలు పెరుగుతుంటాయి. సాహిత్యంలో స్ఫూర్తికూడా అలాంటిదే.. కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ, తిలక్ కవిత్వం పిచ్చిగా చదివేవాడిని. వారిని ఇమిటేట్ చేస్తూ ప్రారంభంలో కొన్ని కవితలు కూడా రాశాను. తర్వాత కె.శివారెడ్డి, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, కొప్పర్తి, ఆశారాజు, పాటిబండ్ల రజని, మందరపు హైమవతి, కొండేపూడి నిర్మల కవితలు ఇష్టంగా చదివా. కథకుల్లో కొకు, ఇనాక్, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కారా, మునిపల్లె రాజు, ఓల్గా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బండి నారాయణస్వామి, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, డాక్టర్ వి.చంద్రశేఖరరావు కథలు ఎక్కువ చదివా. ఇక నవలలంటే బాల్యంలో త్రిపురనేని గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కొకు, వడ్డెర చండీదాస్ నవలలు చదివా. తర్వాత డాక్టర్ కేశవరెడ్డి నవలలు. నా దృష్టిలో •కేశవరెడ్డిని మించిన నవలా రచయిత తెలుగులో ఇప్పటి వరకూ లేరు. పైన చెప్పిన వీళ్లే కాదు.. నేను చదివిన ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు కారకులైన వారంతా నాకు స్ఫూర్తి కలిగించిన వారే..
9. మీరు అనువాద రచనలను ఇష్టంగా చదువుతారు కదా.. ఆ ఆసక్తి ఎలా ఏర్పడింది?
తిరుపతిలో విశాలాంధ్ర బుక్ హౌస్ ఉంది. అక్కడికి 1995 నుంచి వెళుతున్నాను. అప్పట్లో పుస్తకాలు కొనేదానికి డబ్బులు ఉండేవి కావు. అప్పుడప్పుడు వాళ్లు క్లియరెన్స్ సేల్ పెట్టేవాళ్లు. అందులో కొన్ని పుస్తకాలు 50 శాతం డిస్కౌంట్‌తో ఇచ్చేవారు. అలా కొన్ని రష్యన్ అనువాదాలు కొన్నాను. టాల్స్టా•••• ‘కొసక్కులు’, కుప్రీన్ ‘రాళ్లవంకీ’ అప్పుడు కొన్నవే. మధురాంతకం నరేంద్రగారు తరచూ అనువాద నవలల గురించి చెప్పేవారు. చదవమని ఇచ్చేవారు. అన్నాకరేనినా, శరత్ శ్రీకాంత్ నవలలు, జయకాంతన్ కథలు వారు ఇచ్చి చదవమన్నారు. రెండేళ్లు హైదరాబాదులో ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో పనిచేశాను. ఆ సమయంలో హెచ్‌బీటీ వారు వేసిన బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవల వేమన వసంతలక్ష్మిగారు ఇచ్చి కొనుక్కోమని చెప్పారు. ఆ నవల నన్ను దిగ్భ్రమకు గురిచేసింది. చదివాక కొన్ని కాపీలు కొని మిత్రులకు ఇచ్చాను. హైదరాబాదులో జరిగే కేంద్రసాహిత్య అకాడమీ మీటింగుల్లో వారి ప్రచురణలు కొనుక్కునేవాడిని. అలా మొదలైంది. ఇప్పుడు నా దగ్గర అనువాద సాహిత్యం చాలానే ఉంది. శరత్ సమగ్ర సాహిత్యం ఈమధ్యే కొని చదివాను. బిభూతి ‘వనవాసి’, బి.వసిల్యేవ్ ‘హంసలను వేటాడొద్దు’, చెంగిజ్ ఐత్మాతోవ్ ‘తల్లి భూదేవి’ నేను మళ్లీ మళ్లీ చదివిన నవలలు.
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు, పుస్తకాలు?
ప్రభావం చూపిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. మన వయసు, ఆలోచనా తీరు ఎదిగే కొద్దీ ఇవీ మారుతుంటాయి. మనుషులు కూడా అంతే.
నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటివారు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, విష్ణుప్రియగారు. 1999లో వీరి పరిచయం మొదటి సారి అయింది. అప్పటికి నేను కార్పెంటర్ (వడ్రంగి)గా జీవనం సాగిస్తున్నా. నేను చాలా ఇళ్లకు పనిచేశాను. పనిచేసినంత వరకే. తర్వాత తిరుపతిలో కార్పెంటర్లను చాలామంది సాటి మనుషులుగా గుర్తించరు. వాళ్ల ఇళ్లకు వెళితే టచ్‌మీ నాట్ అన్నట్టుంటారు. అలాంటి రోజుల్లో ఒకసారి విష్ణుప్రియ అమ్మ వాళ్ల ఇంటిలో రెండురోజులు వుడ్ వర్క్ చేశాను. మొదటి రోజు పనికి వెళ్లినప్పుడు ఉమాగారు నాతోపాటు ఉన్నారు. మధ్యాహ్నం అక్కడే భోజనమని చెప్పారు. కాళ్లు చేతులు కడుక్కుని భోజానికి వెళితే డైనింగ్ టేబుల్ వద్ద భోజనం. నేనూ, ఉమాగారు ఎదురెదురుగా కూర్చున్నాం. విష్ణుప్రియగారు స్టవ్ దగ్గర ఆమ్లెట్ వేసి వేడివేడిగా పెట్టారు. ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మరచిపోలేను. చేసే పనిని, కులాన్ని, ఆర్థిక స్థితిని కాకుండా.. మనిషిని మనిషిగా చూసిన వ్యక్తులను నా జీవితంలో నేను మొదటిసారి చూసింది అప్పుడే. ఇక రచనల పరంగానూ ఉమాగారి ప్రభావం నాపైన చాలా ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేస్తున్నానంటే అది వారి చలవే.
మధురాంతకం నరేంద్రగారు, బండి నారాయణస్వామి, అల్లం రాజయ్య, పులికంటి కృష్ణారెడ్డి, డాక్టర్ వి.ఆర్.రాసాని.. నేను సాహిత్యంవైపు అడుగులు వేసిన తొలిరోజుల్లో వీరి సూచనలు నాకు చాలా ఉపకరించాయి.
సీరియస్ సాహిత్యంలో ఎవరి స్థానం వారికి ఎప్పుడూ ఖాళీగా ఉంటుందని, దానిని పూరించుకుంటూ వెళ్లడమే మనం చేయాల్సిన పని అని మధురాంతకం నరేంద్రగారు అన్నారు. నేను రచయితగా ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవడానికి వీరి మాటలు దోహదం చేశాయి.
మనం ఏ కథ రాసినా, అందులో ఏ పాత్రను సృష్టించినా.. మన జీవితంలోంచే తీసుకోవాలని, మనం సృష్టించే పాత్రకు మన జీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులను ఊహించుకుంటే దానికి సహజత్వం వస్తుందని ఉమాగారు అన్నారు. అందరి జీవితం స్వల్ప మార్పులతో ఒకేలా ఉంటుందని, అయితే వారి ఆలోచనా తీరు చదివిన పుస్తకాలు చూసే దృష్టికోణం.. కథను కొత్తగా మలుస్తుందని చెప్పారు. అంటే.. కథను ఎలా రాయాలో చెప్పారు.
అప్పటికే కొన్ని కథలు ప్రచురణ అయ్యాయి. రెండు కథలకు బహుమతులు వచ్చాయి. ఆ సమయంలోనే.. నా జీవితాన్ని నేను కథలుగా మలచాల్సిన అవసరాన్ని బండి నారాయణస్వామిగారు చెప్పారు.
తొలిరోజుల్లో నాకు మాండలికం అంటే ఏంటో తెలీదు. తెలంగాణ, కోస్తాంధ్ర, కళింగాధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలు కలిపి ఒక కథ రాశాను. ఆ కథ స్క్రిప్ట్ డాక్టర్ వి.ఆర్.రాసానిగారు చదివి మాండలికాల గురించి వివరించారు. ఒక పేజీని కరెక్షన్ చేసి ఏ పదం ఏ ప్రాంతానిదో చెప్పారు. నా జీవభాష ఏదో నాకు తెలిసేలా చేశారు. అప్పటి వరకూ నాకు ఆ భేదం తెలీదు.
11. అంతర్జాల సాహిత్యం గురించి మీ అభిప్రాయం?
అంతర్జాల సాహిత్యం నేను ఎక్కువగా ఫాలో కావడం లేదు. నాకు పుస్తకం చేతిలో పట్టుకుని చదువుకోవడమే ఇష్టం. ఇంగ్లీషుమీడియం చదువుల నుంచి వచ్చిన రచయితలు ఇప్పుడు ఎక్కువమంది అంతర్జాలంలో తెలుగుసాహిత్యం రాస్తున్నారు. వీరిలో చాలామందికి వాక్యం రాసేది సరిగా రాదు. చదవగలరు. టెక్నాలజీ పెరిగింది. రాసే అవసరం లేకుండా ‘చెప్తుంటే టెక్సట్ టైప్’ అయ్యే సాఫ్ట్వేర్ వచ్చింది. కొంతమంది దీనిని ఉపయోగించి కథలు రాస్తున్నారు. చాలా అంతర్జాల పత్రికలు కూడా ‘యూనికోడ్’ ఫాంట్లోనే కథలు కోరుతున్నాయి. అలా లేదంటే పంపొద్దు అంటున్నాయి. అంటే ‘యూనికోడ్’ ఫాంట్లోనే రాయాల్సిన ఒక అనివార్యతను తెచ్చాయి. దీంతో భవిష్యత్తులో ఇలా రాయగలిగేంత తెలుగైనా వచ్చేవారు ఉండకపోవచ్చు.
12. మీ కవితా సంపుటి ఇంతవరకు రాలేదు కదా..! ఎప్పుడు తెస్తున్నారు?
తొలిరోజుల్లో రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కవితలకు పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. పదేళ్ల క్రితం అయితే ఆ కవితలతో పుస్తకం తెచ్చి ఉండచ్చు. ఇక వాటిని పుస్తకంగా తేవాల్సిన అవసరం లేదనుకుంటున్నా.
13. చాలా రచనలకు మీకు బహుమతులు, అవార్డులు వచ్చాయి కదా.. అవార్డులు బహుమతులకోసం మీరు ప్రత్యేకంగా రాస్తారా..?
నేను మొదట్లోనే చెప్పాను కదా. చాలా లేమి నుంచి వచ్చాను. జీవితంలో డబ్బు ప్రధానం కాకపోయినా చాలా వాటికి డబ్బే ప్రధానం. కనీస అవసరాలు తీరాలన్నా డబ్బు ఉండాల్సిందే. ఆ డబ్బు కూడా నా దగ్గర ఉండేది కాదు. అలాంటి సమయంలో నన్ను కథల పోటీలు ఆకర్షించాయి. నేను ఇంటర్మీడియట్ చదివేరోజుల్లోనే స్వాతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో పోటీలకు కథలు రాశాను. కేవలం డబ్బు వస్తుందని ఆశతోనే. తర్వాత తర్వాత కూడా నేను డబ్బు అవసరం అయ్యే పోటీలకు కథలు, నవలలు రాశాను. అలా అని బహుమతి రావాలని నా పాత్రలను చంపేయడమో, విపరీతమైన కష్టాలకు గురిచేయడమో చేయలేదు. అంటే.. బహుమతికోసం నేల విడిచి సాముచేసే కథలు, సినిమాటిక్ కష్టాల కథలు ఎప్పుడూ రాయలేదు.
బహుమతి కథలకు / నవలలకు గుర్తింపు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పాఠకులు చదువుతారు. ఇది కూడా పోటీలకు రాయడానికి మరో కారణం.
పోటీకి రాయడం వేరు. బహుమతుల కోసం ప్రత్యేకంగా రాయడం వేరు. నేను బహుమతుల కోసం ‘ప్రత్యేకం‘గా ఎప్పుడూ రాయలేదు. ఎప్పుడూ రాయను.
14. పాఠకుల నుండి మీకు ఎదురైన అనుభవాలు, మీకు లభించిన ప్రోత్సాహం.. గురించి..
‘గాలి’ పేరుతో ఒక కథ రాశాను. అది 2004లో నవ్య వీక్లీలో వచ్చింది. రిజర్వేషన్ కింద ఎస్సీఎస్టీలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేస్తుంటారు. పేరుకు సర్పంచ్ ఎస్సీ అయినా వారిని నడిపించేదంతా అక్కడి పెత్తందారే. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చి, తర్వాత తమ కులంవారి మధ్య ప్రిస్టేజ్ సమస్యగా మారి గెలుపుకోసం ప్రయత్నం చేసి.. ఆ ప్రయత్నంలో అప్పులయ్యి.. చివరికి తమను నిలబెట్టిన ‘పెద్దమనిషి’ సాయం చేయకపోవడంతో.. ఎంపీటీసీగా గెల్చిన ఓ మహిళ అప్పులు తీర్చేదానికి కువైత్ వెళ్లారు. రిజర్వేషన్ల పేరుతో ఎస్సీఎస్టీలను పెత్తందార్లు ఎలా ఆడుకుంటారనేది ‘గాలి’ కథలో చెప్పాను. అప్పుడు నేను తిరుపతి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఒకతను వచ్చి తలుపు తీసి మెళ్లిగా దేవేంద్ర సార్ అని పిల్చాడు. తిరిగి చూస్తే ఓ పెద్దాయన. మా ఆఫీసులోనే అటెండర్‌గా పనిచేస్తుంటాడు. అతను మిషన్ సెక్షన్లో ఉంటాడు. చూశాను కానీ పరిచయం లేదు. లేచి అతని వద్దకు వెళ్లాను. ‘‘కత ఏం రాసినారు సార్.. ఇంగన్న మా మాల నాకొడకలకు బుద్దిరావాల’’ అన్నాడు. ఇది నాకు పెద్ద మెచ్చుకోలు.
‘నీరు నేల మనిషి’ 2006లో చతురలో వచ్చింది. మా వెనక వీధిలో ఉండే కవిత అనే ఆవిడ తరచూ మా ఇంటికి వచ్చేది. మా దేవితో కాసేపు మాట్లాడి వెళ్లేది. ఆమె ఈ నవల చదివాక మా ఇంటికొచ్చి ‘‘అనా.. నువ్వు మా కతే రాసినావు.. అంతా మా నాయక కతేన్నా’’ అంది. రచయితలు, సాహిత్యకారుల స్పందన గురించి నేను చెప్పడం లేదు. నేను కథలు రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో టెక్నాలజీ ఇంత ఎక్కువ లేదు. అప్పుడు కమ్యూనికేషన్ అంటే ఉత్తరాలే. ఆ రోజులే బాగుండేవి.
15. కొత్తగా రచయితలు పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి?
కొత్త రచయితలు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. అయితే వారు ఎక్కువ కాలం రచయితలుగా కొనసాగలేకపోతున్నారు. ఒకటి రెండు పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేదే ఏ రంగంలో అయినా మనం ఎంతకాలం ఎంతబాగా రాణించగలం అనేది నిర్ణయిస్తుంది. వెయ్యి పేజీలు చదివితే గాని •రెండుమూడు పేజీలు రాయగలిగేంత శక్తి రాదు. ఇప్పటి వరకు నేను సుమారు 2,500 పేజీల రచనలు చేశాను. వేల పుస్తకాలు చదివాను. కొత్త రచయితలు చాలామంది ఇతరుల రచనలు ఒక్క పేజీ కూడా చదవరు. ఎక్కువకాలం రచయితలుగా కొనసాగాలంటే ఎక్కువగా చదవాలి.
16. మీ దృష్టిలో ఉత్తమ సాహిత్యం అంటే ఏమిటి?
మనిషిని మూఢత్వం వైపు కాకుండా వెలుగువైపు పయనింప చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే. సంప్రదాయాల పేరుతో ఆగిపోకుండా కాలంతో పాటు పయనించేలా మనిషిని ప్రోత్సహించేదీ ఉత్తమ సాహిత్యమే. మనిషిని మనిషిగా గుర్తించేలా చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే.
17. సాహిత్యంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
సాహిత్యంలో మార్పులను కాలమాన పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ మేరకు మనకు తెలీకుండానే మార్పునకు గురవుతూ ఉంటాం. మీరు గమనించే ఉంటారు. ఇప్పటికే సాహిత్యంలో చాలా మార్పులు వచ్చాయి. యాభై అరవై పేజీల కథ నుంచి ఇప్పుడు ఐదారు వాక్యాల మైక్రో కథలుగా కథ మార్పు చెందింది. రచయిత పనిగట్టుకుని సాహిత్యంలో మార్పుకోసం ప్రయత్నించినా.. అప్పటి సమాజానికి ఏది అవసరమో అదే నిలబడుతుంది.
18. సమాజంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
సమాజంలో మార్పులు చాలా రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పులు అవసరం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సాహిత్యం వచ్చేది కాదు. వచ్చే సాహిత్యంలో ఎక్కువ భాగం సమాజంలో మార్పు కోరేదే కదా..
19. సమాజంలో రావాల్సిన మార్పులకు సాహిత్యం ఏ విధంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు?
సమాజం సాహిత్యం పరస్పర ప్రేరకాలు. అయితే సమాజ గమనంలో వేగం పెరిగింది. ప్రాధాన్యాలు పెరిగాయి. సమాజంలోని మనుషులే కదా రచయితలు కూడా. వీరి ఆలోచల్లోనూ రచనల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు సమాజానికి సాహిత్యం గాలిబుడగలా కనిపిస్తోంది. సాహిత్యంలో తమ ప్రతిబింబాలను చూసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడ్డం లేదు. ఎవరి గాలిబుడగలను వాళ్లే సృష్టించుకుని ఎవరిలోకంలో వాళ్లున్నారు. అందువలన సమాజంపై సాహిత్యం ప్రభావం చాలాచాలా స్వల్పమైపోయింది. అచ్చులో వచ్చే సాహిత్యం ప్రభావం నామమాత్రమే.
20. కొత్తరా రాయాలనుకుంటున్న వాళ్లకోసం మీ సూచనలు..
మీ అమాయకత్వంగానీ.. కొత్తగా రాసేవాళ్లు ఎవ్వరూ ఎవ్వరి సూచనలూ పాటించరు. ఇప్పుడొచ్చే కొత్త రచయితల్లో చాలామంది స్వయం ప్రకాశకులు. ఇతర్ల రచనలు చదవరు. పుస్తకాలు అస్సలు కొనరు.
21. ఇప్పుడేం రాస్తున్నారు..?
నేను తిరుపతిలో చాలాకాలం ఉన్నాను. తిరుపతి మా సొంతూరులా మారిపోయింది. ఎర్రచందనం శేషాచల అడవుల్లో మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన వార్త పేపర్లో రోజూ తప్పకుండా ఒక్కటైనా ఉంటుంది. ఎర్రచందనం నేపథ్యంలో నేను ‘హత్య’ అనే కథ 2014లో రాశాను. ఎర్రచందనంపై వచ్చిన మొదటి కథ ఇదే. చాలా ఏళ్లుగా ఎర్రచందనం నేపథ్యంతో నవల రాయాలని ప్రయత్నిస్తున్నాను. దానికి సంబంధించి చాలా సమాచారం సేకరించాను. దాదాపు ఏడాదిగా ఆ నవల రాస్తున్నా.
22. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?
మన ఇతిహాసాలు, పురాణాలలో విశ్వకర్మ / మయబ్రహ్మ ప్రస్తావన ఉంది. దేశంలో ఏ మూలకు పోయినా విశ్వకర్మలు పనిచేసిన ఆలయాలు, కోటలు ఉన్నాయి. వేల ఏళ్లుగా ఈ దేశ అభ్యున్నతికి విశ్వకర్మలు చేసిన కృషిని విపులంగా నవల రాయాలనుంది.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సదయ్య ఉప్పులేటిగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నాపేరు సదయ్య అవ్వ పోసమ్మ, బాపు రాయ పోచయ్య.మాది తెలంగాణలోని కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని పొట్యాల గ్రామం.మా గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతం.నాకు ఒక చెల్ల ఒక తమ్ముడు.మా ముగ్గురిని కూలి పని చేస్తూనే ఉన్నత చదువులు చదివించారు మా అవ్వ బాపులు. మా పాఠశాల విద్యాభ్యాసం అంతా మా ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. నిజానికి నేను చదువురాని ఒక మొద్దును. చిన్ననాటి నుంచే నాకు ఆత్మవిమర్శ ఎక్కువ అనుకుంటా. తొమ్మిదో తరగతి కి రాగానే నా లోపాన్ని నేను గుర్తించి చదువు మానేస్తా అనంగానే నా మిత్రుడు తొమ్మిది దాకా వచ్చావు కదా ఆయింత పదవ తరగతి చదువు అని సలహా ఇవ్వటం. తర్వాత కష్టపడి చదవడం నా గురువులు నాకు చదువు మీద ఆసక్తి పెంచడం వల్ల నేను పీజీ దాకా చదవగలిగాను.ఈ మద్యే 29.01.2017 నాడు మా బాపు మిషన్ భగీరథ పైప్ లైన్ల పడి మెడలు విరిగి మంచాన పడడం వల్ల మా బాపును చూసుకుంటూ, ఉన్న ఎకరం పొలం చేసుకుంటూ దొరికినప్పుడు కూలి పనికి పోతాను.మా అవ్వ, నా సహచరి హేమలత లు కైకిల్ పనికి పోతే ఇల్లు గడుస్తుంది. మొన్ననే మా తమ్మునికి ఎస్ ఎస్ సి లో జాబ్ వచ్చింది. కొంతవరకు సంతోషం.
2.మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.
నేను డిగ్రీ చేస్తున్నప్పుడు వరంగల్ లో ఉన్న "గోదావరి సాహితీ మిత్రులు" ఆవిష్కరించిన “మా భూమికోసం, మా హైదరాబాద్ కోసం” అనే కవితాసంపుటి రిలీజ్ కార్యక్రమానికి నేను నా మిత్రులు కలిసి పోయినం. అక్కడ చాలామంది పేరుమోసిన కవులు రచయితలను చూసి ఆనందించాను.తర్వాత నేను వరంగల్‌లో యం.ఏ తెలుగు చేస్తున్నప్పుడు మాకు నాలుగు సెమిస్టర్లో కలిపి స్త్రీ,వాదం దళిత వాదం, అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం అన్ని రకాల కవిత్వ వాదాలు వుండేటివి.అందులో భాగంగానే నందిని సిద్ధారెడ్డి గారి “ప్రాణహిత” కవిత్వం చదివి సార్ తో మాట్లాడాను. సార్ చాలా అనుకూలంగా స్పందించి నా సందేహాలు తీర్చాడు. “భవిష్యత్ చిత్రపటం” వివి సార్ ది సిలబస్‌లో చదివాక అనుకోకుండా విరసం సభలు జరగటం అక్కడ వివి సార్ ని చూసి ఆనందానికి గురి కావడం జరిగింది. “కొలిమి అంటుకున్నది” నవల కూడా మా సిలబస్‌లో భాగమే. అల్లం రాజయ్య గారిని కలిసి మాట్లాడినప్పుడు నవల గురించి చెబుతూ రాయటం లో మెలుకువలు చెప్పిండ్లు.“జానకి విముక్తి” నవల చదివి మా చుట్టుపక్కల ఆడవాళ్లకు జరుగుతున్న ఒత్తిడిలు పోల్చుకుని చాలా బాధపడ్డాను. సిలబస్‌లో భాగంగానే దిగంబర కవిత్వం చదవడం జరిగింది. అట్లాగే చంగిజ్ ఖాన్,రెయిన్ బో, నల్ల నరసింహులు నా అనుభవాలు, కొమురం భీం దొరికిన ప్రతి పుస్తకం చదవడం జరిగింది. ఇట్లా అనేక రకాల రచయితలు సంస్థలు పుస్తకాలు నా మీద ప్రభావం చూపించాయి అని నేను గర్వంగా చెబుతాను
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
నా తల్లి సంకలో ఉన్నప్పుడో, నాకు తెలిసి తెలియని వయసులో జరిగిన సంఘటనలో కానీ స్త్రీలపై అణిచివేత దళితుల మీద ఒత్తిడి, దొరల దోపిడీతనం వల్ల దళిత కుటుంబాలైన మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది.దొరల ఇళ్లల్లో పొలాల్లో ఎట్టి చాకిరి చేసిన అనుభవం మా అవ్వకు బాపుకు ఉన్నది. వారు ఏదో ఒక్క సమయం లో పడ్డ కష్టాలు వేరే వాళ్ళతో నెమరు వేసుకున్న సందర్భంలో నేను విని చాలా చలించిపోయాను. దొరల ఆగడాలు చూడలేక వారికి వ్యతిరేకంగా కొట్లాడిన వారిని అవ్వ సంకలో ఉండి కొంత చూసిన. ఈ చరిత్ర పరిచయం ఉన్నవారు ప్రత్యక్షంగా పాల్గొన్న వారు చెప్పినప్పుడు విన్నాను.ఇవన్నీ నేను పీజీ చేస్తున్నప్పుడు ఆయా రచయితలు చెప్పిన పద్ధతులు ఇని మనం కూడా రాయవచ్చు కదా అనే ఆలోచన వచ్చి విన్నవి , కన్నవి కథలు రాయడం ప్రారంభించాను.
4. మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.
నా సాహిత్య ప్రవేశం గమ్మత్తుగా ఉంటది.నేను ఇంతకు ముందు చెప్పినట్టు నా పాఠశాల వయసులో చదువులో మొద్దును. అయితే మా గురువుగారు నాకు ఎనిమిదో తరగతిలోనే ప్రపంచ రాజ్యాల సంగ్రహ చరిత్ర, కన్యాశుల్కం, అసమర్ధుని జీవయాత్ర,మహాప్రస్థానం పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. పాఠ్య పుస్తకాలు పక్కన పారేసి ఈ పుస్తకాలు చదవడం మొదలైంది. అసలే చదువంటే ఇష్టం లేని నేను చాలా ఆసక్తిగా చదవడం జరిగింది. నిజానికి నాకు సాహిత్యం అంటే పీజీ లోకి వచ్చేవరకు ఏంటో తెల్వదు.బీఈడీ చేస్తున్నప్పుడు ద్రావిడ విశ్వవిద్యాలయంలో తుని నుంచి మిత్రుడు గణేష్ మీ తెలంగాణ సాహిత్యం బాగుంటది సదా. తెలంగాణ పాట పాడమని అడిగితే దరువు ఏస్తూ తెలంగాణ పాటలు పాడే వాడిని.అప్పుడంటే 2011లో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతున్నది. నాకు అప్పటికే ధూమ్ దాం ప్రోగ్రాం చేసిన అనుభవం ఉన్నది.అయితే చాలా అమాయకంగా గణేష్ ని సాహిత్యం అంటే ఏంటిదని అడిగేవాడిని. తాను అన్ని చెప్పేది. కానీ నాకు అర్థం అయ్యేది కాదు. వరంగల్ ckmకాలేజీలో యం. ఏ తెలుగు చేస్తున్నప్పుడు సాహిత్యం అంటే పూర్తిగా అర్థం అయింది.
సాహిత్యం లోకి వచ్చినంక, సాహిత్యం పరిచయం అయినంక మానసిక దృఢత్వం పెరిగింది. ఏ బలం లేనోళ్లు, అన్నం లేని వాళ్ళు అంత పెద్ద రాజ్యంతో తలపడుతున్నారు అంటే అది కేవలం సాహిత్యం అందించిన మానసిక బలమే అనుకుంటాను.
5. సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను రాసినవి చాలా తక్కువ. గోదావరి సాహిత్య పత్రిక, నేను రచయితగా ఒకేసారి పుట్టినం. నేను రాసిన మొట్టమొదటి కథ “నిప్పు కణిక” గోదావరి ప్రారంభ సంచికలో వచ్చింది. అదే విధంగా నా కథలు, కవితలు అన్నీ గోదావరి పత్రికలనే వచ్చినయ్. “దొరల పంచాతు” కథ చదివి కేతిరెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడారు."ఉడో"కథ చదివి పి. చందు సార్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. “నక్క తోక”,”సంఘర్షణ” కథలు చదివి మిత్రులు అల్లం రాజయ్య సాహిత్యం మీకు ఇష్టమా అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే నేను గుర్తింపు కోసం మాత్రం రాయలేదు. నేను రాస్తాను అని కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?
ఇప్పటి జనరేషన్ మీద సినిమా ప్రభావం పడటం మూలంగా కొంత సాహిత్యం చదివేంత టైం కేటాయించడం లేదని నేను అనుకుంటున్న. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక దాని మీద స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం జరుగుతుంది.వారంతా సీరియస్ గా చదివి రాస్తే మాత్రం చాలామంది మంచి కవులు, రచయితలు బయటికి వస్తారు. ఇప్పటికే పేరుమోసిన వారి గురించి పక్కన పెడితే కొత్తగా రాస్తున్న యువకుల కొంతమంది రచనలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నాయి.చెప్పే విషయాన్ని కొత్త కొత్త కోణాలలో చెపుతున్నారు.మన ముందు సాహిత్యం చదువుతూ మన రచనలకు దారులు వేసుకోవాలి. మనం నివసిస్తున్న సమాజంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అదే సమాజంలో నుంచి వస్తువులు తీసుకుని అదే సమాజానికి చెప్పాలి.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకురాజు దొగ్గలగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు రాజు మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం,నాన్న పేరు సుధాకర్, అమ్మ పేరు స్వరూప, నాకు తోడు అక్క ఉంది,వ్యవసాయ మరియు శ్రమ ఆధారిత కుటుంబం నాకు తోడు అక్క తనకి పెండ్లి అయ్యింది.చిన్ననాటి నుండి విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే జరిగింది ప్రస్తుతం కరీంనగర్ లోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక శాస్త్రాలవిభాగంలో డిగ్రీ చేస్తున్న..
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నాకు మొట్టమొదట బాగా ప్రభావితం చేసిన వాటిలో ప్రథమ పాత్ర TVV విద్యార్థి సంగం యొక్క "స్టూడెంట్ మార్చ్" అనే పత్రిక.అందులో అచ్చు అయిన వ్యాసాలు కవితలు నన్ను సాహిత్యం దిక్కు ప్రభావితం అయ్యేలా చేసాయి. పాలకులు ప్రజలను చేస్తున్న దోపిడీ దానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్మించుకుంటున్న పోరాటాలు నాకు ముందుగా తెలిసింది స్టూడెంట్ మార్చ్ వల్లనే.అలాగే స్పార్టాకస్, అంటరాని వసంతం,ఏడు తరాలు,ఎర్ర నక్షత్రం,అమ్మ,సరిహద్దు లాంటి నవలలు నన్ను బాగా ప్రభావితం చేశాయి, "భగతసింగ్ వీలునామా" అనే పుస్తకం నాకు నిరంతర నూతన ఉత్తేజం. విరసం,వీక్షణం,శ్రామిక వర్గ ప్రచురుణలు లాంటి సాహిత్య సంస్థల ప్రభావం నా మీద ఉంది,అలాగే అలిశెట్టి ప్రభాకర్,శ్రీ శ్రీ ,వరవరరావు, శివ సాగర్,గుఱ్ఱం జాషువా, లాంటి కవుల రచనలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తోడ్పడ్డాయి.సమాజంలో స్త్రీ లు ఎదుర్కొంటున్నా సమస్యల మీద చాలా మంది రచనలు చేశారు.అలా స్త్రీల మీద వచ్చిన రచనల్లో నన్ను చాలా ఆకర్షించింది హైమావతి అక్క రాసిన "జోలే విలువ".ఆ పుస్తకంలో అక్క పితృస్వామిక పురాషాధిపత్య సమాజం స్త్రీని ఎలా దోపిడీకి గురి చేస్తుందో క్షుణ్ణంగా చెప్పింది.నన్ను కవిత్వం,వ్యాసాలు రాయడంలో ప్రతి క్షణం ప్రోత్సాహించిన ప్రియమైన TVV సహచరులకు,మరియు నా స్నేహితులకు ముఖ్యంగా స్నేహితురాలు మానసకి నన్ను వెన్నంటి ఉండి నా సాహిత్యాన్ని ఆదరించే సాహిత్య ప్రేమికులకు హృదయపూర్వక ప్రేమతో కూడుకున్న కృతజ్ఞతలు...
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.
ముఖ్యంగా ఇంత ఆధునిక కాలంలో కూడా సమాజంలో వివక్షలు, దోపిడీ,అణిచివేతలు, అసమానతలు ఉంటాయా..? అని చాలా మంది ఉన్నత అధికారుల్లో ఉన్న మేధావుల నుండి ప్రపంచ బ్యాంకు సామ్రాజ్యవాద దోపిడీకి గురి అవుతున్న ప్రజలు కూడా ఇప్పటికి అలాగే అనుకుంటున్నారు.పాలక వర్గాల ప్రజలను ఆ భ్రమల్లో ఉంచడంలో ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.అలా అనుకున్న వాడిలో నేను ఒక్కడిని. కానీ 2016 సంవత్సరంలో నాకు TVV విద్యార్థి సంగంతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో నేను విద్యార్థి ఉద్యమంతో పాటు,సమాజంలో ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆ క్రమంలో సాహిత్యం పై కూడా దృష్టి సారించాను.ఈ క్రమంలోనే రక్త సంబంధం కన్నా వర్గ సంబందం ఉన్నతమైంది అనే భావన నాలో బలంగా నాటుకుంది.క్రమ క్రమంగా ప్రజా ఉద్యమాలలో భాగమవుతున్న క్రమంలో పీడిత ప్రజల జీవిన స్థితి గతులు,నన్ను ఆలోచింప చేశాయి ఆ ఆలోచనలు నన్ను ప్రజల పక్షాన రచనలు చేసే విధంగా తోడ్పడ్డాయి.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
నాకు స్కూల్ లో ఉన్న సమయం నుండే పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది.మా నాన్న నా చిన్నప్పటి నుండే ఇంటికి పేపర్ తీసుకొచ్చేవాడు తప్పకుండా పేపర్ లో వచ్చే కొన్ని కొన్ని కథలు చదివే వాడిని.కానీ అందులో ఏది పాలకుల సాహిత్యం..? ఏది ప్రజల సాహిత్యం అని నిర్ధారించే జ్ఞానం నాకు ప్రజాఉద్యమాలు పరిచయం అయ్యే వరకు తెలియదు. అప్పుడు నేను అవి చదివిన కూడా ప్రతి చిన్న సమస్యకి మానసిక ఒత్తిడులను అధిగమించలేకపోయాను కానీ ప్రజల వైపు నిలబడ్డ సాహిత్యాన్ని చదవడం అలవాటు పడ్డాక ప్రతి సమస్యని మానసికంగా అధిగమించే ధైర్యం వచ్చింది, నాకు విద్యార్థి,ప్రజా ఉద్యమాల గురించి చదవడానికి సమాచారం దొరికింది సాహిత్యం వల్లనే. క్రమంగా ఆ సాహిత్యం చదవడం వల్లనే నాకు సమాజం మీద బాధ్యత పెరిగింది.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను నా సాహిత్యం ఇచ్చే గుర్తింపు గురించి ఎప్పుడు ఆలోచించలేదు.కేవలం నా సాహిత్యం నా కవిత్వం,రచనలు పీడిత ప్రజల పక్షాన, వాళ్ళ కష్టాల గురించి, ప్రజా ఉద్యమాల పక్షాన ఉండేలా జాగ్రత్త పడుతూ ఆ రాసే క్రమంలో ప్రజల నుండి నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ.ఆ నేర్చుకున్నది మళ్ళీ ప్రజల గురించి రాసినప్పుడు ప్రజలు ఆదరించే విధానమే నా గుర్తింపు అనుకుంటా...
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా కాలం,యువత పుస్తకాల కన్నా ఫోన్ లోనే ఎక్కువ గడుపుతున్నారు.అందుకు నేను అతిథుణ్ణి ఏమి కాదు.ప్రశ్నించే సమాజం కన్నా సోషల్ మీడియాలో ఉండే సమాజం ఎక్కువ అయిపోయింది.ఇది పాలక వర్గాలు పన్నినా కుట్రలో భాగమే సమాజాన్నీ ఆలోచింప చేయడం మానేసి పూర్తిగా బానిసలుగా తయారు చేస్తున్నారు.ఇదే అదునుగా ప్రజా ఉద్యమాలపై నిషేధాలు కూడా విదిస్తున్నారు అందులో భాగంగా ప్రజా పక్ష మేధావులను,కవులను,నిర్బంధంలో కి గురి చేస్తున్నారు ఈ ప్రక్రియ కు ప్రజా పోరాటాల ద్వారా ముగింపు పలకకపోతే ప్రజలపై నిర్బంధం రోజు రోజుకి తీవ్రమవుతుంది కాబట్టి సాహిత్యాన్ని కాపాడుకోవలంటే విశాల ప్రజా పోరాటాలే శరణ్యం..
అలాగే విద్యార్థులు చదువుతున్న చదువులు,పాఠ్య పుస్తకాలు సంస్కరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చాలా మంది ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.మరి ఆత్మహత్యను ప్రేరేపించే చదువులు ఎందుకోసం చదువుతున్నామో అవి మనకు అవసరమా..?లేదా మరి వాటి స్థానంలో ఎటువంటి చదువులు చదువాలి.వాటి కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనేది సమాజంలో చర్చ జరగాలి...
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుఅనిల్ కుమార్‌గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు అనిల్ కుమార్ నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న నాకు దూరమైనరు. భూమి భుక్తి విముక్తి పోరులో సాగిన మా అమ్మానాన్నలు అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు.నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మానాన్నలు పార్టీ నుండి బయటకి వచ్చి బతుకుతున్న సమయాన ఆ విషయం తెలుసుకున్న మా తాత (మా అమ్మ వాళ్ళ నాన్న) కుల దురహంకారంతో రగిలిపోతూ వారిని ఏదోలా కనిపెట్టి జైలు పాలు చేశాడు. నేను అక్కడే పుట్టాను ఏ తప్పు చేయకుండానే సంవత్సర కాలంలోనే జైలు జీవితం అనుభవించాను.అదే క్రమంలో అమ్మకు కామ్రేడ్ భారతక్క కలవడం వల్ల వాళ్ళ మధ్య చిగురించిన స్నేహమే భారతక్కను అమ్మని పిలిచేలా చేశాయి. అయితే అమ్మానాన్నలు జైలు జీవితం గడిపి బెయిలు పై వచ్చిన తర్వాత కుల దురహంకారంతో రగిలిపోతున్న మా తాత వల్ల మా నాన్న చనిపోయాడు.ఈ దేశంలో ఉన్న మనువాద బ్రాహ్మణీయ భావజాలం ఎలా అయితే ఆడవాళ్ళని బానిసలా చేసిందో ఆ అసమానతల వల్లనే ఈ సమాజంలో నా తల్లి బ్రతుకలేక నన్ను మా నానమ్మ దగ్గర వదిలేసి అండర్‌గ్రౌండ్ వెళ్ళిపోయింది.అమ్మ కూడా 2000 సంవత్సరంలో ఒక ఎన్కౌంటర్ లో అమరురాలైంది. అప్పటినుంచి భారతక్క నా మంచి చెడ్డలు చూస్తూ చదివిస్తూ ఇంతవాన్ని చేసింది. నిజంగా వర్గ సంబంధం లో ఏర్పడిన ప్రేమైనా స్నేహమైన చాలా గొప్పది ప్రస్తుతం నేను ఎల్ ఎల్ బి సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
ముందుగా విప్లవ సాహిత్యం అయిన దళిత సాహిత్యం అయిన దానికి రాజకీయ అవగాహన ఉండాలి.అలా ఒక రాజకీయ అవగాహన మొట్టమొదటిసారిగా నాకు పరిచయం చేసిన సంస్థ అమరవీరుల బంధుమిత్రుల సంఘం. అప్పటికీ ఆ సంస్థ నా బాధ్యతలు తీసుకొని మంచిచెడ్డలు చూస్తున్న క్రమంలో మీటింగ్ లోకి వెళ్లడం దగ్గర నుంచి విప్లవ రాజకీయ అవగాహన నాలో మొదలైంది. ఆ తరువాత డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పరిచయమైన దగ్గర్నుంచి కుల వర్గ రాజకీయాలు తెలుసుకున్న. ఇవి రెండు సంస్థలు విప్లవ దళిత రాజకీయాలు నేర్పించాయి. డీ ఎస్ యూ లో కార్యకర్తగా కొనసాగుతున్న క్రమంలో వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల మీటింగ్ లకు హాజరు కావడం అన్నిరకాల సాహిత్య సంస్థల మీటింగ్ లకు హాజరు కావడం దొరికిన పుస్తకాలు సేకరించడం మరియు మిత్రుల దగ్గర దొరికిన పుస్తకాలు చదవడంతో భాగంగా శివసాగర్ కవిత్వం, శ్రీశ్రీ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం, జాషువా విశ్వనరుడు కవిత్వం, పాణి రాసిన కలిసి పాడవలసిన గీతమొక్కటే నన్ను సాహిత్యం వైపు ఆకర్షించాయి.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.
ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయినటువంటి పెట్టుబడిదారీవిధానం కులవివక్షత, మతోన్మాదం మన ప్రజలు పడుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇబ్బందులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
సాహిత్యం లోకి రాకముందు సాహిత్యాన్ని అభ్యసిస్తున్న క్రమంలో నేను నేర్చుకున్న సాహిత్యాన్ని ఒక కొత్త తరహా పద్ధతిలో చెప్పదలుచుకున్నాను అందులో భాగంగానే విప్లవానికి ప్రేమను జోడిస్తూ విప్లవకారులు తమ తల్లి,తండ్రి,కుటుంబం, స్నేహితులను వదిలి ప్రజల కోసమే నమ్ముకున్న పంథాలో సాగిపోతున్న క్రమంలో వారు చేసే ప్రాణత్యాగం ప్రజలపై సొంత ప్రేమను కనబరిచింది. ఆ ప్రేమనే సాహిత్య రూపంలో చెప్పాలనుకున్న.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను గుర్తింపు అయితే కోరుకోలేదు కానీ నా కవిత చదివిన చాలా మంది ప్రశంసించిన కవిత్వం మాత్రం “ఆ రోజులు వస్తాయి. దానివల్లనే ఇంకా రాయాలని ఆసక్తి కలిగింది.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ఒకప్పుడు కవిత్వం రచనలలో గ్రాంధిక పదాలు ఎక్కువగా ఉండేవి.పోను పోను ప్రజల భాషలోకి మారుతూ వచ్చిన క్రమంలో సాహిత్యం కూడా ప్రజలకు ప్రజల భాషలో చెప్పదలిచే పదాలను ఉపయోగిస్తూ రచనలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కొన్ని సాహిత్య సంస్థలు ఆ దిశగా రాస్తున్నాయి.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు నూతనగంటి పవన్ కుమార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నేను నూతనగంటి పవన్ కుమార్. మాది వరంగల్ జిల్లాలోని కటాక్షపూర్ గ్రామం.
నిరుపేద బీసీ కుటుంబం మా నాన్న గారి పేరు నర్సయ్య, అమ్మ పేరు సరోజన. అమ్మ ప్రతిరోజూ నెత్తిమీద గాజుల గంపతో ఊరూరా తిరుగుతూ గాజులు అమ్ముతూ నన్ను ఎమ్మెస్సీ ఫిజిక్స్,బి.ఏడ్. వరకు తమ్ముడు సాంబరాజుని ఎంటెక్ వరకు చదివించింది.ఇంటర్ విద్య మినహా నా విద్యాబ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల,
కళాశాలలోనే జరిగింది.ఇక ప్రస్తుతం నేను ఉపాధ్యాయ విద్యనభ్యసించిన పాతికేళ్ల నిరుద్యోగిని..
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నా పై మిత్రుడు కవి,రచయిత అమృత రాజ్ ప్రభావం చాలా ఉంది. అతను ఎల్లప్పుడూ అన్యాయాలపై తన కలాన్ని సందిస్తున్నాడు.అతని ప్రోత్సాహంతోనే శ్రీశ్రీ కవిత్వం,భాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి,అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదివి ఎంతో ప్రేరణ పొందాను.ఆ ప్రేరణ తోనే సాహిత్య విత్తులను సమాజ మార్పుకై చల్లుతున్నాను.ప్రముఖ వార్త పత్రికల్లో వచ్చే విశ్లేషణలు కూడా నాలోని ఆలోచనలకు మరింత పదును పెట్టాయి.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.
నేను ఏ రోజు అనుకోలేదు సాహిత్యం వైపు నా అడుగులు పడతాయని మొదటిసారిగా ఓ అందమైన అమ్మాయి అందాన్ని వర్ణించడానికి కలం పట్టాను నిజం చెప్పాలి అంటే ఆమెతో మాట్లాడే దైర్యం లేక అక్షరాలతో అందమైన కవితలు రాసాను.ఆ తర్వాత నిజాన్ని,పేద ప్రజల భాదను నలుగురికి తెలియజేయడమే సాహిత్యమని తెలుసుకున్నాను.ఇంకా సామాజిక అసమానతల పెరుగుదలను చూసి.
అందిన కాడికి దోచుకుతింటున్న కొందరు అవినీతి రాజకీయ నాయకుల ప్రసంగాలను గమనించి, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వ్యక్తిత్వాన్ని,అధికారాన్ని నోట్ల కట్టలకి తాకట్టు పెట్టిన కొందరు అధికారులను కళ్ళారా చూసి అసహ్యమేసింది.ఇది మారాలనేభాద్యతగా రాయడం మొదలుపెట్టాను.దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకి జరుగుతున్న అన్యాయం చూసి నా గుండె బరువెక్కింది "తప్పదు ప్రతిఘటన" అనే కవితతో రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాను.ధరల పెరుగుదలవలన సామాన్యుడు అనుభవిస్తున్న బాధలను "సతమతం" అనే కవిత ద్వారా వివరించాను.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
సాహిత్యం ఎల్లప్పుడూ ప్రజా పక్షాన వుంటున్నది కవులు రచయితలు తమ జీవితాలను, అక్షరాలను ప్రజా శ్రేయస్సు కొరకు అంకితం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.ఇదంతా నాకు సాహిత్యంలోకి వచ్చాకే అర్దమైంది.ఇంకా నేర్చుకుంటున్నా.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
చాలా సంతోషాన్ని కలిగించింది.సమాజ మార్పు పట్ల నా బాద్యతను మరింత పెంచింది
ప్రజా పక్షాన పోరాడటానికి ప్రేరణ కలిగించింది.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ప్రస్తుత సాహిత్యం నేటి సమాజం లోని అస్పృశ్యత లను అసమానతలను సమాజం నుండి వేరుచేయుటకు ఎంతగానో ప్రయత్నిస్తున్నది.లింగ బేదాన్ని వ్యతిరేకిస్తూసామాజిక సమానత్వం కొరకు పాటుపడుతున్నది.పాలకుల అవినీతిని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నది..!నాలాంటి యువత ఎంతో మంది సీరియస్ గా రాస్తున్నారు అని భావిస్తున్నాను.వారందరికీ నా తరపున శుభాకాంక్షలు.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు అమృత రాజు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు అమృతరాజ్.మాది ములుగు జిల్లా,అదే ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన కుమ్మరిపల్లి.మా కుటుంబంలో ముగ్గురు అక్కల తోడ నేను ఒక్కడిని.నేను పాఠశాల విద్య మల్లంపల్లి లోని శ్రీ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో,ఆ తర్వాత పాలిటెక్నిక్ రామాంతపూర్ లోని JNGP కాలేజ్ లో చేశాను.వరంగల్ లోని వాగ్దేవి కాలేజ్ లో B.TECH చేశాను.ఆంగ్ల సాహిత్యం చదువుదామని పీజీ(M.A ENGLISH)చేశాను.చివరగా టీచింగ్ మీద వున్న ఆసక్తితో ప్రస్తుతం బీ.ఎడ్ చదువుతున్నాను.నాకు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ లోనే పెళ్లయింది.నా సహచరి అనిత టైలరింగ్ చేస్తది.మాకొక పాప తన పేరు జీతన.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నన్ను ప్రభావితం చేసిన మొట్ట మొదటి పుస్తకం "అంటరాని వసంతం",నాకిష్టమైన రచయిత ‘కళ్యాణరావు’.పీడిత ప్రజల జీవితాలను సామాజిక,ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక,చారిత్రక కోణంలో సరళమైన పదజాలంతో కామ్రేడ్ కళ్యాణరావు ఆ నవలను రాసిన తీరు అద్భుతం.ఇంకా దిగంబర కవిత్వం,చెరబండరాజు కవిత్వం,పాటలు, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం,శివసాగర్ కవిత్వం, కలేకూరి ప్రసాద్ కవితలు,మిత్ర పాటలు ఇంకా కుల నిర్మూలన పత్రికలు, నడుస్తున్న తెలంగాణ,వీక్షణం పత్రికల ప్రభావం,విరసం,గోదావరి మాసపత్రిక ప్రభావం నాపై ఉంది.ఇంకా నాకు పాట రాయడంలో సిద్ధాంత భూమికనిచ్చిన భూరం.అభినవ్ సర్ కి,నన్ను నడిపించిన డి.యస్.యూ కినా సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన సాహితీ మిత్రులకు కృతజ్ఞతలు.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం,డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్(DSU) లో క్రియాశీలకంగా పనిచేసినంత కాలం ఈ సమాజం కులం వర్గం అనే అసమానతలతో పెట్రేగిన తీరును అర్థం చేసుకున్నాను. దానివల్లనే సమాజంలోని ప్రతీ రంగంలో ముఖ్యంగా విద్యా రంగంలో వివక్ష,అణిచివేత కొనసాగడం దానివల్ల గొప్ప గొప్ప స్కాలర్స్ ప్రాణాలు కోల్పోవడం, విద్యను ముడి సరుకు చేసి చదువును అమ్మే కార్పొరేటీకరణను ప్రభుత్వాలే పెంచి పోషించడం గమనించాను.సమాజంలో మనుషులంతా సమానంగా లేరు,కుల,మత,లింగ,ప్రాంత,జాతి భేదాలతో విడగొట్టబడి వున్నారు. అయితే వీటి మూలాలు అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలం,మనువాద పితృస్వామ్యం, పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాయని,ఇదంతా గుప్పెడు దోపిడీ శక్తులు స్వార్థం కోసం చేస్తున్న కుట్రలని గ్రహించాను.అందుకు క్రియాశీల శక్తుల కదిలించడానికి సాహిత్యం సరైన మందు అని నమ్మాను.ఆ నమ్మకమే నన్ను తన వైపు నడిపించింది.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
నేను సాహిత్యంలోకి రాకముందు ఎవరు చదువుతారు ఈ పుస్తకాలు అనుకున్నాను.కానీ ప్రకృతిలో మనిషిని నిత్యం చైతన్యపరిచేది సాహిత్యం.సాహిత్యమే ప్రపంచ విప్లవాలను రికార్డ్ చేసింది,ప్రగతిశీల పోరాటాలను నడిపించిందని,తరతరాలుగా ప్రజల్లో మమేకమై తమ జీవితాల్ని యవ్వనంగా ఉంచడంలో ఉపకరించిందని తెలుసుకున్నాను. అందుకే చదవడం,రాయడం అలవాటు చేసుకున్నాను.నేనే కాదు నాకు తెలిసిన మిత్రులను కూడా రాయమని చెప్తున్నాను.ఈ సాహిత్య వాతావరణం స్వేచ్ఛగా నా అభిప్రాయాల్ని చెప్పడానికి వెసులుబాటు కల్పిస్తున్నది.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను ఇప్పటి వరకు మహిళలు-అత్యాచార హత్యలు-ఆత్మగౌరవ పోరాటాలు;రాజ్య నిర్బంధం;మహనీయుల యాది;రైతు పోరాటాలు;విద్యారంగం;కరోనా;దళిత,ఆదివాసీ పోరాటాలు వంటి అంశాలపై కవిత్వం రాశాను.ప్రో.డా.వినోదిని రాసిన “దాహం” నాటకంపై,హెచ్చార్కే రాసిన “రెబెల్” నవలపై,నందిని సిద్దారెడ్డి రాసిన “అనిమేష” కావ్యం పై,వి ఆర్ విద్యార్థి రాసిన “దృశ్యం నుండి దృశ్యానికి” కవిత్వంపై,అట్టాడ అప్పల్నాయుడు రాసిన “బహుళ” నవల పై;యోచన రాసిన “ఆళ్లకోస” పాటల పుస్తకంపై నా అభిప్రాయాలను రాశాను. “వెతుకుతున్న పాట”,”జరగబోయే కథ”,“రైతు బంధు”,”మీటింగ్ ఆగమాగమాయే అని నాలుగు కథలని రాశాను.ఇవన్నీ మిత్రులు కొందరు పెద్దలు బాగున్నాయని చెప్పడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.గుర్తింపు తర్వాత విషయం అనుకుంటాను.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
సోషల్ మీడియా ప్రభావం వల్ల సాహిత్యం ఇప్పుడు అందరి చేతుల్లో ఉంది.చదవకుండానే రాసేవాళ్ళ సంఖ్య పెరిగింది. అందుకే అసంపూర్ణమైన సాహిత్యం వెలువడుతున్నది.మరో పక్క ప్రజా రాజకీయాలను చెప్పే సాహిత్యం తగ్గింది.అందుకే పాలక వర్గాలు సాహితీ సంస్థలపై నిషేధాలు ప్రకటిస్తున్నాయి.ఆచరణ లేని రచయితలు బయటపడుతున్నారు.సరికొత్త వాదాలు సృష్టించబడుతున్నాయి.
అందుకే ఆచరణ తో కూడిన ప్రజారాజకీయాలను ప్రతిభింబించి ప్రజల్ని నిత్య చైతన్యవంతులుగా నిలబెట్టడంలో సాహిత్యం ఉపయోగపడాలని,అందుకు చేరాల్సిన వారందరికీ ఆ సాహిత్యం చేరేవిధంగా బాధ్యత పడాలని సాహితీ ప్రియులకు విజ్ఞప్తి.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు దిలీప్.విగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1 మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
మాది కొత్తగా ఏర్పడ్డ ములుగు జిల్లాలోని ములుగు మండలానికి చెందిన మల్లంపల్లి గ్రామం. నిరుపేద దళిత కుటుంబం. అమ్మానాన్నలు రవి లలిత లకు ముగ్గురు పిల్లలం. ఇద్దరు చెల్లెళ్ళు, నేను. మా చిన్నతనంలో అమ్మ నాన్న ఇద్దరు ఎర్ర మట్టి గుట్టల్లో లారీలు నింపడానికి పోయేవారు. నాన్న ముఠా మేస్త్రీగా ఉండేవారు. యాంత్రికరణ చాలా మంది జీవితాలను రోడ్డున పడేసినట్టే క్వారీలలో యంత్రాలు వచ్చి మా గ్రామంలో చాలా కుటుంబాలను రోడ్డున పడేసింది.ఆ రోడ్డున పడ్డ కుటుంబాలలో మాది ఒక కుటుంబం. అట్లా రోడ్డున పడ్డ అమ్మనాన్నలు మమ్ములను,కుటుంబాన్ని సాధడానికి నాన్న ఆటో డ్రైవర్ గా,అమ్మా వ్యవసాయ కూలీగా కొత్త అవతారం ఎత్తారు.ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లో అయినా ఉన్నత పాఠశాల విద్యా స్టేషన్ ఘన్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అయిపోయింది. పరకాల లో ఉపాధ్యాయ విద్యా ట్రైనింగ్ చేసి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నియమితుడనై వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లీ మండలంలోని ముచ్చిoపుల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.
ఘన్పూర్ గురుకులంలో ఉన్నపుడు లైబ్రరీలో తెలుగు వెలుగు మాసపత్రిక,కథల పుస్తకాలు చదివేవాడిని. ఆ తర్వాత సామజిక స్పృహ కలిగిన తర్వాత ఏది పడితే అదే చదివేవాడిని. నా సామాజిక రాజకీయ గురువు హరికృష్ణ గారి పరిచయం తర్వాత వారు పరిచయం చేసిన తాపి ధర్మారావు గారి "దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు?" పుస్తకం నాలో కొత్త ఆలోచనలు, నూతన ప్రశ్నలను ,అధ్యయన ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత భిన్నమైన సామాజిక సాహిత్యాన్ని చదివాను. చలం నవలలు, ఓల్గా కథలు,
రాహుల్ సంకృత్యాన్ రచనలు,శ్రీ శ్రీ ,కలేకూరి,బహుజన కవుల కవితలు ఇంకా అనేకమంది కవితలు, బాలగోపాల్ సామాజిక తాత్విక రచనలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
దళితులు అంటేనే నూటికి 90శాతం పేదలు .అందుకే పేదలకు పర్యాయపదంగా దళితులు అని చెప్పుకోవచ్చు అనుకుంట. ఇప్పటివరకు పుట్టిన సామాజిక సాహిత్యం మొత్తం కూడా పేదలు,దళితులు బహుజనుల నుండే పుట్టింది. అట్లా నా పుట్టుకతో నా ఉనికిని గుర్తించే ఈ సమాజంలో నేను పడ్డ అవమానాల నుండే నన్ను నేను నూతన మానవుడిగా నిర్మించుకోడానికి నా చుట్టూ పరిస్థితులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.
4. మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.
నేను సాహిత్యం అనేది ఒకటి ఉంటుందని తెలియకముందే నా జీవిత అనుభవాలు, నా మది ఆలోచనలతో రాయడం మొదలు పెట్టా. అట్లా...9వ తరగతిలో ఉన్నపుడు
"పదునులేని కత్తి పనికి రాదు
చెల్లని పైసకు విలువ లేదు
నీటిలో నడవని పడవ అక్కరకు రాదు అలాగే...
విద్యలేని మానవునికి
సమాజంలో విలువ లేదు" అని విద్యా నాకు ఎంత అవసరమో నాకు నేను రాసుకున్న. అట్లా రాసుకుంటూ రాసుకుంటూ మిగతా సాహిత్యాలను చదువుకుంటూ ఈ సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాకు ఒకప్పుడు చాలామంది నూతన రచయితలకు సీనియర్ రచయితల సలహాలు, మెళకువలు, లభించేవి. అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండింది ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితులు లేకపోవడమే కాకా రాసే వారిపై నిర్బంధం కూడా కొత్త రచయితలు రాయకుండా చేస్తుంది. బలమైన సామాజిక, ప్రజా సాహిత్యం రాకపోవడానికి ఇది ఒక కారణం.ఒకప్పుడు విప్లవ సాహిత్యం సమాజంలో బలంగా దూసుకువస్తే నేడు అస్తిత్వవాద సాహిత్యం బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. కొత్తతరం చాలామంది కవులు, రచయితలు వీటినుండే రావడం మనం గమనించవచ్చు.
5. 5 సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
సాహిత్యం నాకు తెచ్చిన గుర్తింపుకంటే కూడా నా సామాజిక బాధ్యతను మరింత పెంచినది అనుకుంటున్నా. నా కవితలు,వ్యాసాలు చదివి నన్ను ఫోన్లో అభినందించడానికి కాల్ చేసే చాలామంది మరిన్ని సామాజిక రచనలు చేయాలనీ కోరేవారు.ఇదే నాకు సాహిత్యం ఇచ్చిన గుర్తింపు. నా కవితలు,వ్యాసాలు చదివిన వారిని నాకు ఫోన్ చేసేలా స్పందింప చేసిందంటేనే సాహిత్యం నాకు ఎంతటి గుర్తింపును తెచ్చిoదో అర్ధం చేసుకోవచ్చు.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?
ఏ సాహిత్యమైన అది వెలువడ్డనాటి కాలమాన పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచం ముందు ఉంచినపుడే అది నిజమైన సాహిత్యం అనిపించుకుంటుంది. సాహిత్యం ఇట్లానే ఉండాలని అనే వాదనను ఇట్లా రాస్తేనే సాహిత్యం అవుతుంది అనే వాదనను రెండింటిని ఒప్పుకోలేను. ఈ విషయంలో "సాహిత్యం అంటే జీవితంలో ఖాళీలను పూరించడం" అన్న బాలగోపాల్ మాటలు..మరియు "ఎవడో చెప్పినట్టుగా కాక నీకు నచ్చినట్టుగా రాయి"అన్న కలేకూరి మాటలు నా రచనకు స్పూర్తి. ఏ సాహిత్యం ఐన బాలగోపాల్ అన్నట్టు ఆయా వ్యక్తుల , ఆయా సమాజాల జీవితంలో ఖాళీలను పూరించడానికి తోఢ్పడినపుడే ఆ సాహిత్యానికి ఒక అర్ధం ఏర్పడినట్టు. ప్రస్తుత సాహిత్యంలో అట్లాంటి వాటా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఓల్గా "ప్రయోగం" కథ చదివిన నాకు అన్ని సంవత్సరాల క్రితం అంత ఆధునికంగా యెట్లా ఆలోచించినదా? అని నాకు నేనె ఇప్పటికీ అనుకుంట. నా జీవితంలో ఆలోచనలకు అద్దం పట్టిన కథ. రిజర్వేషన్స్ గురించి వచ్చే వాదనలు విన్న ప్రతిసారి బలమైన ప్రతిపాదన యెట్లా పెట్టాలా అని ఆలోచించే నాకు బాలగోపాల్ "రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం" చదివిన తర్వాత "ప్రతిభ" యొక్క తార్కిక నిర్వచనం నాలో చాలా అనుమానాలను నివృత్తి చేసింది. బలమైన వాదన పెట్టడానికి తోఢ్పఢ్ఢది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇట్లా ఆయా సందర్భాలలో మానవ జీవితంలో ఏర్పడ్డ ఖాళీలను పూరించే సాహిత్యం ప్రస్తుత పరిస్థితిలో రావలసినంత, ఆశించినమేర రావడం లేదు.
ఖాళీలను పూరించడానికి...
కవిత్వం చిటికెలు, చప్పట్లు చరిపించుకోవడానికి కాదు
సాహిత్యం సత్కారాలు సన్మానాల కోసం కాదు
అంటరాని బ్రతుకుల ఆవేదనను
అనగారిన వర్గాల ఆక్రోశాన్ని
పేద వారి వెతలను
బడుగు బలహీన వర్గాల బాధలను
'సిరా' సుక్కలుగా మార్చి
కళ్ళు మూసినట్టుగా నటించే నాయకుల
కనుల ముందు వాస్తవాల వెలుగులు పరుచడానికి
ఆకలి దప్పులు లేవని
జాతి మత కుల లింగ వివక్షలు లేవని
పుచ్చు మాటలు పలికే చచ్చు మూకల పై
అక్ష"రాళ్ళెత్తి" దండ యాత్రలు చేయడానికి
కవిత్వం, సాహిత్యం
సమత, సౌభ్రాతృత్వం
స్వేచ్ఛా ,స్వాతంత్రం సాధించడానికి
జీవితంలో ఖాళీలను పూరించడానికి
సాహిత్యం పట్లా సూక్ష్మoగా ఇది నా అభిప్రాయం.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుఅనిల్ కర్ణగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు అనిల్ కర్ణ. మా గ్రామం పోలేపల్లి తొర్రూరు మండలం మానుకోట జిల్లా. తండ్రి, వెంకటయ్య, సుతారి మేస్త్రి. తల్లి , ఎల్లమ్మ దినసరి కూలీ. మాది ఒక నిరుపేద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములం.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
ప్రభావితం చేసిన రచయితలు,పుస్తకాలు అంటే అయాన్ రాండ్ రాసిన "ఫౌంటెన్ హెడ్" పుస్తకం అందులో రోర్క్ పాత్ర నాకు బాగా నచ్చింది. అలాగని అతని ప్రభావం ఉందని చెప్పను. సినీ డైరెక్టర్రామ్ గోపాల్ వర్మ "రాముఇజం" ప్రభావం ఉందని మాత్రం నిర్మొహమాటంగా చెప్తాను.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
సమాజంలో ఉన్నటువంటి అసమానతల మూలానే మొదట నాలో కవిత్వం గానీ పాట గానీ పుట్టింది అని చెప్తాను. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఏదో రాసేద్దాం లే అని కూర్చుంటే వచ్చేది కాదు అది. ఏదో ఒక భావావేశానికి లోనైనప్పుడే అది బయటపడుతుంది.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు, సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
రాకముందు నా ముందు తరాలను చూసి స్ఫూర్తి పొందిన వాన్ని. వచ్చాక వాళ్లు ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంతా commercial అయిపోయి పక్క దారి పట్టారు. గొప్ప గొప్ప కలాలన్నీ మూగబోయాయే అన్పిస్తుంది.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
సమాజంలో బతికే యే మనిషైనా తన ఉనికి ని తెలియపరుచుకోడానికి,తన గుర్తింపు కోసమే ఆరాట పడుతుంటాడు. అలా చూస్తే నా సాహిత్యంలో నా సాధన మేరకే గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ఇప్పుడంతా డిజిటల్ మీడియా కాబట్టి పెద్ద పాత్ర సోషల్ మీడియాదనే చెప్పాలి. తర్వాత విప్లవ సాహిత్యం, టీవీ ఛానల్, నవలలు,పత్రికలు వాటి పాత్ర అవి పోషిస్తూనే ఉన్నాయి.
పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు. తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.
పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.
"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.
అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.
"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.
తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.
"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.
జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.
"అస్సలు ఒప్పుకోరే"
"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"
"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.
పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.
సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.
"సరే మంచపో"
*
ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".
"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.
"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.
"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.
బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.
యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.
"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.
"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,
దాన్నేమంటార్రా" ?
"అదానే, గిటార్".
ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.
ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.
"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.
ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.
*
"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.
ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.
"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.
ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.
జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.
బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.
బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.
"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.
"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.
బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.
గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.
"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.
"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది పూర్ణ.
బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.
"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.
"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.
మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.
*
జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.
ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.
జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.
"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.
"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.
"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.
"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.
సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.
"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.
"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.
"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.
*
గిన్నెశెట్టుకాడ అందరూ కొత్వాల్ కోసం ఎదురుజూత్తాల్లు. ఆ గుంపులోంచి రమేష్ గిన్నెశెట్టు గద్దెకాడ్కిబోయి నిలబడ్డాడు. "అసల్కి కొత్వాల్ దొర ఎందుకు పిల్శిండు" అని నాల్గు వాడల మంది అంత ఆడ ఈడ మోపై ముచ్చట్లు యెట్కుంటాళ్లు. రమేష్ ఆ ముచ్చట్లన్నింటిని బంజేత్తు ఒక్కశార్గా "దోశ్ మనకు పని లేదన్కున్నాడు ? మనమచ్చి గింతసేపైతున్న రాడేమే ఈ దొర అనేటోడు" అని అన్నడు.
"ఏంరో దొరను గట్ల అంటన్నావ్, నీ లెక్కనార ఆయిన్కి వంద పనులుంటయ్" అని గద్దెమీద కూసున్న పెద్దమన్శి లేశి అన్నడు.
"ఓ పెద్దమన్శి ఎవన్కే దొర, మీగావచ్చు మాగాద్, అయిన మాకుతం మస్త్ పనులున్న ఒదిలి పెట్టుకొనచ్చినం" అని రమేష్ మాట్లాడ్తుంటనే కొత్వాల్ కార్ అచ్చాగింది.
గిన్నెశెట్టుకాడ్కి కొత్వాల్ తన మన్శులతో దిగ్గానే వయిస్సుబడ్డొల్లేమో లేశి దండలేడితే, నడీడుల్లోలేమో అట్లనే నిలబడి సూత్తున్నరు. ఐతే ఎంబటే పెద్దమన్శి కట్టన్న తన నెత్తికున్న రూమల్దీశి, ఉరుక్కుంటబోయి కూర్చి తెచ్చేశిండు.
గప్పుడే జోసెఫ్ గుంపులోకచ్చి సూత్తాండు ఏంటాని, తనకేం సమజ్గాక గద్దెమించెలి దిగ్తున్న రమేష్కి సైగ జేశిండు. "ఏమో దేల్వదు" అని జబ్బలేగరేసుకుంటు మల్ల సైగ జేశిండు.
గమ్మునున్న వాతవర్ణాన్ని పలగ్గొడుతున్నట్లు కొత్వాల్ "ఇగో అందరూ ఇటినండి, పైనున్న సర్కారోళ్లతోని, పార్టోళ్లతోని కొట్లాడి మరి తీస్కచ్చిన, ఇంకో మున్నెల్లోచ్చె ఎన్నికల్లో మీదాంట్లోనే ఒకడు మనఊర్కి సర్పంచ్" అని మాట్లాడ్తుండగా కింద మంది గట్టిగా సప్పట్లు కొట్టారు.
"ఆగండి ఆగండి, ముందు నే జెప్పేది ఇనుర్రి" అని కొత్వాల్ జనాలనాపుతూ, "ఐతే రేపు గ్రామస్థాయి ఎన్నికల మీద పార్టీ మీటింగుంది. దానికోసం MLA సారత్తండు, దీన్కోసం ఒక ఇరవై డప్పుల్దెచ్చిన, అవేవలు గొడితే వాళ్ళకే, ఒకపక్క డప్పులు నడ్తాంటే ఇంకోపక్క ఆడోళ్ళు కోలాటాలెయ్యలే, ఎశ్నందుకు రెండొందలు, మీటింగ్కుచ్చిన ఒక్కో మన్శికి వందరూపాల సోప్పున ఇత్తం. మీగోసం కొట్లాడి మరింత జేశినందుకైనా మీ అందర్రావలె" అని మందిని నాన్పుతూ మాట్లాడ్తుంటే,
"ఎహే ఆపే అన్న, ఏం జేశినవ్ నువ్వేదో బగు జేశినట్టచ్చి మాట్లాడ్తానవ్" అని కిందున్న మందిలోంచి అన్నడు రమేష్.
అక్కడ మొత్తం నిసబ్దం అల్ముకుంది. రమేష్ మాటల్కి ఏమైతదాని అమ్మలక్కాలందరు సూత్తాండ్రు. కొత్వాల్ నింపాదిగా కూసుంటు "ఏంరా రమేశ్గా, నీయన్ని తండ్లబడె మాటలేనరా, నేనేం జెశిన్నో మీ పెద్దమన్శుల్ని అడ్గుర, అదికుతం శాతకాకపోతే, మీరు శెర్వుశికం కాడ దున్నుతారే ఆ భూమ్లేవరిచ్చిండ్రో దెల్సుకోర" అంటూ గుర్రుగా సూత్తు దొరమధంతో అండు.
ఆడమోపైన మందిలో కొందరు రమేష్ని సూత్తు నవ్వుతాంటే ఏం మాట్లాడాలో ఆన్కి అర్ధంగాలే. పెద్దమన్శుల్లో ఒకలు లేశి "మాట్లాడేటోన్ని మాట్లాడనియ్యకుంటా నడిమిట్ల నీ లోల్లేందిరా" అని కోపంతో కొత్వాల్కు వత్తాస్ బల్కిండు.
రమేష్కి మొకం లేకుండ బోయిందాడ. మొత్తం గమనిత్తాన జోసెఫ్ "దెహే మీకేమన్న సమజైతాంద ఐనా మనలందర్ని ఎడ్డిగుద్దోళ్లను జేత్తాండు. ఆ శెర్వుశికం భూమ్లన్ని అసైండ్ భూమ్లు, అవేం ఆళ్ళ అయ్యా జాగిరేంగాదు" అంటూ రమేష్కి వంత బల్కిండు.
కొత్వాల్కి జోసెఫ్ మాటలన్ని తన్నినట్లై, కోపంతోని "ఏంరా కట్టయ్య నేనేం జెశిన్నో మీకు దెల్వదార, గిప్పుడు ప్రతోడ్కి నే జెప్పల్లారా" అని ఎగేశిండు.
"దొశ్ పోరగ, ఏం దెల్సురవారి నీకు, నిన్నమొన్న మొల్శినోన్వి బగు దెల్సినట్లాత్తనవ్, నడువ్ ఈన్నుంచి" అని దొర మెప్పుబొందనికి గద్దెమించెలి లేశి అన్నడో పెద్దమన్శి.
గిన్నెశెట్టు మీద పిట్టల సప్పుళ్ళు తప్ప ఏం ఇనబడనంత నిసబ్దంగుంది వాతావర్ణం. ఏమైతదాని మందిలో ఉచ్చిలు పెర్గుతుంటే, నే జెశ్నా ఇకమాతు పనిజేశిందన్నట్లు ముశి ముశి నవ్వుతుండు కొత్వాల్.
"అవ్ నాకేం దెల్సు, ఐనగాని, ఇంకెవలన్నగాని ఇంత ఇత్తె లొట్టల బోసుడుదప్ప" అని పెద్దమన్శి అన్న మాటల్కి ఎదుర్గుల్లిచ్చినట్లు మాట్లాడిండు జోసెఫ్.
ఆడైతున్నా యవ్వరాన్కి అమ్మలక్కాలందరు నవ్వుతూ సూత్తాంటే, పెద్దమన్శికి ఇజ్జత్ బోయినట్లై, ఇగ కోపంతో "ఏం రా ఏమన్నావ్" అని జోసెఫ్ మీద్కి ఉరికిండు.
ఒక్కశార్గ ఆడోళ్ళందరూ జోసెఫ్ కాడ్కి అమంతామచ్చి "ఏమయ్యా గిదేనా నీ పెద్దమన్శితనం, ఏమో పొరన్మీకీ బాగా ఉరికత్తానవ్" అని మన్శికో మాట అందుకున్నారు.
"మరి ఆడన్నది" మంచిగున్నదా ?
"మరి మీరు ఎవ్వల్కాడ ఏం దీస్కోకుండా, ఊకనే పంచాయితిలు జేశిర్ర ?" అని ఏంగాకుండా జోసెఫ్ని పట్టుకుంటు అన్నది.
పక్కనున్న రమేష్ ఈ లోల్లంత ముదురుతదేమోనని "ఓ ఆగే పెద్దమన్శి, ఎందుకంత ఆగమైతనవ్, మీతో లొల్లి పెట్టుకోనికేం ఉండలే ఈడ. ఒక్కశారి జోసెఫ్ గాన్ని మాట్లాడనియ్యి మీకే తెల్తది" అని మద్యలచ్చిండు.
పెద్దమన్శి అందరి మాటల్కి ఎన్కకు బోగానే "అరేయ్ నువ్వుబోయి మాట్లాడురా" అని జోసెఫ్ని రమేష్ ముంద్కు నెట్టగానే, జనంలో శానమంది కుతం మాట్లాడమని కోరిర్రు.
జోసెఫ్ ఛాతినిండా గాలి పీల్సుకొని, గిన్నెశెట్టు కాడ్కి బోతావుంటే కొత్వాల్కి ఎక్కడ్లేని కోపంతో సూత్తు పక్కకి జరిగిండు, ముందు కూసున్న పెద్దమన్శులు లేశి నిలబడ్డరు. నిసబ్దం సింగరించుకొని కూసున్నట్లు వాతావర్ణం అముల్కొని గద్దెమించెలి దిక్కుజూపే మోషేలెక్క జోసెఫ్ అగుపడ్తాంటే, అందరూ కండ్లు మిట్కలెయ్యకుండా సూత్తవుండ్రు.
*
తన పనులన్ని ఒడగొట్టుకొని జోసెఫ్ కోసం కంకిశేనుకాడ కూసోనుంది పూర్ణ. సుట్టు శీకట్లు కమ్ముకొనత్తాన ఈదర జోసెఫ్ కౌగిలోలే తన ఊపిరి ఆపేత్తానయ్. కంకిశేనంత పురుగుల మోతల సప్పుళ్ళున్న, పూర్ణకింతైన భయం లేదు, ఉన్నదల్లా ఎదుర్జూపే జోసెఫ్ ఎప్పుడోత్తడని.
పూర్ణ తన్వంత ఎచ్చగా కోరుకుంటుంటే, తన కొంగును తానే హత్తుకుంటూ, జోసెఫ్ శేతులు తాక్తున్నట్లుగా తల్సుకుంటా, "ఇంక రాడేంది" అని తనలో తానే మాట్లాడ్తాంది.
తన మెడోంపులపోంటి కార్తున్న శెమట సుక్కలు చెక్కలగుల జేత్తాంటే, మొదటిశార్గా ఆళ్ళు మాట్లాడ్కున్న ప్రేమ మాటలు గుర్తు జేత్తానయ్.
"బావ, నేనంటే ఎందుకంత ఇష్టం" అని పూర్ణ అడుగంగానే, జోసఫ్ తన దగ్గరగచ్చి, తన నడుంమీద శేతులేసి గుంజుకొని, ఒకరి మొసలు ఒకరికి తాక్తుంటే "ఎండిన ఎముకలకు యెహోవా జీవం పోశినట్లు, నువ్వు నాలో ప్రేమకు ప్రాణం పోశావ్" అని పోలికెడ్తూ ఇచ్చిన ముద్దును తల్సుకుంటా, పంటికింద పెదవిని నల్పుతా నవ్వుతాంది. ఆళ్ళు జేశ్నయన్ని కలల గుర్తుకత్తంటే ఒకింత ఆయిగున్న, మరోదిక్కు కల్వర పెడ్తాంది.
"అసలు ఏంది ఇది, ఎందుకిన్ని కులాలు? ఎంచక్క మన్సులందర్కి ఒక్కటే కులముంటే మస్తుండుగా, గప్పుడు మమ్మల్ని ఆపేటోళ్లే ఉండరు. అయ్యా దేవుడా, మమ్ము కల్పినోడివే ఏ లొల్లిలేకుండా మా పెళ్లి అయ్యేట్టు చూడు దేవా, ఐన ఎంబటే ఎములాడ కచ్చి నీ మొక్కు తీర్సుకుంటా" అని కోర్కుంది.
"ఈ మన్శికి ఏం ఆయే, నా మీద సోయి ఉందా? ఇంక రాడేంది" అని సూట్టురా సూత్తు అక్కడ్నుండి లేశి, మబ్బుల మీద ఎన్నెల అలిగినట్లుగా, పూర్ణ అలిగి ఎల్లింది.
*
సల్ల సలేడుతున్న, దోమలచ్చి శిట్ట శిట్ట కుడుతున్నా జనం ఓపిగ్గా జోసెఫ్ మాటల్ని ఇంటాళ్లు.
"జూశిర్రా శీకట్కాంగానే ఎవలం, ఎవల్కి అవ్పడ్తలేం. అస్సల్ గిప్పుడే గాదు ఎప్పటికుతం, మన వాడలు ఈళ్ళకి ఊరిలెక్క అవ్పడవ్. లైట్లు లేవ్, కాలువల్ లేవ్, రోడ్లు లేవ్. వర్షమత్తె సాలు వర్దంతా ఇండ్లల్ల కత్తంటే, ఊళ్లే కుక్కల్లెక్క బుర్దలో ఒకళ్లకోకళ్ళం నీల్లాత్తనయని కొట్లాడ్కుంది మర్శిర్రా. గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తం, మాగోసం డప్పుల్ కోట్టుండ్రి, కోలటాల్లేయ్యండ్రి అంటే ఎంబటే పోనికి గింతన్న ఇజ్జత్ ఉండాలే మనకి. ఆడెవాడోత్తే మన అమ్మలక్కలేందుకు ఆన్ముందు ఆడాలే, అంతగనం కావాలంటే ఆళ్ళ ఇండ్లళ్ళున్న ఆడోళ్లతో ఎయించుకోవచ్చుగా, మనమెందుకేయ్యలే" అని జోసెఫ్ అందర్కి జెప్తుంటే, కొత్వాల్తో అచ్చిన మన్శి కిరణ్ మధ్యలచ్చి ఆపిండు.
"ఏంరా, చిన్న పొరన్వని అని సూత్తాంటే, శానెక్కువ మాట్లాడ్తున్నావ్, ఊకనే ఎత్తాల్ల పైశల్ దీస్కుంటలే"?
ఆన్మాటల్కి జోసెఫ్కి బగ్గ కోపమచ్చి"ఇగో జూశిర్రా, ఆళ్ళేం అంటుర్రో. గిప్పుడా పైశల్గోసం, ఆళ్ళు ఆడమందల్లా ఆడితే, మనకి ఇలువుంటాద? అసలు ఊరంత సర్పేశి కడిగినట్లుంటే, ఆ కడిగిన నీళ్ళన్ని మావాడల కత్తనయ్యని ఎన్నిసార్లు గ్రామపంచాయత్కి బోయి జెప్పిన, మాకేదన్న పన్జేయండ్రని ఎంత మొత్తుకున్నా మొకం జూశినోడ్లేడు గాని, గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తడట, ఆ సర్పంచ్ ఎవ్వడో గాని ఈ కొత్వాల్ శేప్పులు తుడ్శెటోడే అత్తడుగాని, ఏరేటోడు రాడు. అందుకే జెప్తనా మన్మందరం ఒక్కట్గావలే, మన బత్కులు ఎవ్వడ్ మార్వడు, మనమే మార్సుకోవాలే. గి దొరనేటోన్తోనేం లేకుండా మన సర్పంచ్ని మనమే ఎన్నుకోవాలి. ఇంకో ముచ్చట రేపీళ్లు పెట్టె మీటింగ్కు నేనైతే ఆళ్లిచ్చే పైశల్కోసం అసల్కేబోను. మీరు బోతాంటే నేనాప. కానీ, ఒకటి మాత్రం జెప్తున్న ఇనుండ్రి నాకు అన్నం లేక ఆకలితో సత్తమాయే గాని, నేను ఆత్మగౌరవంతో బత్కుత" అని గట్టిగా ఓర్రుకుంటూ మాట్లాడిండు.
ఒక్కశార్గా కటిక శీకట్లో సుక్కలు మెర్శినట్లు, జనాల మొఖాళ్ళు మెర్శినయ్. ఆ మెరుపంత ఒళ్ళంతా పాకినట్లు అయ్సు పొరగాళ్ళంతా ఈలలెత్తుంటే, అమ్మలక్కాల సప్పట్లతో వాడంత మోగినయ్. ఆ సప్పట్లన్ని కొత్వాల్కి సావు డప్పులెక్క ఇనబడ్తున్నాయి. ఒక్క నిమిసం గూడ ఆడుండలేకబోయిండు. ఒక్కమారు మాట్లాడకుండా గద్దెమించెలి దిగి కారెక్కిండు.
పెద్ద మన్శులందరు కొత్వాల్కాడ్కి బోయి "ఏమైందొర" అని అడిగిర్రు.
"ఏమైంది ఏంద్రా, మీ కాడ్కత్తే గిదార మీర్జేశే మర్యాద. ఇగ మీ ఇష్టం, మీసావు మీర్సావండి. ఇగో ఇవైతే దీస్కోండి, రేపచ్చేటోళ్లయితే రండి" అని పైశలకట్టిచ్చి కార్లబోయిండు.
రమేష్ ఉర్కుంటబోయి జోసెఫ్నెత్తుకొని "అరేయ్ మొదటిసార్రా కొత్వాల్కి మొఖం లేకుండా జేశినవ్" అన్కుంటూ ఎగుర్తుండు. వాడంత అరుపుల కేకలతో జోసఫ్ సూట్టుర పొగయ్యారు ఏదో సాధించాం అని.
"మా అయ్యనే ఎంత బాజెప్పినవ్" అని ముసలోళ్లందరు దగ్గర్కత్తాంటే, జోసెఫ్ ధన్న ధన్న రమేష్ భుజాలమించేలి దిగి కుక్కను కొడితే ఉరికినట్లు ఒగ ఉరుకుడు ఉరుకుతాండు పూర్ణ గుర్తచ్చి. వాడంత ఏం పట్టిందీ పొరనికన్నట్లు జూత్తాండ్లు.
జోసెఫ్ కంకిశేను కాడ్కచ్చి మొత్తం జూశిండు. పూర్ణ ఏడ అవ్పడక బోయేసర్కి, ఎల్లిపోయిందేమోనని జూశి జూశి అన్నుంచి ఎల్లిపోయిండు.
*
పొద్దు పొద్దుగాల్నే గద్దెకాడ కొత్వాలిచ్చిన కొత్త డప్పులు, కోలలు దెచ్చిపెట్టిర్రు పెద్దమన్శులు. "మీటింగ్కు టైం అయితాంది. మంది ఒత్తరా రారా? ఏందో దెల్సుకొబో" అని కట్టయ్యను మత్లావ్ దెల్సుకోనికి తోలిర్రు.
కట్టయ్య నాల్గు వాడలు దిర్గచ్చి "ఒక్కొక్కడు గడ్డ మీద కూసోనున్నరు. ఏడ ఏర్పడతలేదు ఆళ్లకు. ఆడోళ్ళు, మొగోళ్ల కాన్నుంచి ఒక్కలు ఒచ్చేట్టు అవ్పడ్తలే" అని పెద్దమన్శులతో అన్నడు.
"రాకబోతే రాకబోనియ్, చిన్న పొరన్ని బట్టుకొని ఏతుల్ జేత్తా ల్లు. మనమన్నా బోదాంబా" అని పెద్దమన్శులు డప్పులందుకున్నరు.
మీటింగ్కు కావాల్సిన పనుల్ని కొత్వాల్ ఆగమాగమవుకుంటా, అన్ని తానై జూసుకుంటుండు. ఎట్లైన ఎమ్మెల్యే మెప్పుబొంది, ఈశారి పార్టీలో గట్టి పదవి దీస్కోవాలని మస్త్ ఆశతో ఉండు.
"అరేయ్ కిరణ్గా, నిన్న అంత అయ్యిందిగా డప్పుల్లోళ్ళు ఒత్తరంటవ" అని అన్మానంతో అడ్గిండు కొత్వాల్.
"ఎందుకు రార్ సార్, పైశల్ పార్దెంగింతే ఎవ్వడైన వోత్తడు. దాంట్లో మావోళ్ళు ముందుటరు" అని గట్టి నమ్మకంతో అన్నడు కిరణ్.
అంతలోనే నల్గురు పెద్దమన్శులు మిగిల్న డప్పులతో, కోలలతో ఒత్తవుండ్రు. ఆళ్ళను జూశి కొత్వాల్ "ఏంరా కట్టయ్య గి నల్గురచ్చి ఎవ్వన్ని బాద్నం జేద్దాంమని ఒత్తాల్లురా, గింతన్నన్నా గుద్ద శిగ్గుడాలే రానీకి" అని కోపంతో అర్శిండు.
"సారు తప్పయింది. ఆ పోరని మాటల్కి ఇంట్లకేళి ఒక్క పుర్గు గూడ బయటక్రాలే. ఈ ఒక్కశారి క్షమించండి దొర, ఇంకోశారి ఇట్ల కానీయం" అని కొత్వాల్కి దండం బెట్టిర్రు పెద్దమన్శులు.
"అరేయ్ మీరీన్నుంచి బోండ్రా, నాక్కసలే మాటల్ సక్కగ రావ్" అని కొత్వాల్ తిడుతుంటే, పక్కనున్న కిరణ్ పెద్దమన్శులను పక్కక్ దిస్కచ్చి "మీరైతే ఆడుండ్రి నే జెప్తా సార్కి" అని అన్నడు.
"కిరణ్గా ఎంత పనైందిరా, ఎమ్మెల్యే కాడ ఇజ్జత్ పోతదిరా నాది. ఆ లంబిడికొడుకులు ఎంత పన్జేశిర్రా" అని మొత్తుకుంటుండు.
"ఊకోండి సార్ గ పొరగాళ్ళు మళ్ళేం జెప్పి జనాలను రానియ్యకుండా జేశిర్రో, ముందైతే ఎట్లనో గట్ల ఈ మీటింగ్ ఒడగొట్టుకుందాం" అని కొత్వాల్ని సందాయించాడు కిరణ్.
కొత్వాల్ కొంచెం నిమ్మలపడి "అవ్ రా ముందైతే ఈ మీటింగ్ కానీయ్. ఆళ్ళ సంగతి తర్వాత జెప్పుదాం. అదేట్లుండాలంటే ఇంకోశారి కొత్వాల్ పేరు ఎత్తాలంటే కింద్కేలి సమర్కారలే, నా కొడుకుల్కి" అని సుర్కంటిన పిల్లిలెక్క అటిఇటు దిర్గుతుండు.
"ఎటుబోతర్ సార్, దొరుకుతర్ ఆళ్ళు గప్పుడు జెప్పుదాం. ముందైతే గి పని చూద్దాం" అని కొత్వాల్ని దిస్కోబోయిండు కిరణ్.
*
"కూలికి బోయేదాన్ని శేన్లకు గుంజుకచ్చి, ఏంది నువ్వు లే నామించేలి" అని కసుర్కుంది పూర్ణ.
"అబ్బా కోపమత్తందా?"
"హ రాక, నువ్వు రాగానే ఎంబడేసుకొని ముద్దులిత్తనుకున్నవా? నిన్న రాత్రంతా నీగోసం ఎంతశేపు జూశిన్నో దెల్సా" అని పక్కకి దిర్గింది పూర్ణ.
"నేనొచ్చిన్నే గానీ, నేనొచ్చేశర్కి నువ్వు బోయినవ్" అంటూ జోసెఫ్ తన శేతుల్లోకి పూర్ణ శంపలను దీస్కొని పెదాలను అందుకోబోతుండగా మొకం పక్కకి దిప్పుకున్నది.
పూర్ణను జోసెఫ్ బుజ్జగిత్తాంటే,
"ఎవల్లుళ్ళ ఆడ" అని శేను లోపల్కచ్చి పిల్శిండు కావాల్కాశే స్వామి.
ఆ మాటతోని పూర్ణజోసెఫ్ లిద్దరు అదిరిపడ్డారు. ఆళ్ళు ఎన్కకు దిర్గి జూడగానే స్వామి కట్టేబట్టుకొని రానే వొచ్చిండు.
"గిల్లకచ్చి మీర్జేశే పనులు గివ్వ? మీ సంగతి జెప్తాగు"
పూర్ణ వన్కిబోతాంది. జోసెఫ్కేమో ఏం మాట్లాడాలో సమజైతలేదు. ఐన ఎట్లనో గట్ల ధైర్నం దెచ్చుకొని "పూర్ణ నువ్విన్నుంచి బో, నే జూశుకుంటా" అన్నడు.
పూర్ణ పోవడాన్కి లేవగానే "ఓ పోరి ఎటుబోయేది. ఊళ్లేందరచ్చే దాక ఎటుబోయేదిలేదు" అంటూ బెదిరిక్జిండు స్వామి.
"అన్న నీకు దండం పెడ్తా బోనియ్" అని బతిలాడుకుంటూ పూర్ణకు బొమ్మని సైగ జేశిండు జోసెఫ్.
ఎంబటే పూర్ణ ఉర్కుడు అందుకుంది. అది జూశి పూర్ణ ఎన్క స్వామి ఉర్కబోతుంటే, స్వామి గల్ల బట్టుకొని గుంజగానే బోర్లబొక్కలబడ్డాడు. జోసెఫ్ గూడ ఆన్నుంచి తప్పించుకబోయిండు.
స్వామి తేరుకొని లేశి జూశేశర్కి ఇద్దరు కనబల్లె "ఈళ్ళ సంగతి గిట్ల గాదు, ఊళ్ళే జెప్తా" అన్కుంటూ ఊళ్లేకు నడ్శిండు.
*
ఊరి పని దీరాగ, సూరీడు ఎర్ర మందారంలా మెర్తాంటే, స్వామి శేయబట్టి ఊరంతా పూర్ణజోసెఫ్ల యవ్వారం తెల్శింది.
పూర్ణకింకా అదురుపోలేదు. భయం భయంగానే నడ్తాంది ఇంటికి. ఆళ్ళ భాగ్యత్త పూర్ణను జూశి "రామ్మ తల్లి, కూలికని బోయి నువ్వు జేశే నిర్వాకమిద? మీ మామైతే తాళ్ళల్లా నుంచి రానియ్, నీ సంగతి జెప్తా" అని సదువుతుంది.
పూర్ణ ఏడ్తూ కాల్శేతులు కడ్కోకుండానే మంచంలా పడింది. కండ్లల్ల నుంచి నీళ్లు ధారలు అట్టకట్టినయ్. తన శంపలు నావర్పట్టికి అతుక్కబోయి మస్కనిద్రలకు బోయింది.
నర్సయ్య ఎప్పుడచ్చిండో తెలీదు. నిద్రమబ్బులోనున్న పూర్ణకు కొంచెం కొంచెం ఆళ్ళ అత్తమామలు మాట్లాడ్కుంటున్న మాటల్ ఇనబడ్తున్న, ఏం దెల్వనట్లు అట్లే పడ్కుంది.
"జూశినవా, మేనకోడలని నెత్తిమీదేట్టుకుంటే ఎంత పన్జేశింది. మల్ల ఏం ఎర్గనట్లు ఎట్ల పన్నదో జూడు" అని పూర్ణని భాగ్య లేపబోయింది.
"ఏయ్ ఆగావే. లే నడ్వు ఈన్నుంచి, పన్నదాన్ని లేపుతానవ్. అది చిన్న పోరి దానికేం దెల్సు. వాడే దీనికేదో మందు బెట్టివుంటడు" అని కొప్పాడ్డాడు నర్సయ్య.
"గిట్లనే ఎన్కేసుకుంటరా, ఏదో ఒకరోజు మనల్ని బదాట్ల నిలబెడ్తది" అని కసుర్కుంటా బోయింది భాగ్య.
పూర్ణ పక్కపొంటి మంచం మీద నర్సయ్య కూసోని నెత్తికున్న తువ్వాల దీశి, పూర్ణ కాళ్లకున్న దుబ్బను తూడ్తు "బిడ్డ లేరా" అని లేప్తుండు.
పూర్ణ కండ్లు ముసుకున్న మెల్కతోనే ఉంది. ఏమైతే అదే అయితదని ధైర్నం దెచ్చుకొని "నన్ను సంపినమాయే గానీ, నే వాన్నే పెళ్లి జేశుకుంటని మామకు జెప్తా" అని లేశింది.
"ఏమైంది బిడ్డ? కంకిశేను ఏంది? ఎవడెవ్వడోచ్చి ఏదేదో జెప్తున్నరు" అని మన్సుల మాట అడ్గిండు.
"మామ నేనే ఎప్పుడో జెప్పుదాం అనుకున్నానే, నాకు జోసెఫ్ అంటే శాన ఇష్టమే. మా పెళ్లి జెయ్యి మామ నీకు దండం పెడతా" అని నర్సయ్య రెండు శేతుల్బట్టుకొని వేడ్కుంది.
నర్సయ్యకి కోపమత్తాన అన్సుకొని "కుదరదు బిడ్డ, కులాన్ని కాదని మనం ఈ ఊళ్ళ సక్కగా ఉండలేం. వాన్ని మర్వు బిడ్డ మన మంచికే జెప్తున్న" అని పూర్ణ తల నిముర్తూ జెప్పిండు.
నర్సయ్య మాటల్కి పూర్ణకింకా ఏడ్పు ఎక్కువై "ఆడు మంచోడే మామ, నన్ను నీ లెక్కనే బా జూశ్కుంటడు" అని అంది.
నర్సయ్య నిమ్మలంగా పూర్ణను నొప్పియకుండా, "ఇక్కడ కావాల్సింది గుణం కాదు బిడ్డ కులం. నీకు జెప్పిన సమాజ్గాదు. నా మాటీను అంతకన్న మంచోన్ని నీకు జేత్తా" అని సమ్దాయించిండు.
పూర్ణ ఏం మాట్లాడ్కుండా మంచంలా కూసోనుంది. నర్సయ్య అక్కన్నుంచి బయటికత్తు పొరగాళ్లందరిని పిల్శిండు.
"అరేయ్ జోసెఫ్ గాడెక్కడున్న ఎతకండ్ర" అని కేకెశిండు. దాంతో గౌండ్లోళ్ల పొరగాళ్లంతా ఒక్కాడికచ్చి ఎతకనీకి బోయిర్రు.
పూర్ణకి ఆళ్ళ మామ మాటల్కి, ఏదో అన్పించి ఎట్లైనా జోసెఫ్ని కల్వలన్కుంది.
పోరగాళ్ళు ఊరంతా ఏ వాడ ఒదిలిబెట్టకుండా ఎత్కుతాళ్ళు. ఏడా జూశిన జోసెఫైతే అవ్పల్లె. ఎట్లయిన దొర్కబట్టాలని కంటికి కున్కు లేకుండా దిర్గుతాళ్ళు.
ఇదే అదునన్కొని కొత్వాల్, కిరన్ని పిల్శి "అరేయ్ నా మాటగా గౌండ్లోళ్ల పెద్దమన్శులకి జెప్పురా. ఆడు దొర్కకబోతే గాజులేశుకోని దిర్గమను" అని అన్నడు.
"సరే సార్" అని కిరణ్ బోతుంటే, మల్లాపి కొన్ని పైశల కట్టనిత్తు "ఆళ్లకు శాతగాకపోతే, నువ్వన్న వాన్నేయ్ రా"
కిరణ్ మారు మాట్లాడ్కుండా కొత్వాల్ మోకాన జూత్తాండు.
"ఏమిరా అట్ల జూత్తానవ్. మీ కులపోడని జూత్తానవా, ఒగాల అదైతే, రేపాడు నీ సర్పంచ్ సీట్ని శింపుతడు. నువ్వైతే ఈ పని కానీయ్, నిన్ను సర్పంచ్గా నే జేత్తా" అని రెచ్చగొట్టిండు.
సర్పంచ్ జేత్తానేశరికి మస్త్ సంబ్రమయ్, ఇగేమి ఆలోశించకుండా పైశల కట్టందుకొని గౌండ్లోళ్ల కాడ్కి ఉర్కిండు కిరణ్.
ఇగ ఊళ్లే నాకెదురు లేదనుకుంటూ నింపాదిగా ముశి ముశి నవ్వుకుంటా కుర్చీలో కూసున్నడు కొత్వాల్.
*
నర్సయ్య ఊరంతా ఎతికి ఎతికి గొల్ల బాషన్న ఇంటిదాకచ్చి తల్పు కొడ్తుండు.
"ఎవలయ" అని అడ్కుంటూ తలుపు దీశిండు బాషి.
"ఏం నర్సయ్య గింత శీకట్ల, గిటు బాటబట్టినవ్. ఏమన్నా పన ఏంది" అని దెల్సుకోనికి అడ్గిండు.
"జోసెఫ్గాడు గావలే బాషి. వాడీటు ఒచ్చిండా? ఒత్తె ఏడున్నడో జెప్పు".
"ఆడేడున్నడో, ఎటుబోయిండో నాకెట్ల దెల్తది. దీనిగోసం గి శీకట్లచ్చి అడుగుతానవా? ఏదన్నుంటే రేపొద్దుగాల మాట్లాడుదాంగాని నువ్వుబో."
"నీక్దెల్సు బాషి, ఆడేడున్నడో ఆనికి జెప్పు. ఇంకోశారి నా మేనకోడల్ జోల్కి ఒచ్చిండో, సంపి బొందబెడతానని"
"ఏంరా నర్సిగా బెదిరిత్తనావ? నా ముంగట ఆడి మీద శెయ్యి ఏయ్, గొడ్డలి శిప్ప మర్రేశి సంపుతా బిడ్డ. ఆని జోల్కత్తె నడువ్ ఈన్నుంచి" అని బెదిరిచ్చిండు బాషి.
"బోతన్న, గానీ మా జోల్కత్తె నే అదే పన్జేత్తా జూడు" అన్కుంటూ మర్రిబోయిండు నర్సయ్య.
ఆళ్ళు బోగానే తల్పేసుకొని మంచంలా ఒరిగిండు బాషి.
"ఎంత పనాయే, పోరనికి ముందున్నుంచే జెప్తున్న జాగ్రత్తరాని, గిప్పుడు గి లొల్లి ఏడిదాక బోతదో" అని ఆలోచిత్తాంటేనే మల్లేవరో తల్పు కొట్టిన సప్పుడైంది.
"దెహే నీయమ్మ మల్ల ఎవల్రా" అని శికాక్తో తల్పు దీయగానే ఎదుర్గా పూర్ణ.
ఎడ్శి ఎడ్శి మొకమంత వాడిపోయిన పూర్ణను జూశి ఎంబటే ఇంట్లకు గుంజి తల్పేశి "ఏమైంది బిడ్డ గిప్పుడచ్చినవ్, ఎవలు జూడలేగా" అని అడ్గిండు.
"అన్న నే జోసెఫ్ని జూడాలే. వాడికేమయ్యిందో" నని ఎడ్తాంది.
"వాడు ఈడ లేడు బిడ్డ, ఏడున్నడో నాక్దెల్వదు" అని ఊకోబెడ్తుండు.
"అట్ల అనకే అన్న, నీక్దెల్వకుంటా వాడేట్బోడు. మా మామ మాటలు ఇంట ఉంటే భయమేత్తాంది. జర కల్పియన్న" అని దండం బెట్టింది.
ఏం జెయ్యాలో బాషికేం సమాజ్గాలే, ఈ పిల్లతోబాటు ఎవరన్న ఒచ్చిర్రాని బయట సూట్టురా జూశిండు. ఎవర్రాలే అని అన్కున్నకానే పూర్ణను దీస్కొని గొర్లమంద కాడ్కి బోయిండు.
"లోపల్కి బోయి జూడుబో బిడ్డ"
గొర్లమందను దాటుకుంటా పూర్ణ బోయేశర్కి, గొర్లమధ్యల గొంగడి గప్పుకొని జోసెఫ్ పడుకొని ఉండు.
జోసెఫ్ని అట్ల జూశేశర్కి పూర్ణకి ఏడ్పు ఎక్కువై ఎంబటేబోయి తనని అముల్కొని "నావల్లనే నీకీ గతచ్చెనే బావ, ఎవ్వల్ లేనట్టుగా గొర్లల్ల పన్నవానే బావ" అని ఎక్కి ఎక్కి ఏడ్తూ జోసెఫ్ మొకమంత ముద్దులు పెట్టింది.
"లే బావ లే, మనం ఈడ అద్దు. ఈడ ఇట్లనే ఉంటే మనల్ని బతకనియ్యరు, ఎటైనా బోదాంబా" అన్కుంటూ జోసెఫ్ని లేపింది.
"ఎట్బోతమే, ఏడ్కని బోతం. ఏడ్కిబోయిన ఇదే బత్కు, ఆడ్కెడికో బోతే నా కులమేమన్నా మార్తదా పూర్ణ. ఏది ఏమైనా ఈన్నే ఉండి కొట్లాడుదాం."
"అద్దు ఈడ అద్దె అద్దు. మా మామను జూత్తనే భయమేత్తాంది నాకు" మంకు బట్టుకుంది పూర్ణ.
అంత గమనిత్తున్న బాషి ఆళ్ళ దగ్గర్కత్తు "అవ్ రా జోసెఫ్, ఈ రాత్రి ఏమైతదో కుతం తెల్వదు. మీరేటన్న బోయి ఎట్లనోగట్ల పెళ్లి జేశ్కోని రండ్రి, గప్పుడు నే జూశ్కుంటా" అని సలయిచ్చిండు.
"ఎటుబోనే ఏడికనిబోను, మల్లోకటి శేతిలో రూపాయిబిళ్ళ గూడ లేదు" అని అంటుండగానే బాషన్న పైశల్ దీశి జోసెఫ్శేతిలో బెట్టిండు.
జోసఫ్ గమ్మునవుండి, నోరు మెదపలేదు. కండ్లపొంటి వాటంతటవే నీళ్లు కార్తానయ్.
"ఊకోరా పిచ్చోడ నే లేనారా నీకు" అని జోసెఫ్ ఎన్నుమీద భరోసాగా రెండు దెబ్బలేశిండు బాషి.
జోసెఫ్ నీళ్లు తుడ్శుకుంటు "నీకు బాకి పడ్తనే అన్న"
"సరే సరేగాని ముందు ఈన్నుంచి ఎల్లుండ్రి" అని తోల్తుంటే జోసెఫచ్చి బాషిని కౌగిలించుకున్నడు.
"అరేయ్ జోసెఫ్, నిన్ను నమ్మత్తాన పిల్లకు ఏ కట్టం రాకుండా జూశ్కోరా" అని ఇద్దర్నిబంపిండు బాషి.
*
ఊరంతా దిర్గి దిర్గి నర్సయ్య ఇంటికచ్చేశర్కి, ఆడ జనాలంత మోపైండ్రు. భాగ్య గద్మల గూసోని సాపిత్తాంది.
"ఏమైందే, ఎవలో సచ్చినట్లు జేత్తానవ్" అని ఆగమాగంగా అడిగిండు నర్సయ్య.
"కోడల్ కోడలిని మీదేశ్కుంటే, మన కొంప కూల్శి ఆ మాదిగొన్తోని లేశ్పోయిందిరయ్య" అని ఉన్నముచ్చట జెప్పింది భాగ్య.
మా మాటకు నర్సయ్య దట్టుకోలేక బోయిండు. ఒక్కశారిగా ఒళ్ళుదిర్గి కూలబడ్డాడు. ఎంబటే ఆడున్నోళ్లు అందుకొని నీళ్లు దాపిచ్చిర్రు.
కిరణ్, గౌండ్లోళ్ల పెద్దమన్శులందరు కల్శి కొత్వాల్ జెప్పింది జేయడానికి, ఆళ్ళు అనుకున్న ముచ్చట జెప్పనీకి నర్సయ్య కాడ్కచ్చి "జూడు నర్సయ్య, గిట్ల కూలబడితే గాదు ముచ్చట లేశి ఏదొకటి జెయ్యి లేకపోతే మేమేదొకటి జెయ్యల్శి ఒత్తది. అదెట్లంటే నువ్వు గిప్పుడు ఎక్కే శెట్లు బంద్బెట్టి, వేరేటొళ్ళకిత్తం. నిన్ను కులంలకేలి ఎలెత్తం. ఆళ్ళు గన్క పెళ్లి జేశ్కొనత్తే, ఇదే జరుగుద్ది జాగ్రత్త" అని పెద్దమన్శులు నర్సయ్యను భయబెట్టిర్రు.
నర్సయ్యకింకింత ఆగమాగమయ్యిండు. ఒక్కశారిగా తలకాయలో పుర్గు దిర్గినట్లై, ఎంబటే లేశి గుంజకున్న ముస్తాద్లోంచి కత్తి దీశిండు.
"నాతోని ఎవ్వదత్తడో రండ్రి. ఇయ్యలా వాన్ని సంపి, నా కోడల్ని దెచ్చుకుంటా" అని అన్నడు.
పోరగాల్లు, కిరణ్ మల్ల ఆనితోనచ్చిన మన్శులు తలో కట్టె బట్టుకొని గుంపులు గుంపులుగా బోయిర్రు. ఏడబడితే ఆడ అటు నర్సాయ్యోళ్ళు, ఇటు కిరణోళ్లు ఎంత దిర్గిన పూర్ణజోసెఫ్లిద్దరు కనబల్లేదు.
ఇగ కిరణ్కి ఆళ్ళ మన్శులకి మోసచ్చి, కెనాల్ బ్రిడ్జ్ కాడ కూసున్నరు.
"ఎందన్నా, ఎంత ఎతికిన దొర్కుతలేరు" అని గుంపులోంచి ఒకడు అంటున్న, కిరణ్ దేకకుండా ఏదో కదుల్తుందని కెనాల్ కట్టకేలి జాత్తాండు.
"అరేయ్ నాకే కనబడ్తాంద? ఓశారి అటు జూడుండ్ర, ఆడేదో ఉంది" అని జూపిచ్చిండు కిరణ్.
"అవ్ అన్న మాకు కనబడుతాంది"
"సరే బోయి చూద్దాంబా" అని కొంచెం ఆళ్ళు ముందుకుబోగానే పూర్ణజోసెఫ్లిద్దరు నడ్సుకుంటబోతాళ్ళు.
అదిజూశి కిరణోళ్లందరు ఎంబటే ఆగి, నిమ్మలంగా అడ్గులేశి, ఒక్కశారిగా ఆళ్ళ మీద్కి దుంకిళ్ళు.
ఏదో సప్పుడు అయితందని జోసెఫ్ ఎన్కకు దిర్గానే, కిరణోళ్ళు ఆళ్ళ మీదకు ఉర్కిరాడం జూశి, ఎంబటే పూర్ణ శెయ్యి బట్టుకొని ఉర్కబోతుంటే లంగదట్టి ఇద్దరు బోర్లబొక్కల బడ్డారు.
పూర్ణజోసెఫ్లిద్దర్ని సుట్టు ముట్టిర్రు.
"అరేయ్ ఈ పోరిని దీస్కబోయి, నర్సన్నను దీస్కరాబోండిరా" మోసబోసుకుంటా అన్నడు కిరణ్.
జోసెఫ్ని అన్గబట్టి పూర్ణను గొర్ర గొర్ర గుంజుకబోతుంటే కాళ్లడిత్తు అర్తాంది.
"అన్న అన్న మీకు దండం బెడతా, మమ్మల్ని వదిలేయండన్న" అని కిరణ్ కాళ్ళు బట్టుకొని బతిలాడుతుండు జోసెఫ్.
కిరణ్ నవ్వుకుంటా జోసెఫ్ని మోకాళ్ళ మీద కూసోబెట్టి, ఆళ్ళు ఎంట దెచ్చుకున్న కట్టెలతో యిపరితంగా కొట్టిర్రు.
"నువ్వు ఊరిని మార్తావ్రా? దొరకెదురత్తవరా? నీ మోకాన్కి ఈ పోరి గావాళ్లరా? అని సదువుతూ జోసెఫ్ మొకం మీద ఉమ్మేశి, జోసెఫ్ బట్టలు శింపి పారేశిర్రు.
ఆ బర్వాతన జోసెఫ్ రక్తంతో తానం జేశినట్లు అగుపడుతుండు. కనీసం నోట్లకేలి మాటెల్లక సోయిలేకుండా బడ్డాడు. తన రెండు కాళ్ళను ఎడంజేశి మధ్యలో ఒకలు తర్వాత ఒకలు వీడు బతికితే మమ్మల్ని బతకనియ్యడన్నట్లు పిచ్చల్శితికి బోయేట్లు తన్నుత్తుండ్రు. నొప్పిని భరించలేక జోసెఫ్ ఒగ ఒర్రుడు ఒర్రుకుంటా శేతితో భూమిని కొడుతుండు.
అట్నుంచి నర్సయ్య కత్తి బట్టుకొని ఉర్కతాండు. ఆళ్ళు జోసెఫ్ని లేపి తలకాయ బట్టుకోని "అన్న ఏయ్ అన్న నర్కు ఈన్ని" అని రెచ్చగొడుతుండ్రు.
నర్సయ్య కత్తి లేపిండు. ఒక్కశారిగా మెడ దాకచ్చి, ఆగిపోయి ఆలోచిత్తాండు.
"ఏమైందన్న ఏమైంది. నర్కు వాన్ని నర్కు" అని అందరూ అర్తాళ్ళు.
"సంపలేను నే సంపలేను" అని కత్తిని విసిరిగొట్టిండు నర్సయ్య.
అందరు, "ఏంది ఏం జేత్తాండు" అని జూత్తాళ్ళు
"నీకేమన్న తెల్తాంద, శాతకానోన్లెక్క జేత్తానవ్" అని పెద్దమన్శోకడు అనగానే,
"తెల్తాంది అంత తెల్తాంది. నేను ఈ కూని జెయ్యలేను అట్లాని కులాన్ని కాదనలేను. వీన్ని సంపితేనే కులంలో ఉంటాన? నా కోడల్ నాకాన్నే ఉంది, గిప్పుడు వీన్నెందుకు సంపాలి. నేను సంపను. ఇది నా సమస్య నే జూశుకుంటా, మీర్ బోండ్రి ఈన్నుంచి" అని బాధపడుతూ అందర్ని బతిలాడిండు.
"ఛీ వీడబ్బా గిట్ల జేశిండేంది, కొత్వాల్కేం జెప్పలే" అని కిరణ్ అనుకుంటుంటే, పొరగాళ్ళు మల్ల పెద్దమన్శులు ఎల్లిబోయిండ్రు.
నర్సయ్య నెత్తికున్న తువ్వాలను దీశి బర్వాతనున్న జోసెఫ్ నడుంకి గట్టి కూసోబెట్టిండు. జోసఫ్కు సోయి ఉండి లేనట్టుండు. ఒళ్ళంతా రక్తం ధారలు అట్టు గట్టినయ్. నర్సయ్య ఆడి అవస్థ జూడలేక,
"అరే నాయ్న, నా మాటీనురా. నిన్ను జూత్తాంటే నాకు బాధైతాందిరా, అట్లని నా కోడల్నీకు ఇచ్చి పెళ్లిజేయలేను. శాన చిన్నోళ్ళంరా మేము. కులాన్ని కాదని బత్కలేము. బత్దేరువుండదు నా ఇంట్లొళ్ళందరం బదాట్ల బడ్తాం. నావోళ్ళ మధ్య ఏం కానోన్లెక్క బతకాలే. నీకు దండం బెడ్తా, మమ్మల్ని వదిలేయ్రా" అని బతిలాడుకుంటుండు.
నర్సయ్య మాటల్కి జోసెఫ్ ఓపిక దెచ్చుకొని నిమ్మలంగా కండ్లు దెర్శి "నాయిన మేం ప్రేమించుకున్నమే, మీరే మమ్మల్ని ఒదిలెయ్యండ్రి. నీకు పుణ్యముంటది" అని అన్నడు.
పట్టరాని కోపంతో జోసెఫ్ ఎదురుబొచ్చె మీద నర్సయ్య "లంజోడక ఇనవరా" అని ఒక్క తన్ను తన్నగానే ఎల్లెలకల బడ్డాడు. ఎన్కకు దిర్గకుండా నర్సయ్య, జోసెఫ్ని ఆన్నే ఒదిలేశి బోయిండు.
జోసెఫ్ నిమ్మలంగా లేశి తన నడుముకున్న తువ్వాలను సదురుకుంటు, ఒంట్లో నుంచి రక్తం కార్తున్న ఓపిక దెచ్చుకొని ఒక్కో అడుగేశుకుంటు నడ్తాండు.
నర్సయ్య బోయింది జూశి కిరణ్ ఎవలకు కనబడకుండా జోసెఫ్ ఎన్కకచ్చి ఎన్నులోకి నర్సయ్య విసిరిగొట్టిన కత్తి దించిండు.ఏమైందోని దేరుకునే లోపు తన్ను తన్నెశరికి జోసెఫ్ కెనాల్ కట్ట మించేలి జర్ర జర్ర జారుకుంటా వారి మల్లల్లా బడ్డాడు.
జోసెఫ్ నెత్తురుతో వరిశేను తడ్తాంటే లేవలేకబోయిండు. కండ్లు దెలేశి, ఆకాశంలోనున్న సగం ఎన్నెలను జూత్తు పూర్ణ నవ్వోలే గుర్తచ్చి పెదాల చిరునవ్వుతో, "ఈ ఎన్నెల నీ నవ్వులా ఉన్న ఇప్పుడెంత ఎడ్తానవో" అని అన్కుంటు,
"తండ్రి, సమాప్తమైనది.
దేవా, హతుడనై నా జీవాత్మ నన్నొదిలెల్లు సమయాన నీ దరికి నన్ను చేర్చుకోనుము.
ఆమెన్."
కొడుకా...
ఎట్లున్నవో.
మీ అమ్మ
కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి
నీ జాడ కోసం.
కొడుకా.. ఓ కొడుకా
కండ్లల్ల నీరూపే మెదులుతుంది
కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది
చాత కానీ ముసలి దాన్ని
కండ్లు లేవు
కాళ్ళు లేవు
నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.
ఏ యమ కింకర్ల చెరలో చేరితో
ఏ చిత్ర హింసల కొలిమిలో
కాగుతున్న వాడివో కొడుకా.!
కొడుకా
అవ్వకు చిన్నొడివి
బుద్దులు నేర్చినొడివు
అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి
నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు
కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా
ఏ గ్రహణం వెంటాడింది నిన్ను
అమ్మకు కొడుకు యెడ బాటు
చెరసాలనే నీన్ను బందీని చేసేనా
కొడుకా...!!
కొడుకా
నీ ప్రేమగల్ల మాటను
నీ రూపును
నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?
అవ్వ అన్న పిలుపు
అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను
నా గుండెలకు హత్తుకొని
నా కండ్ల నిండా నీ రూపాన్ని
మీ అమ్మతోడు చూసుకొని
మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..
కొడుకా
రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి
మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..
(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
10
బిజెపి పార్టీ రామజన్మభూమి వివాదం రెకెత్తించింది. అద్వాని నాయకత్వలో జరిగిన రథయాత్ర మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎదో విదంగా అధికారంలోకి రావటానికి పన్నిన కుట్రలో బాగంగానే రామజన్మభూమి వివాదం ముందుకు తెచ్చారు. దానికి తోడు ‘మోడి’ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన గుజరాత్ అల్లర్లు ముస్లీంలూచకోత హిందు మతోన్మాదాన్ని తీవ్ర స్తాయికి తీసుకపోయింది. కాంగ్రెసు పదెండ్ల పాలన ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సరికదా అనేక కుంభకోణాతో భ్రష్టు పట్టపోయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో నరెంద్రమోడి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.
పదిహెడవ లోకసభ ఎన్నికలను ప్రకటించింది. ఏప్రిల్ రెండవ వారం నుండి నాల్గవ వరకు ఏడు పేజుల్లో జరుగనున్నాయి.
రామయ్య కాలనీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అసలే ఎండలు మండి పోతున్నాయి. అంత కంటే ఎక్కువగా ఎన్నికల వేడి మొదలైంది. రామగుండం పెద్దపల్లి పార్లమెంటు యస్సి నియోజక వర్గంలోకి వస్తుంది. కాని ఎన్నికల్లో పోటీ పడుతున్నాది మాత్రం ఇద్దరు హేమాహేమీలు. పేరుకు వాళ్ళు యస్సిలేకాని అర్థికంగా బాగా బలం కలిగినోళ్ళు.
తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి తరుపున ‘వెంకటేశ్‍నేతను పోటికి నిలిపారు. రాజకాయాల్లో ఏదీ శాశ్వతం కాదు గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిదిలోని చెన్నూరు నియోజక వర్గం నుండి వెంకటేశ్ కాగ్రెసు తరుపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిండు. అంతా అర్నెల్ల కాలేదు. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినవి. పార్లమెంటు ఎన్నికల ప్రకటన వెలువడిన తరవుఆత ఆయన టి.ఆర్.యస్ పార్టీలోకి మారి సీటు దక్కించుకున్నాడు.
రాజకీయ పార్టీలు ఏవి ఏవిలువలు పాటించటం లేదు. ఎన్నికల్లో గెలువగలిగే సత్త ఉండి, డబ్బు దస్కం బాగా ఖర్చుపేట్టె వారిని ఏరి కోరి, పిలిచి మరి టికట్ ఇస్తానయి. అంటే గెలుపు గుర్రాల మీద పార్టీలు పందెం కాస్తున్నాయి. అ విదంగా చూసినప్పుడు ‘వెంకటేశ్ నేత’ అందుకు సమర్థుడని పార్టీ బావించింది. పెద్దపెద్ద కంట్రాక్టులు చేసి ఆయన వందల కొట్లు సంపాధించిండు.
ఎన్నికలంటే మాటలు కాదు కొట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పుట్టపిత్తులా పైసలు ఎగజల్లి ఓట్లు రాబట్టుకోవాలి. ఎన్నికల్లో నెగ్గిన తరువాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చు. రాజకీయాలు పక్తు వ్యాపారం అయిన చోట అంతకంటే ఎక్కువ ఏమి అశించలేము.
ఇటువంటి రాజకీయాల్లో అరితేరిన వాడు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చంద్రశేఖర్ రావు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరుంది అవిదంగా ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకిజరిగిన ఎన్నికల్లో నెగ్గి మొదటి ముఖ్యమంత్రి అయిండు.
అధికారంలోకి వచ్చిన తరువాత అయన అసలు రంగు బయట పడసాగింది.
ఏ ఆశల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడిండ్లో ఆ ఆశలను నీరుగరుస్తు పోయిండు. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి, తనకు ఎవరు రాజకీయాల్లో పోటీ రాకుండా ఉండటం కోసం ఉధ్యమంలో తనతో కలిసి పనిచేసిన వారిని ఒక పద్దతి ప్రకారం పక్కకు పెట్టి అవకాశ వాదులు, జంపు జాలానిలను, తన చెప్పు చేతుల్లో మెదిలే వాళ్ళను పార్టీలో చేర్చుకొని వారికే సీట్లు ఇచ్చి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిండు. తన అధికారాన్ని పటిష్ట పరుచుకొని తన తదనంతరం తన వారసుడే అధికారంలో వచ్చే లక్ష్యంతో మొత్తం యాంత్రంగం సిద్దం చేసిండు.
ఇప్పుడిక రాష్ట్రంలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అని తలలు ఊపపటం తప్ప ప్రనజాప్రతినిధులు ఎవరు ఎదురు చెప్పె పరిస్థితి లేదు.
వాస్తవానికి టి.ఆర్.యస్. పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ సీటు వివేక్ కు ఇవ్వాల్సి ఉండే. వివేక్ రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రమిక వెత్తె కాకుండా అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రంలోను పలుమార్లు మంత్రి పదివి చేసిన సుదీర్ఘ రాజకాయ చరిత్ర కల్గిన వెంకటస్వామి కొడుకు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.యస్ పార్టీకి మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర వహించిండు. సోనియా గాంధీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు సాసు చేయించటంలో వెంకటస్వామి పాత్ర ఉంది. ఎమైతే నేమి తెలంగాణ వచ్చింది. అయితే అవసరానికి బొంత పురుగు నైనా ముద్దుపెట్టుకొనే టి.ఆర్.యస్ నాయకునికి అవసరం లేదనుకుంటే నిర్దక్షక్ష్మీ్యంగా కాలతో తన్నె స్వబావం కూడా ఉంద. అవిదంగా చంద్రశెఖర్‍రావుకు వివేక్ మధ్య విబేదాలు పొడుసూపినవి. అందుకు మరో కారణం కూడా ఉంది. కేసిఆర్ మొదటి సారి ఎన్నికలకు పోయినప్పుడు తల ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిండు. తాను తెలంగాణ రాష్ట్రనికి కావాలి కుక్కలా ఉంటాగాని ఏ పదవులు అశించనని పలు సందర్భాల్లో ప్రకటించిండు. అవిదంగా తెలంగాణలో టి.ఆర్.యస్ అధికారంలోకి వస్తె మొదటి ముఖ్యమంత్రివి నువ్వె నంటూ వివేక్‍కు ఆశ చూపి డబ్బు దస్కం కాజెసిండు. చివరికి ఎన్నికల ముందు సీట్లు పంచేకాడ వివిక్‍ను ముఖ్యమంత్రి పోటీదారుడుగా రాకుండా చేయ్యటానికి వివేక్‍కు పార్లమెంటు సీటు ఇచ్చిండు. అంతే తనను ముఖ్యమంత్రి కాకుండా చేయటానికి కపట నాటకం అడుతున్నాడని గ్రహించిన వివేక్ టి.ఆర్.యస్ పార్టీని వీడి మళ్ళి కాంగ్రెసు పార్టీలో చెరి అ పార్టీ తరుపున పెద్దపల్లి పార్లమెంటుకు పోటి చేసిండు. కాని అప్పటికి టి.ఆర్.యస్ గాలి ఉండటం వలన అపార్టీ అభ్యర్థి చెతలో ఓడిపోయిండు.
సామన్యులకైతే ఎవడు అధికారంలో ఉన్నా ఓరిగేది ఏముండదు కాని వ్యాపార వెత్తలకు పారిశ్రామిక వెత్తలకు అధికారం అండలేకుండా మనుగడ సాధించటం కష్టం అప్పటికి కెంద్రంలో రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెసు పార్టీ, ఒడిపోయి కెంద్రంలో జిజెపి ప్రభుత్వం రావటంతో రెంటికి చెడ్డ రేవడిలా అయింది వివేక్ రాజకీయ పరిస్థితి. దాంతో ఆయన చివరికి రాజీపడి పోయి అనివార్యంగా మళ్ళీ టి.ఆర్.యస్ పార్టీలోకి వచ్చిండు. అట్లా వచ్చిన వారికి ఎదో నామినేటడ్ పదవి అయితే కెసిఆర్ ఇచ్చిండు కాని వీడు ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని బావించిన కెసిఆర్‍అదను చూసి వివేక్‍ను చావు దెబ్బతీసిండు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు చివరినిముషం ముగిసే వరకు నాన్చి చివరినిమిషంలో వెంకటేశ్‍కు సీటు ఇచ్చిండు. వివేక్ ఇంకో పార్టీ తరుపున ముఖ్యంగా కాంగ్రెసు తరుపున పోటీ చెయటానికి వీలు లేకుండా చేసిండు. దాంతో వివేక్‍కు అటు టి.ఆర్.యస్ తరుపున కాని కాంగ్రెసు తరుపున కాని పోటికి నిలబడే పరిస్థితిలేకుండా పోయింది.
కాంగ్రెసు పార్టీ చివరి నిముషం వరకు వివేక్‍ను సీటు ఇవ్వటానికే ఎదురు చూసింది. కాని చంద్రశెఖర్‍రావు వారికి అటు వంటి అవకాశం ఇవ్వలేదు.
కాని చాల విచిత్రం ఏమిటంటే కాంగ్రెసు తరుపున ప్రస్థుతం పోటీ చేస్తున్న చంద్రశెఖర్‍రావు కూడా ఒకప్పుడు టి.ఆర్.యస్ పార్టీకి చెందినవాడు. అ పార్టీ తరుపున ఎమ్మెల్యెగా నెగ్గి రాజశెఖర్ రెడ్డి ప్రభుత్వంలో టి.ఆర్.యస్ పార్టీ తరుపున మంత్రిగా చేసినవాడు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి తన భవితవ్యాన్ని తెల్చుకోవటానికి బరిలోకి దిగిండు.
జిజెపి పార్టీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంనుండి నిన్న మొన్నటి నక్సలైట్ మూమెంటు వరకు అనేక పోరాటలు జరుగటం వలన ప్రజల్లో కమూనిస్టు బావజాలం ఎక్కువ. పలితంగా జిజెపి మతోన్మోద రాజకీయాలు తెలంగాణలో అంతగా ప్రబావం చూపలేక పోయింది. హైద్రాబాద్ పట్టణంలో మాత్రం ఎం.ఐ.ఎం. ప్రాబల్యం ఎక్కువ ముస్లీంమతో న్మోదాన్ని రెచ్చగోట్టి అక్కడ అ పార్టీకి ఒక పార్లమెంటు సీటు, అరేడు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు గెలుస్తుంటాయి. దానికి ప్రతిగా అ ప్రాంతంలో బిజెపి హిందు సమాజాన్ని రెచ్చ గొట్టె కొంత బలంసంపాదించి అక్కడి నుండే ఒక రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది తప్ప తెలంగాణ వ్యాపితంగా దాని ప్రాబల్యం తక్కువ కాని ఈ సారి కెంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వలన దాని అండ దండలతో బిజెపిపార్టీ తెలంగాణలో పాగా వేయాటానికి సిద్దమై చాలచోట్ల తను అభ్యుర్థులను నిలిపింది. అవిదంగా బిజెపి కూడా పెద్దపల్లి అసెంబ్లికితన అభ్యర్థిని నిలిపింది.
ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఇది వరలో అయితే రెపు ఎన్నికలనగా అంతో ఇంతో తాగబోయించి, పదో పర్కొ చేతుల్లో పెట్టి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఖర్చుబాగా పెరిగిపోయింది. చివరికి మీటింగ్‍లు పెట్టాలన్నా ర్యాలీలు తీయలన్నా జనాలకు బిర్యాని పొట్లాలు ఇచ్చి మందు పోసి మీదికేలి రోజు మూడు నాలుగు వందల చేతిలో పెడ్తెకాని జనం రావటంలేదు. ఇవ్వాళ ఈ మీటింగ్‍లకు పోయిన వాళ్ళె మరో రోజు మరో పార్టీ పిలిచే మీటింగ్ లకు పోతాండ్లు. ఇకతాగు బోతులకైతే ఎన్నికలు వచ్చిన వంటే పండుగే మరి.
కాంగ్రెసు నాయకుడు ఒక పర్యయం వచ్చి కాలనీలో ఇల్లిల్లు తిరిగి పోయిండు. టి.ఆర్.యస్ నాయకుడు వెంకటేశం మాత్రం కాలనీకైతే రాలేదు. కాని ఆయన అనుచరుడు సత్యనారయణను పంపించి గోదవరిఖనిలో తమనాయకులతో జరిగే బారి బహిరంగ సభకు మనిషికి ఐదువందలు ఇచ్చి మరి తీసుకపోయిండ్లు.
రామయ్య కాలనీలో కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు. ఒకటితెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ల దైతే రెండోది కాంగ్రెసు వాళ్ళది. ఈ రెండు పార్టీలు కాకుండా బిజెపికి చెదిన అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నడుకాని అతనికి అంతగా అర్థిక స్థోమత లేదు. ఎదో ఒకటి రెండు సార్లు జీపుల్లో వచ్చి ఒక రౌండు కాలనీలో తిరిగి పోయిండ్లు. అది కూడా కంట్రాక్టరు రంగయ్య బలవంతం మీద.
కాలనీలో కాంగ్రెసు పార్టీకి చిన్న చితుక కంట్రాక్టులు చేసే జానకిరాం నాయకత్వం వహిస్తే టి.ఆర్.యస్ పార్టీకి సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు.
గంగమ్మకల్లు బట్టీ కాడ సాయంత్రమే కాదు. పొద్దంత కూలీలు ముగుతున్నారు.
‘‘మీరేమి రంది పడకుండ్లే కడుపు నిండా తాగుండ్లే బిల్లు సంగతి నేను చూసుకుంటా’’ అంటూ జానికిరాం బరోసా ఇచ్చిపోయిండు.
సాయంత్రం అయితే కనుకమల్లు ఇంటికాడ చీప్ లిక్కర్ పంచుతాండ్లు. అవిషయం తెలిసి రాంలాల్ వచ్చి నాగయ్యను కనకమల్లు ఇంటికి తీసుక పోయిండ్లు. అక్కడ రాజీరు కనిపించి ‘‘కొడుకు టి.ఆర్.యస్ తండ్రి కాంగ్రెసు’’ అన్నాడు వ్యంగంగా....
అమాటకు నాగయ్యకు మనసుకు బాదేసింది సత్తెన్న గులాబి జెండా పట్టుకొని తిరుగుతాండు. నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సత్యనారాయణ సత్తెయ్యను వెంటేసుకొని తిరుగుతండు. ‘రామయ్య కాలనీ బాధ్యతంత నువ్వె చూడాలి’ అంటూ సత్యనారాయణ సత్తెయ్య మీద బారం పెట్టిండు.
అప్పటి నుండి సత్తెయ్య క్షణం రికామి లేకుండా తిరుగుతాండు. అవసరం కొద్ది ఎమ్మెల్యే రాసుక పుసుక తిర్గెసరికి సత్తయ్య ఉబ్బితబ్బిబ్బు అయి ఎన్నికలు తప్ప వేరే లోకం లేకుండా పోయింది.
రాజీరు మాటలకు చిన్నబోయిన నాగయ్యను చూసి రాంలాల్ ‘‘వాడుత్తతాగుబోతు... వాని ఇంట్లకేలి ఎమన్నా ఇస్తాడా.. మంచి మంచోళ్లె ఇయ్యల ఈ పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటాండ్లు. రాజీరు మాటలేమి పట్టించుకోకు అన్నాడు.
అయిన నాగయ్య మనసు ఓప్పక కనకమల్లు ఇంట్ల అడుగుపెట్టక అటునుంచి అటే తిరిగి వచ్చిండు. అది చూసి కనకమల్లు ఎన్నికల సమయంలో ఇటువంటివ ఏం పట్టించుకోవద్దు అంటూ రాజీరు మీద కోపం చేసిండు.
తెంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో మొదటి నుండి పని చేసిన కవారిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారిన వాన్ని పిలిచి టికట్ ఇచ్చుడేందీ అంటూ మొదటి నుండి జెండా మోసిన వాళ్ళు కొందరు అలిగి పార్టీ విడిచిపోయిండ్లు. మరికొందరిని బురదగించి నామినేట్‍డ్ పదువులు వస్తయని ఆశ చూపి కొందరిని డబ్బులిచ్చి కొందరిని అధికార పార్టీ కాపాడుకొన్నాది.
ఓట్ల కోసం నాయకులు కులాల పేరు మీద ప్రాంతాల పేరుమీద జనాలను చీల్చిండ్లు. జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి ‘‘ఇదిగోమనమంత ఒక్కటిగా ఉండాలి. లోకలోల్ల మాటలు విని మనం బొర్లా పడవద్దు. కాంగ్రెసుపార్టీ అంటే ఎనకటి నుంచి ఉన్న పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్థాపించిన పార్టీ కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చె ప్రాంతీయ పార్టీలు ఇవ్వాల ఉంటాయి రేపు మట్టికలుస్తయి వాటిని నమ్ముకుంటే లాభం లేదు. నేను చంద్రశేఖర్ సారుతోని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఆయన చేసే మొదటి పని ఏటంటే మన అందరికి రేషన్ కార్డులు ఇప్పిసతనన్నడు. మన ఓరియా వాళ్ళకు తాగేందుకు మంచి నీళ్ల పంపులు వేయిస్తనన్నడు.
‘‘అంటూ చెప్పుకొచ్చిండు.
జనాలకు ఆ మాటలు సమజ్ కాలే ఇయ్యాల ఎన్నికలు వచ్చినయిని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవటానికి ఇటు ఓరియా వాళ్ళమని అటు ఆంద్రోళ్లని ఎదో ఎదో చెప్పుతున్నరు కాని వాళ్ల జీవితంలోవాళ్ళె ప్పుడు అ తెడాలు పాటించనే లేదు. కూలి చేసేకాడ అందరు సమానమే. ప్రాంతలు వేరైనా వారందరి బాధలు ఒక్క తీరుగానే ఉన్నాయి. ఒకరి కష్ట సుఖల్లో మరోకురు పాలుపంచుకున్నారు. అక్క తమ్ముడు అంటూ వరసలు పెట్టి పిలుచుకున్నారు. అంతెందుకు నెల రోజుల క్రింద లారీమీది క్లినర్ పనలు చేసే చన్నులాల్ చనిపోతే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు కలిసి మనిషింత చందాలు వేసుకొని చావు చెసిండ్లు.
చన్నులాల్‍కు ఎనక ముందు ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో ఓరిస్సాలోని మారు మూల గ్రామం ఒక్కడే పని వెతుక్కుంటు వచ్చిండు. అందరితో కలవిడిగా ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు. ఎమైందో ఎమో వానికి టి.బి. వచ్చింది. చీకేసిన బొక్కలా బొక్కలు తేరి, తిండికి లేక ఎండి పోయి ఎండిపోయి సచ్చిండు.
జానకిరాం కూడా ఒకప్పుడు అందరిలాగే పొట్ట చేతపట్టుకొని బ్రతక వచ్చిండు. కాని కాస్త హుషారు తనం ఎక్కువ. అట్ల ఇట్ల చేసి కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీ పనిచేస్తూ క్రమంగా సబ్ కంట్రాక్టులు పట్టి నాల్గు పైసలు సంపాదించిండు. ఎవరిని లెక్క చేసేటోడుకాదు. అటువంటి వాడు ఎన్నికల వచ్చే సరికి మెత్తమెత్తగా మాట్లాడుతాండు. లేని ప్రేమ వొలక పోస్తాండు.
‘‘ముందుగాల పంపులు వేయించుండ్లీ, నీళ్ళు దొరకక హరిగోస పడ్తానం’’ అంటూ బసంత్ నాగ్ భార్య సుభనా అడ్డుతగిలింది.
జానకిరాం సుభన కేసి చూసి ‘‘ఎన్నికల్లోగెలిచినంక చేయించే మొదటి పని అదే’’ అన్నాడు మరోసారి.
‘‘ఆఎన్నికలైనంకమా మొఖం ఎవలు చూస్తరు’’ అంటూ హరిరాం అడ్డుపడ్డడు.
‘‘ఎన్ని ఏన్నికలు చూడలేదు ఎన్నికలప్పుడు గిట్లనే చెప్తరు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్లు. రెషన్ కార్డులు ఇప్పిస్తమన్నారు. పంపులు వేయిస్తమన్నారు. ఓట్లు వేయించుకొని గెలిచి ఇటు మొఖంరాలే’’ అంటూ మరోకరుగుణిగిండు.
జానకిరాంకు మనసులోకోపం కల్గింది కాని బయట పడలేదు. మొఖం మీద శాంతాన్ని తెచ్చుకొని’’ టి.ఆర్.యస్ వాళ్ళ పనే అంత. ఎన్నికలప్పుడు మాట చెప్తరు. గెలిచినంక ఇటుదిక్కు అయినా రారు. కాని మన సారు అట్లా కాదు. మాటిస్తె చేసేదాక నిదురపోడు’’ అన్నాడు బరోసాగా...
‘‘ఆ అందరుగంతే’’ అన్నాడు మరోకరు.
పరిస్థితి చెయ్యిదాటెట్టుందని జానకి రాంకు అర్థమైంది. ఇంకా ఎక్కువసేపు మీటింగ్ పొడిగిస్తె ప్రమాదమని బావించిండు.
‘‘ఇదిగో నామాట నమ్ముండ్లీ. మనమంతా ఒక్కకటే ఈ సారి మాట తప్పెదుంటే మళ్ళీ మీకు నా మొఖం చూయించ’’ అన్నాడు.
మీటింగ్ ముగించి జానకిరాం సోన్‍లాల్, ప్రసాత్, రాంజీని, గోపాల్, బాసంతనాగ్‍ను వెంట బెట్టుకొని వెళ్ళిపోతుంటే సుభాన పెద్ద గా గొంతు చేసుకొని ‘‘ఇంట్ల తిండికేం లేదు. తాగితందానలాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదన్నా ఉంటే మాకే ఇచ్చిపోండ్లి’’అంది.
జానకిరాం చిన్నగానవి ‘‘ఇప్పుడదేంలేదు’’ అంటూ వాళ్ళను తోలుకొని పోయిండు.
రామయ్య కాలనీలో జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి మాట్లాడిన సంగతి తెలిసి సుబ్బారావు అగమెఘాల మీద తెలుగోళ్ళ గుడిసెలను చుట్టెసి బెంగాలివాళ్ళ గుడిసెల కేసి నడిచిండు.
‘‘బెంగాలి వాళ్ళయి ఎన్ని ఓట్లుంటయి’’ అని సత్తయ్యను అడిగిండు.
‘‘ఎంతలేదన్నా యాబై అరువై ఉంటయి’’ అన్నాడు సత్తయ్య వినయంగా...
ఒక్క ఓటు కూడా జారిపోవద్దు.. అందర్ని కలువాలి ఎట్లయితే వింటరో అట్లా విన్పించాలి. డబ్బుల గురించి అలోచించవద్దు... ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓట్లు మనకు పడాలి’’అన్నాడు సుబ్బరావు.
సమస్యేలేదు సార్... ఒక్క ఓటు కూడా అపోజిషన్‍కు పోదు... అందరు మనోళ్ళె’’అన్నాడు సత్తయ్య...
‘‘అట్లాఅనుకోవద్దు...వోవర్ కాన్పిడేన్స్కు పోతే అసలుకే మోసం వస్తది’’ అన్నాడు సుబ్బారావు బొమ్మలు ఎగరేసి.
సుబ్బారావు తన అనుచరులతో కలిసి బెంగాలి వాళ్ళ గుడిసెలకేసి నడిచిండు.
తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్‍గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వచ్చిన వారికి ఉపాధి కల్పించటంకోసం దేశంలోని వివిద ప్రాంతలకు పంపించిండ్లు. అట్లా కొంత మంది రామగుండుం వచ్చిండ్లు. ఎన్టిపిసి పనులు సాగినప్పుడు అందులో చాల మంది పని చేసిండ్లు. కాని నిర్మాణపు పనులు పూర్తయిన తరువాత పనులు లేక చాలమంది వేరే ప్రాంతాలకు వలసపోయిండ్లు. చాల కొద్ది మంది మాత్రం మిగిలిండ్లు.
బెంగాలికార్మికులు ఉండే గుడిసెలు మిగితా కార్మికులు ఉండే గుడిసెల కంటే కాస్త బిన్నంగా ఉంటాయి. ఉన్నంతలో గుడిసేలను బందోబస్తుగా కట్టుకుంటరు. శుచి శుభ్రత పాటిస్తరు.
సుబ్బారావు తన అనుచరులతో అక్కడికి చేరుకునే సరికి టి.కే సర్కార్ ఇంటి మీద కాంగ్రెసు జెండా ఎగురుతు కన్పించింది. సత్తయ్య కేసి ఇదెంటన్నట్టుగా చూసిండు.
‘‘వాడుత్త తలతిక్కవాడు. ఊరంత ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టుగా ఉంటాడు. వానితో అయ్యదిమి లేదు. మిగిత వాళ్ళంత మనతోనే’’ అన్నాడు సత్తయ్య...
సుబ్బయ్య ప్రచారానికి వసున్న సంగతి సత్తయ్య ముందే బెంగాలి కుటుంబాలను కలిసి చెప్పి పెట్టి ఉంచిండు. కొంత మంద పనులు కూడా మానుకొని ఉండిపోయిండ్లు. వీళ్ళు అక్కడికి పోయే సరికి బినయ్ మండల్, డూకిరాం, విమల్‍పాండే ఎదురోచ్చి రెండు చేతులు జోడించిండు. సుబ్బారావు ప్రతిగా చిర్నవ్వులు చిందిస్తూ’’ ఏంటీ సంగతి ఎట్లా ఉంది’’ అని అడిగిండు.
‘‘అంత ఓకే సార్’’ అంటూ బినయ్ మండల్ బదులిచ్చిండు. సుబ్బారావు సర్కార్ ఇంటికేసి చూస్తూ’’ కాంగ్రెసు వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది’’ అంటూ తనుమానంగా చూసిండు.
‘‘అది కాదు సార్ టికే సర్కార్ జానకిరాం మనిషి ఆయన్ని పట్టుకొనే క్యాజువల్ వర్కర్ అయ్యిండు’’ మిగితా వాళ్ళంతా మనం ఎంత చెప్పితే అంతా’’ అన్నాడు మిమల్‍పాండే...
‘‘ఎమో’’ అంటూ సుబ్బారావు దీర్ఘం తీసిండు.
‘‘అదేం లేదు సారు మా మాటలు నమ్మండి’’ అన్నాడు బినయ్‍మండల్...
గుడిసెల మధ్య కాస్త కాళీస్థలంఉన్న చోట పెరిగిన వేపచెట్టు నీడన మూడు కుర్చిలు వేసి ఉన్నాయి. అందరు అటుకేసి నడిచిండ్లు. సబ్బారావు, సత్తయ్య మరోకరు కుర్చిలో కూచోగా మిగిత వాళ్ళంత వాళ్ళ చుట్టు నిలబడ్డారు.
మీటింగ్ అనే సరికి అడోళ్ళు మొగోళ్ళు పిల్లలు వచ్చిండ్లు. అరువై ఎండ్ల పైబడిన సరస్వతి మండల్ కూడా వచ్చింది. ఆమెకు కండ్లు సరిగా కనిపిస్తలేవు. ఎవరో పెద్ద లీడర్లు వస్తరంటే అగం అగం వచ్చింది. ఆమె కొడుకు ‘కోశన్’ మండల్‍ను కంట్రాక్టరు పనిలో నుండి తీసేసిన తరువాత ఇంట్లో వెళ్లటం కష్టమైతంది. పెద్ద లీడర్లు వస్తాండ్లు అంటే వాళ్ళను బ్రతిమిలాడి ఎట్లనో అట్లనో కొడుకును తిర్గి పనిలో పెట్టించాలనే యావతో వచ్చింది.
సుబ్బారావు కాసేపు అది ఇది మాట్లాడన తరువాత మెల్లగా అసలు విషయం ఎత్తిండు ‘‘మీకు అందరికి ఎన్నికలు జర్గుతున్న సంగతి తెలుసు. మన టి.ఆర్.యస్‍పార్టీ తరుపున వెంకటేశ్ అన్ననను పార్టీ నిలబెట్టింది. మనమంత కలిసి ఆయన్ని గెలిపించాలి మీకేమన్నా సమస్యలుంటే అవి పరిష్కరిస్తాం. ప్రభుత్వం మనది మనం ఎదీ అనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’’ అంటూ క్షణమాగి అందరికేసి చూసి మళ్ళీ మాట్లాడ సాగిండు.
‘‘మీ సమస్య ఎందో నాకు తెలియందాకాదు. డ్యాంకట్టినప్పటి నుండి మీరు చేపలు పట్టుకొని బ్రతుకుతాండ్లు. మధ్యలో సొసైటీలు పుట్టుకొచ్చి మిముల్ని బయటికి నెట్టెసిండ్లు. దాంతో చాల మందికి బ్రతుకు తురువు పోయింది’’ అన్నాడు.
‘‘నిజమే’’ అన్నట్టు చాల మంది తలలు అడించిండ్లు.
‘‘అందుకేనేనేమంటానంటే సొసైటీ వాళ్ళు బ్రతకాలి, మీరు బ్రతకాలి అందరు బ్రతికే ఉపాయం అలోచించాలి. అందుకే ఎన్నికలు అయిన తరువాత వెంకటేశన్నా మీరు కూడా డ్యాంలో చేపలు పట్టుకునే ఎర్పాటుల చేయిస్తనన్నడు. వెంకటేశన్న గురించి మీకు తెలియదు అల్తు పాల్తు ముచ్చట్లు చెప్పెటోడు కాదు. ఎదాన్నా చేస్తనంటే అరునూరైనా చేస్తడు అటువంటి మనిషి’’ అంటూ చెప్పుకొచ్చిండు.
‘‘మీరా పనిచేస్తే మేమంత రుణపడి ఉంటాం’’ అంటూ బినయ్ మండల్ రెండు చెతులు జోడించిండు.
‘‘ఆ విషయం మాకు వదిలేసి మీరు నిర్రందిగా ఉండండ్లీ’’ అంటూ సుబ్బారావు వెంట వచ్చిన మరో లీడర్ కేశవులు బరోసా ఇచ్చిండు’’
జనం సంతృప్తిగా చూసిండ్లు.
సరస్వతి మండల్‍కు ఈ మాటలేమి తలకు ఎక్కటంలేదు. తన కొడుకు సంగతెందో తెలుసుకోవాలని వచ్చింది. మనసులో తొలుస్తున్న అవెదన మాటల రూపం సంతరించుకోగా....
అయ్యా మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంటలేడు’’ మీరు చెప్పివాన్ని పనిలో పెట్టియ్యాలి అంది.
‘‘దానికి వీళ్ళెమి చేస్తరే’’ విమల్ పాండే ముసల్దాని మాటకు అడ్డుపోయిండు.
‘‘మరెందుకు వచ్చిండ్లు’’
‘‘ఓట్లు వెయ్యాలి ఓట్లు’’ఎవరో అన్నరు.
‘‘ఓట్టు వేస్తే ఏమొస్తది. ఎన్నిసార్లు వెయ్యాలట’’ అంటూ మసక బారిన కండ్లతోని పరిక్షగా చూసింది.
గా ముసల్దాని మాటలు పట్టించకోకండ్లీ సారు ఎడ్డ ముసల్ది భర్త చనిపోయిండు. కొడుకుకు పనిలేక తిరుగుతాండు’’ అన్నాడు గోపాల్.
సుబ్బారావు తెలిగ్గా నవ్వి ‘‘ఎర్కె ఎర్కె’’అంటూ ముసల్దానిమాటలు పట్టించుకోకుండా బినయ్‍మండల్‍తో మాటల్లోకి దిగిండు.
‘‘అయ్యా ఏం చెప్పకపోతిరి’’ ముసల్ది మళ్ళి అడిగింది.
‘‘అరేయ్ ముసల్దాన్ని ఇక్కడి నుంచి తీస్కపొండ్లిరా’’ ఎవరో కసిరిండు.
ఓ ఇద్దరు ముందుకు వచ్చి అవ్వ సార్ నీ కొడుకును పనిలో పెట్టిస్తరు... పదపద అంటూ రెండు రెక్కలు పట్టుకొని దాదాపు బలవంతంగా ప్రక్కకు తీస్క పోయిండ్లు.
అ ముసల్ది గింజుకుంటూ ‘‘పనులు లేకుంటే మనష్యులు ఎట్లా బతుకతరు. తిండిలేక కడుపులు మాడ్చుకొని చస్తానం’’ అంటూ గింజుకుంటుంది.
కాసేపు మాట్లాడిన తరువాత ‘‘మీకే మన్నా అవసరం ఉంటే సత్తన్న చూస్తడు... ఎవరు మోహమాట పడవద్దు...కాని ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’’ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు పోవటానికి లేచిండు. బినయ్ మండల్ చాయ్‍తాగి పోవాలని బలవంతంచేసిండు. కాని ఇంకా క్రషర్ నగర్ కాకాతియ నగర్ తిరుగాల్సి ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ ఇంటి కాడ తీరుబడిగా చాయ్ తాగుతా’’ అంటూ సుబ్బారావు లేచిండు.
రోడ్డుకు ఒక వైపు ఎన్టిపిసి దేదీప్యమానంగా ఉంటే రోడ్డుకు అవలవైపున దుకాణాలు, వర్క్షాపులున్నాయి. వాటిని అనుకొని గుట్ట బోరుమీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే పులి పాకల్లోనే ఎంత లేదన్నా రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.
ఎన్నికలప్పుడు తప్ప నాయకులు వాళ్ళ గుడిసెలకు రావటం జరుగదు. ఎండ్లు గడుస్తున్న వాళ్ల బ్రతుకుల్లో మార్పెమి రాలేదు.
వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఒక విదమైన కపం వాసన గప్పుమంది. అయినా అదేమి పట్టించుకోకుండా ముందుకు సాగిండ్లు. భగవాన్ మెస్త్రీకి వాళ్ళ కంట్రాక్టరు దివాకర్‍రావు అరోజు అక్కడ మీటింగ్ ఉండే సంగతి ముందే చెప్పి పెట్టడం వలన, ఆయన జనాలను కుప్పెసి నాయకులకోసం ఎదురుచూస్తుండి పోయిండు.
సుబ్బారావు రావటం చూసి భగవాన్ మెస్త్రీ ఎదురొచ్చి ఆయన్ని తొడ్కొని పోయి ఒక్క రాల చెట్టు కాడికి తీసుక పోయిండు. అప్పటికే అక్కడ పోగేసిన జనం పులుకుపుకున చూస్తున్నారు.ఒంటిమీద సరిగా బట్టలు లేని పిల్లలు రంగురంగుల జెండాలను జనాలను చూసి హడావిడి చేస్తున్నారు.
భగవన్ మేస్త్రీ సుబ్బారువు కేసి అబ్బురంగ చూసి ‘‘వీళ్ళంత మనోళ్ళె సారు...’’ అన్నాడు.
సుబ్బారువు చిన్నగా చిర్నవు నవ్వ తలాడించిండు. ‘‘తీళ్ళంతా దివాకర్‍రావుదగ్గర పని చేసేవాళ్ళే కదా’’ అన్నాడు.
‘‘చాల మంది వాళ్ళే సార్ కొద్ది మంచి మాత్రం అక్కడిక్కడ కూలిపనులు చేసేవాళ్ళు ఉన్నారు. కానిమెజార్టీ మనవాళ్ళే’’అన్నాడు భగవాన్‍మేస్త్రీ...
అప్పటికి మధ్యహ్నం దాటి పోయింది. కడుపులో అకలిగా ఉన్నా, మళ్ళి ఇక్కడి దాక రావటం ఎందుకని సుబ్బారావు ఒక్కడి దాక వచ్చిండు. దాంతో ఆయన వీలయినంత తొందరలో మీటింగ్ ముగించాలనే అలోచనలో ఉండిపోయి, ఎక్కువ అలస్యం చేకుండా, అక్కడ గుమి కూడిన జనాలను ఉద్దెశించి మాట్లాడటం మొదలు పెట్టిండు. తాము ఎన్నికల్లో గెలిస్తె ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తియ్యతియ్యని మాటలు చెప్పసాగిండు.
దస్త్రు భార్య శ్రావణబాయ్ అతని మాటలకు అడ్డుపోయి ‘‘పోయిన సారి ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు బోరింగ్‍లు వెయించిండ్లు. కాని అందులో చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చె తోవల ఎన్టిపిసి మురికి నీళ్ళ కాలువ ప్రక్కన మేము తవ్వుకున్న బాయి నీళ్ళె తాగుతనం. ఎండ కాలం వస్తై అయిత నీళ్ళు కూడా దొరకతలేవు. గదాని సంగతెందో చూడాలి’’ అంది పెద్ద గొంతుక చేసుకొనని...
టీకురాం భార్య పుష్ప కల్పించుకొని ‘‘వర్షకాలంలో కూడా నీళ్లకు కరువువొస్తాంది. బాయిలకు మురికినీరు చేరి తాగవశం అయితలేదు’’ అంది. ‘‘రేషన్‍బియ్యం వస్తలేవు’’ అన్నారు మరోకరు.
సుబ్బారావు ఒపిగ్గా విన్నడు. ‘‘మీకు ఏఏ సమస్యలు ఉన్యాయో అవన్ని మన భగవాలన్ మేస్త్రీకి చెప్పండి. ఈ సారి మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం’’ అన్నాడు. భాగవన్ మేస్త్రీ కేసి తిరిగి ‘‘వీళ్ళ సమస్యలన్ని రాసుకొని వచ్చి అఫీసుకాడికి రా, ఎన్నికలు అయిన తరువాత చేసే మొదటి పని అదే’’ అన్నాడు.
భగవాన్ చెమట కంపుతో నిండిన అపరిసారల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలేకు పోయిండ్లు. బలవంతుపు పేరంటం ఎదో ముగించుకున్నట్టుగా, ఎంత హడావిడిగా నైతే వచ్చిండ్లో అంతే హడావిడిగా ఎల్లిపోయిండ్లు.
పోతు పోతు భగవాన్ మేస్త్రీని ప్రక్కకు పిలిచిన సుబ్బారావు ‘‘సాయంత్రం వీళ్ళ ఎర్పాట్లు ఎవో నువ్వె చూడాలి. ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’ అన్నాడు గుమ్మనంగా...
రాజీరు మాటలు అవమానం అన్పించి కోపంతో నాగయ్య ఇంటికైతే వచ్చిండు కాని మనసు లో మాత్రం తాగాలనే కొరిక అలాగే ఉండిపోయింది.
కాలనీలో చినన్న ప్దె అనకుండా తాగి ఊగుతాండ్లు. కాలనీలో రెండు గ్రూపులుగా చీలి పోయిండ్లు. ఒకటి టి.ఆర్.యస్ పార్టీ అయితే మరోకటి కాంగ్రెసు వాళ్ళది. ఎవరు ఖర్చుకు వెనుకాడటంలేదు. గంగమ్మ కల్లు దుకాణం కాడ జాతర సాగుతుంది. ఇక మీటింగ్‍లప్పుడు, ఎదైనా జూల్సు తీసినప్పుడైతే పండుగైతాంది. బిర్యాని పొట్లాలు, చీప్ లిక్కర్ పవ్వలకు ఎక్కలేదు. అకలికి మొఖం వాచిపోయి ఉన్న వాళ్ళు తినేకాడికి తిని బిర్యాని పొట్లాలను చాటు మాటుగా ఇంటికి తీస్కపోతాండ్లు. ఇదంతా సుబ్బారావు కనిపెట్టక పోలేదు... లేకి ముండా కొడుకులు... ఎన్ని రోజులు తింటరో తననియ్.. అనుకొన్నాడు. పై నాయకులెమో పైసల గురించి లెక్క చేయకుండ్లి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఓట్లు మాత్రం మనకు పడాలి’’అంటున్నారు.
టి.ఆర్.యస్ పార్టీ వాళ్ళ దాటికి కాంగ్రెసు వాళ్ళు తట్టుకోవటం కష్టమైతంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి శెఖర్‍రావుకు టిక్కట్ అయితే ఇచ్చిందికాని పార్టీ పంపించిన డబ్బులు ఏమూలకు సరిపోతలేవు. తన చేతి చమురు కొంత ఖర్చు పెట్టిండు కాని అపోజిషన్ వారితో సరితూగటం లేదు.
టి.ఆర్.యస్ పార్టీ అధికారంలో ఉంది. దాని అధినాయకునికి ఎన్నికల్లో ఎట్ల గెలువాలో, •నాన్ని ఎట్లా బురిడి కొట్టించాలో తెలిసినంత విధ్య మరోకరకి తెలియదు. దానికి తోడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిండు. ఎట్లాగైనా చేసి ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉండిడబ్బుకు ఎనక ముందు చూడటం లేదు.
నాగయ్య ఇంట్లా నుండి బయిటికి వచ్చె సరికి గులాబి రంగు జెండాలు పట్టుకొని చిన్న పిల్లలు జైతెలంగాణ అంటూ బిగ్గరగా అరుచుకుంటూ ఊరేగుతాండ్లు. తన ముందు నుండే పోతున్న పిల్లల్లో ఎనిమిదెండ్ల దస్త్రు కొడుకు వినయ్‍ను ఆపిన నాగయ్య ఉత్సుకత కొద్ది ‘‘జెండాలు ఎక్కడియిరా’’ అని అడిగిండు.
‘‘సత్తెన్న ఇచ్చిండు’’ పైసలు కూడా ఇచ్చిండు అన్నాడు పిల్లవాడు ఉత్సాహంగా...
కొడుకు పేరు చెప్పె సరికి నాగయ్య మనసులో బాదేసింది. ఎన్నికల్లో వాడు కాలనీలో అన్ని తనై వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన ‘‘ఊరంత పైసలు పంచుతాండు. పవ్వలుపంచుతాండు కాని అయ్య అని ఒక పవ్వ అయినా ఇయ్యక పాయే’’ అంటూ తనలో తనే గుణుక్కున్నడు.
పిల్లలు అరుచుకుంటూ అతన్ని దాటేసి పోయిండ్లు. విసురుగా ఇంట్లోకి వచ్చిన నాగయ్యకు భార్య ఎదురు పడింది. దాంతో కొడుకు మీద కోపం భర్య మీద తీల్చిండు.
‘‘ఊరంత పవ్వలు పంచుతాండు... ఇంట్లా అయ్య ఉన్నడన్న జాషే లేకపాయే’’ అన్నాడు విసురుగా...
శాంతమ్మ ఒకసారి భర్తకేసి తేరపారచూసి ‘‘ ఆ పాపపు సోమ్ము తాగకుంటెంది ఇయ్యల తాగిపిస్తరు తినిపిస్తరు.. తరువాత మొఖం చాయించరు, జనం ఇంట్ల పాడుగాను ఎర్రి లేసిన కుక్కల తీర్గ పుణ్యానికి వచ్చిదంటే పీకలదాక తాగుతండ్లు. అంటూ గయ్యిమంది.
భార్య కోపం చూసి నాగయ్య వెనక్కి తగ్గి ‘‘అదికాదే... అంటూ ఎదో చెప్పబోయిండు.
‘‘వాడెమో పని బందు పెట్టి పిచ్చోని తీర్గ ఎన్నికలంటూ తిరగబట్టె, ఇంటికాడ కోడులు ఒక్కతే కూలిపనులు చేసుకుంటూ కుటుంబం ఎల్ల దీయబట్టె. ఎన్నికల్లో తిరుగతే ఎమోస్తదట.... ఇయ్యల అవసరం కొద్ది సత్తెన్నా అని బుదగరించే సరికి వీడు ఎక్కడ అగుతలేడు. నాకు వాడు ఎరుకే వీడు ఎరుకే అంటూ విర్ర వీగుతాండు. నాకు రేపు ఎన్నికలు అయిపోని ఎవ్వడన్నా లీడర్ వీని మొఖం చూస్తడా? అసంగతి వానికి అర్థం అయితలేదు... చేసుకుంటే బ్రతికటోళ్ళం.... ఎవని బుద్ది వాని కుండాలే’’ అంటూ కొడుకు మీద కోపం చేసిండు.
నాగయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి పోతుంటే రాంలాల్ కేకేసి నాగన్న ఎం చేస్తానవు. ఇందక పోదం రావే’’ అని పిలిచిండు.
నిన్న జరిగిన అవమానం గుర్తుకు విచ్చి నాగయ్య ‘‘మళ్ళి ఎక్కడికి’’ అని అడిగిండు.
‘‘సత్తెన్న గోపాల్ ఇంటికాడ పవ్వలు పంచుతండట... పోదాం రావే’’ అన్నాడు నోరు తెరిచి....
సత్తెన్న పేరు చెప్పెసరికి నాగయ్య కోపం కాస్త నీరుగారి పోయింది. చడి సప్పుడు చేయకుంటా రాంలాల్ వెంటనడిచిండు.
‘‘పోండ్లీ పోండడ్లీ మంది ఉచ్చ తాగటానికి... వీళ్ళకు ఎట్లా బుద్దివస్తదో’’ అంటూ వెనుక నుండి శాంతమ్మ అరుస్తున్న లెక్క చెయ్యకుండా నాగయ్య ముందుకు పోయిండు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రచారవేడి మరింత పెరిగింది. సత్తయ్య ఒక వైపు జానికిరాం మరో వైపు పోటిపడి రామయ్య కాలనీలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం చెయ్యల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాండ్లు.
గంగమ్మ కల్లు మొద్దు కాడ రెండు పార్టీలకు చెందిన వారి మధ్య మాటామాట పెరిగింది.
‘‘అరెయ్ తెలంగాణలో బ్రతికుతు తెలంగాణకే ద్రోహం చేస్తారారా’’ అటూ పుటగాతాగిన రాజం ఓరియా కార్మికుడు మాలిక్ బిహరీతో గర్షణ పడ్డడు.
మాలిక్ బీహరీ ఏ మాత్రం తగ్గలేదు. లప్పటికే రెండు పవ్వలు లాగించిండు. మళ్ళీ మందిని తోలుకొని కల్లు బట్టకాడికి వచ్చిండు. అది ఇది పడే సరికి మనిషకి భూమీద కాలు అగుతలేదు.
‘‘తెంలంగాణ మీ అయ్య సొత్తారా.. మా సొనియమ్మ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా’’ అంటూ ఎదురు తిరిగిండు.
మాటమాట పెరిగి చివరికి తన్నులాటకు దారి తీసింది. విషయం తెలిసి సత్తెయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు.
‘‘ఎక్కడి నుంచి బ్రతక వచ్చిన వాల్లకే ఇంతుంటే మనకు ఎంతుండాలి’’ అంటూ ఇంతేత్తు లేచిండు.
‘‘ఇదే అదును అనుకున్న సుబ్బారావు’’ వాళ్ళ కింత డిమండి రావాటానికి కారణం ఆ జానకి రాంగాడు. వాని అసర చూసుకొనే వీళ్ళు ఎగురుతాండ్లు... ముందు వాని సంగతి చూడాలి’’ అంటూ సన్నగా ఎగదోసిండు.
‘‘నిజమే ముందు వాని సంగతి చూడాలి’’ అన్నాడు సుబ్బారావు అనుచరు శివరాం...
జానికిరాం మొదటి నుండి కాలనీలో ఉన్న వ్యక్తి. దాంతో పరిచయాలు ఎక్కువ. ఒక్క పికే రామయ్య కాలనీలోనే కాదు. క్రషర్ నగర్‍లోని ఓరియా కార్మికులను కూడా సెంటిమెంటు రేకేత్తించి ఒకటి చేసిండు. దానిక తోడు తనకున్న పాత పరిచయాలతో చాపక్రింద నీరులాగా ప్రచారం సాగించిండు. టి.ఆర్.యస్ పార్టీ వాళ్ళకు కాలనీలో అంత బలమైన నాయకత్వం లేదు. అ పార్టీ తరుపున సత్తయ్య ఉన్నడు కాని, అతను యువుకుడు జానకిరాం లాగా కూలీలతో మొదటి నుండి సంబందం ఉన్న వ్యక్తి కాదు.
నిన్న మొన్నటి వరకు సత్తయ్య తన పనెందో తాను అన్నట్టుగా బ్రతుకుతు వచ్చిండు. అటు వంటి సత్యయ్యను సుబ్బారావు దగ్గరికి తీసి జుజాల మీద చేతులేసి నీ అంతటోడు లేడు అనే సరికి ఉబ్బి పోయిండు. పనికి ఎగనామం పెట్టి రాత్రింబావాళ్లు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిండు. అపోజిషన్ పార్టీని దెబ్బతీయాలంటే జానకిరాంను అడ్డు తొలగించాలని బావించిండు సుబ్బారావు. మనసులో ఆ అలోచన పెట్టుకొని మెల్లగా సత్తయ్యను ఎగదోసిండు.
సత్తయ్య ఉబ్బిపోయి ‘‘వాని సంగతి నాకు వదిలెయ్యండి’’ అంటూ అవేశ పడ్డడు.
‘‘వాడెక్కడి నుంచో వచ్చి మనదగ్గర పెత్తనం చేస్తానంటే ఎట్లా కుదురుద్దీ... మనం ఎంత చెప్పితే అంత....వాని గంతి చూడాల్సిందే’’ అంటూ సుబ్బారావు మరింత రెచ్చగొట్టిండు.
సత్తయ్య రెచ్చిపోయి, రాజయ్య, దశరథం చిట్టపల్లి చంద్రయ్య, మరికొంత మందిని వేంటేసుకొని జానికిరాం మీద దాడికి పోయిండు. అందరికందరు పుటగా తాగి ఉన్నారు. ఎవరు చక్కగా నిలబడే పరిస్థితి లేకుండా ఉంది.
వీళ్ళు పోయే సరికి జానకిరాం ఓరియా వాళ్ళ గుడిసెల కాడ ఎదురైండు. ఆయన వెంట ఓరియా కార్మికులు కిషన్, చ్రకధర్ మరి కొంత మంది ఉన్నారు.
జానకిరాం ను చూసే సరికి సత్తయ్యకు ఎక్కడ లేని కోపం కల్గింది. వెతక పోయిన తీగ కాలుకే తగిలిందని సంబర పడ్డడు. ‘‘నాకొడుకు ఈ సారి తప్పించుకోవద్దు’’ అంటూ అందరి కంటే ముందు ఉరికిండు.
దూరం నుండే వీళ్ళ వాలకం చూసి జానకిరాం ప్రమాదం శంకించిండు. ఎందుకైనా మంచిది అని అతను కాస్త వెనక్కి తిరిగి ఓరియా వాళ్ళ గుడిసెల మధ్యకు వచ్చిండు. అక్క మరికొంత మంది ఓరియా కార్మికులు పోగయ్యిండ్లు.
సత్తయ్య జట్టు వాళ్ళు బాగా తాగి ఉన్నారు. చేతిలో కర్రలు పట్టుకొని సర్రున వచ్చి రావటం తోనే జానకిరాం మీద
దాడికి దిగిండ్లు.
వాస్తవానికి జానకిరాం తనపై దాడి చేస్తారని ఊహించలేదు. కాని వచ్చెవాళ్ళ వాలకం చూసి కొంత అనుమానం కల్గి వెనక్కి వచ్చిండు. ఊహించని దాడికి అతను మొదట కొంత కంగారు పడ్డా అవెంటనే తేరుకొని ‘‘చూస్తారెందిరా నా కొడుకుల్ని తన్నండి’’ అంటూ తన అనుచురులను పురమాయించిండు.
అరుపులు కేకలు...
ఓడ్డెరోళ్ళు బండలు కొట్టి కాయ కష్టం చేసి చేసి మొద్దు బారిన చేతులు. జానకిరాం ఒక్కడే ఎదురైతే పరిస్థితులు ఎలా ఉండేదో ఎమోకాని ఓడ్డరి కార్మికుల నుండి ప్రతిఘటన ఎదరయ్యే సరికి వాళ్ళ శక్తి ముందు వీళ్ళ శక్తి చాలకుంటైంది. అందులో తాగి ఉన్నారు. దాంతో ఎక్కువ సేపు నిలబడ కుండానే తోక ముడవాల్సి వచ్చింది.
అప్పటికి జరుగ వలిసిన నష్టం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలినవి. జానికి రాం ఎంత తప్పుకున్న లాబం లేకుండా పోయిందిఉ.
అటు సత్తయ్యకు ఇటు జానకిరాంకు తలలు పగిలినవి. కారిన నెత్తురుతో తడిసి పోయిండ్లు.
పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు.
శాంతి బద్రతలకు ఎటువంటి బంగం కల్గకుండా ఎన్నికలు శాంతియుతంగా చట్టబద్దంగా సజావుగా జరిగినవి. ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల్లో టి.ఆర్.యస్‍కు చెందిన అభ్యర్థి లక్ష్మణ్ మెజార్టీతో అపూర్వ విజయం సాధించాడు.
‘‘తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసానికి ప్రబల నిదర్శనం ఈ విజయం’’ అంటూ ఆ పార్టీ నాయకుడు ఉత్సాహంగా ప్రకటించిండు.
తన ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూల దండతో వచ్చి వెంకటేశ్‍ను సత్కరించిండు.
‘‘ఎన్నికల్లో గెలుపు ఓటమిలు చాల సహజం కాని స్నెహం మాత్రం చిరస్థాయిగానిలుస్తుంది’’ అంటూ ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని కౌగిలించుకొని తన సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిర్నవ్వులు చిందించారు.
అది చూసి జనం అనందంగా చప్పట్లు చరిచారు.
గవర్నమెంటు హస్పటల్లో ఉన్న కొడుకును చూడటానికి నాగయ్య, శాంతమ్మ పోయిండ్లు...
కొట్లాటలో దెబ్బలు తాకి హస్పటల్లో పడ్డ సత్తయ్యను చూడటానికి ఏ నాయకుడు రాలేదు. వాళ్ళంత ఎన్నికల్లో గెలిచిన సంబరాల్లో మునిగి పోయిండ్లు...
హాస్పటల్ బెడ్స్ లేక నేల మీద పడుకొన్న సత్తయ్య, మరో ప్రక్కన జానకిరాం కన్పించిండు.
తలకు పెద్ద కట్టుతో ఉన్న కొడుకును చూసి శాంతమ్మకు దు:ఖం అగలేదు. ‘‘వానింట్ల పీనుగులెల్ల... ఎన్నికలో ఎన్నికలని కొడుకు ప్రాణాలు తీసిరి... ఎందుకు వచ్చిన ఎన్నికలు, ఎవ్వని బాగు చెయ్యటానికి వచ్చిన ఎన్నికలు... పెద్ద పెద్దోలంత మంచి గున్నారు. వాళ్ళ మాయలో పడి తన్నక చస్తిరి’’ అంటూ శోకం తీసింది.
నాగయ్య కండ్లలో నీళ్ళూరినయి....
సత్తయ్య, జానకిరాం ఒకరి మొఖాలు ఒకరు చుసుకున్నారు.
(అయిపొయింది)
1903 లో హిందూసుందరి పత్రికలో ఒక రచన మాత్రమే ప్రకటించబడి తెలుస్తున్న స్త్రీలు 16 మంది ఉన్నారు. వీళ్ళ సమకాలపు సావిత్రి వంటి పత్రికలలో గానీ తరువాతి కాలంలో మరే పత్రికలో గానీ వాళ్ళ రచనలు కనబడవు. ఈ మొత్తం రచనలలో ఎక్కువభాగం ఉపన్యాసాలు, వ్యాసాలు. తరువాతి స్థానం కవిత్వానిది. కథ ఒకే ఒకటి.
ఆ కథ పేరు లోభివాని కథ. ( ఆగష్టు 1903) రచయిత్రి శ్రీధర సీతాదేవమ్మ. అప్పటికే భండారు అచ్చమాంబ ఆధునిక కథకు అంకురార్పణ చేసినా స్త్రీలు నీతికథల మూసలోనే కథలు వ్రాసారు. లోభివాని కథ ఆ కోవలోదే. ఒక వూళ్ళో ఒక లోభివాడు. కొబ్బరి పచ్చడి తినాలనిపించి కొబ్బరి కాయ కొనటానికి బయటకు వెళ్ళాడు. బజారు లో కొబ్బరి కాయ ధర ఎక్కువ అనిపించి తక్కువకు దొరికే ప్రాంతాన్ని వెతుక్కొంటూ రాజమండ్రి , అమలాపురాలు మీదుగా హైదరాబాద్ వరకూ వెళ్లి అక్కడ కానీ ఖర్చు లేకుండా ఒక సరస్సు ఒడ్డున సరస్సు పైకి వంగిన కొబ్బరి చెట్టు కాయలు కోయటానికి ఎక్కి జారి పడిపోతున్న తరుణంలో కూడా డబ్బు ఆశ వదలక చేతి పట్టు వదిలి తనను కాపాడటానికి ప్రయత్నించిన నవాబును, రాజును కూడా తనతో పాటు నీళ్లలో మునిగి చనిపోయేట్లు చేసిన లోభివాడి కథ ఇది. ఉన్నవూళ్ళో కొబ్బరి కాయ కొనటానికి డబ్బు కోసం చూసుకొన్న వాడు, చౌకగానో , అసలు డబ్బే పెట్టకుండానో దానిని సంపాదించటానికి చేసిన ప్రయత్నంలోని ప్రయాసను, నష్టాన్ని పతాక స్థాయిలో చూపించిన ఈ కథ లోభత్వం వినాశకరం అని చెప్తుంది. ఇంత సాధారణమైన నీతి కథను ఆధునిక అవసరానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం ఈ కథకు కొసమెరుపు. ఒక్క రూపాయి పెట్టి హిందూసుందరిని తెప్పించి తమ స్త్రీలకు విద్యనేర్పించని లోభుల ఇల్లాండ్రు మూఢురాండ్రై తుదకు ఇలాంటి కీడే తెచ్చిపెడతారన్న నీతి తో ఈ కథను ముగించటంలో ఉంది రచయిత్రి చమత్కారం.
1903 నాటికి స్త్రీలు సంప్రదాయ ఛందో రీతులలో కవిత్వం వ్రాస్తూనే ఉన్నారు. వాటితో పాటు స్త్రీలకే ప్రత్యేకమైన మంగళహారతులు , కీర్తనలు వ్రాస్తున్నారు. అయినారపు వెంకట రమణమ్మ స్త్రీల విధేయత అనే శీర్షిక కింద ( నవంబర్ 1903) నాలుగు పద్యాలు వ్రాసింది. మొదట చివర సీస పద్యాలు , మధ్య రెండూ ఉత్పలమాల ఒకటి, తేటగీతి మరొకటి. “ జనని గర్భమునందు జన్మించినది మొదల్ యత్తవారింటికి నరుగువరకు … “ అని మొదలయ్యే ఈ పద్యం తల్లిదండ్రుల ఆజ్ఞ కాదనక బుద్ధిని విద్యయందు హద్దు పరచి వినయం, నమ్రత, లజ్జ , శీలం, సత్యం , శాంతం, దయ, ఉపకారం , నిర్మలత్వం మొదలైన గుణాలను అభివృద్ధి పరచుకొని మెలిగితే తల్లిదండ్రులకు పేరు , ప్రజల మెప్పూ లభిస్తాయి కనుక బాలికలకు అలాంటి జ్ఞానం ఇచ్చే చదువు నేర్పాలని చెప్పింది వెంకట రమణమ్మ. పిల్లలను గారాబం చేసి పాడు చేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది ఒక పద్యంలో. మరొక పద్యంలో స్త్రీలు అత్తమామల మీద భక్తి , భర్త మీద మనసు పెట్టి అతనే దైవమని పూజించే స్త్రీకి భగవంతుడు సర్వ సంపదలు ఇస్తాడని ఆశపెడుతుంది. చివరి సీసపద్యంలో ఏ తీర్ధ యాత్రలు, జపతాపాలు, ఉపవాసాలు, దేవతా పూజలు, పుణ్య తీర్ధ స్నానాలు పతి పాదపూజతో సరి రావని కనుక “ప్రాణేశు పాదసేవ మానవలదు” అని స్త్రీలకు హితవు చెప్తుంది. ఎంతో కాలంగా గతానుగతికంగా స్త్రీధర్మాలుగా ప్రబోధించబడుతున్న వాటినే మళ్ళీ చెప్పింది.
పద్యరచనా శక్తి పరీక్షలలో సమస్యా పూరణ ఒకటి. ఒక పద్య శకలం సమస్యగా ఇచ్చి మిగిలిన భాగాన్ని పూరిస్తూ అర్ధవంతమైన పద్యం వ్రాయమనటం ఒకటి. ఆధునిక యుగపు తొలినాళ్ళ స్త్రీల పత్రికలలో సమస్యా పూరణ పద్యాలు వ్రాసిన మహిళలు చాలామంది కనబడతారు. శ్రీ రాజా బొడ్డు రాజ్యలక్ష్మమ్మ ( రాజ్య లక్ష్మీ దేవమ్మ ) ఒకరు. ఇచ్చిన సమస్య “ శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” ( డిసెంబర్ 1903)దానిని కలుపుకొని ఆమె రామాయణార్ధంలో పద్యం వ్రాసింది. “కనకాంగి వినుము రామునినని మార్కొని రావణుడు శరావళి గురియన్ \ ఘన శూరుడైన సీతే శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” అన్నది ఆమె వ్రాసిన పద్యం. సీతేశునకు +అమ్ములు అని విడదీసి రావణుడు వేసిన బాణాలు సీతకు ఈశుడు , భర్త అయిన రాముడి మీద నాటుకొని పువ్వులై శోభించాయని చమత్కరించింది. ఆ సంచికలోనే పాలేపు మాణిక్యాంబ అదే సమస్యను తపస్సులో ఉన్న శివుడి మనసు పార్వతిపై లగ్నం కావాలని మన్మధుడు వేసిన బాణాలు శివుడి పై పూలై శోభావహించాయని పూరించింది.
వేప గుప్తాపు మహాలక్ష్మమ్మ ( జులై 1903 ) యే. కనకమ్మ ( సెప్టెంబర్&అక్టోబర్ 1903) కీర్తనలు వ్రాసారు. మహాలక్ష్మమ్మ కీర్తన సరస్వతీ స్తుతి. స్త్రీల కీర్తనలు సాధారణంగా లక్ష్మీ పార్వతుల స్తుతి రూపకంగా ఉంటాయి. ఎందుకంటే నోములకు, వ్రతాలకు అధిదేవతలు వాళ్ళే కనుక. ఈ నేపథ్యంలో సరస్వతీ స్తుతి అరుదైనదే. “వందనంబులందు (ఓ) వారిజాసను రాణి వందనంబు లంది నా వంత దీర్పవమ్మ” అన్న పల్లవితో ప్రారంభమైన ఈ కీర్తనలో అయిదు చరణాలు ఉన్నాయి. కవుల చెంత చేరి ఉంటుందని, విదుషులను బ్రోచు విద్యా కల్పవల్లి అని సరస్వతి స్థానాన్ని , దయను గురించి చెప్తుంది. “విద్యలేని స్త్రీ వెతల బాపవమ్మా” అని కోరటం లో “విద్యాశ్రీ నొసగి వేగ బ్రోవరమ్మా” అని ప్రార్ధించటంలో స్త్రీవిద్య పట్ల రచయిత్రి ఆర్తి కనబడుతుంది. యే. కనకమ్మ కీర్తన లో “ సత్యముగాను పణతూ లందరికీ పతిభక్తి భూషణమూ బాగుగానుండవలెన్” అన్న పల్లవే చెబుతుంది దాని స్వభావాన్ని. సావిత్రి మొదలైన సతులు పతిభక్తి వల్లనే గణనకు ఎక్కారని ఆడవాళ్లు అబద్ధాలు ఆడరాదని నీతులు చెప్తుంది ఈ కీర్తన.
టి. రామలక్ష్మమ్మ (ఆగష్టు 1903), పేరు లేకుండా ఒక స్త్రీ అనే సర్వనామంతో మరొక స్త్రీ వ్రాసిన మంగళ హారతులు రెండు ఉన్నాయి. రామలక్ష్మమ్మ వ్రాసినది భగవంతుడి గురించిన కీర్తన కాదు. అప్పుడు భారతదేశపు బ్రిటన్ ప్రభువుగా ఉన్న 7 వ ఎడ్వర్డ్ గురించి. అతని పూర్తి పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్. క్వీన్ విక్టోరియా పెద్దకొడుకు. 1901జనవరి 22 న అతను అధికారంలోకి వచ్చాడు. “ మంగళమని, మంగళమని మంగళమనరే మంగళమని పాడరే ఎడ్వర్డ్ గారికి” అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో అయిదు చరణాలు ఉన్నాయి. భారతీయుల కోర్కెలు తీరేట్లుగా అతను ఇండియాకు ప్రభువు అయ్యాడని మహిళలందరిని అతనికి మంగళ హారతులిమ్మని పిలుపు ఇచ్చింది ఈ పాటలో . సమకాలీన రాజకీయాల పట్ల స్త్రీలలో ఆసక్తి ని , ప్రతిస్పందనను నమోదు చేసిన పాట ఇది . ‘ఒక స్త్రీ ‘ వ్రాసిన మంగళహారతి( సెప్టెంబర్ 1903) “మంగళమూ నీకంబా మాతల్లీ జగదాంబా …” అనే పల్లవి తో అయిదు చరణాలలో పార్వతికి ఎత్తిన హారతి. ఈ మంగళ హారతి కర్తగా ఆమె తనపేరు చెప్పుకొనటానికి ఇష్టపడలేదు కానీ ఆమె పేరు వెంకటరత్నము అని ఆ మంగళహారతే చెప్తున్నది. వరము లిచ్చి బ్రోవమని , దీన జనులను బ్రోవమని వేడుకొంటూ ‘దాసాను దాసురాలగునట్టి వెంకటరత్నము నే బ్రోవు మరి మరీ వేడేదా’ అని తనగురించి చెప్పుకొన్నది. మంగళహారతి, కీర్తన రచనలలో చివరి చరణాన్ని రచయిత నామాంకితంగా వ్రాసే సంప్రదాయాన్ని పాటించటం వల్ల ఇలా ఆమె పేరు వెంకట రత్నము అని తెలుస్తున్నది. కానీ ‘అదే సంచికలో ‘“రామ రామ నన్ను నీ రచ్చశాయనేలరా , తామసంబు మానుమా కామితార్ద దాయక” అనే పల్లవితో ప్రారంభించి ఒక సుందరి’ వ్రాసిన నాలుగు చరణాల పాట రచనలో ఈ సంప్రదాయం పాటించబడలేదు కనుక ఆమె అసలు పేరు ఏమిటో మనకు తెలియకుండానే పోయింది.
కథ, కవిత్వం, కీర్తనలు , మంగళ హారతులు వ్రాసిన ఈ ఎనిమిది మంది రచయితల తరువాత మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది. వీళ్ళు వ్రాసినవి వచన రచనలు. వాటిలో వ్యాసాలు ఉన్నాయి. ఉపన్యాసాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై స్త్రీల అవగాహనకు ఇవి అద్దం పడతాయి. ప్రధానంగా ఇవి విద్యకు సంబంధించినవి. అందుకు మినహాయింపు రెండు వ్యాసాలు.
ఒకటి వైధవ్య సమస్యను చర్చించింది.ఆ వ్యాసం ‘నిజమైన జననీ జనకులు.’ (జూన్, 1903). రచయిత్రి పార్నంది వెంకట రమణమ్మ. ఈ వ్యాసంలో ఆమె ఆడపిల్లలకు , మరీ ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలకు నిజమైన జననీ జనకులు కందుకూరి వీరేశలింగం , ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ అని అంటుంది. కూతుళ్లు భర్త మరణించి వైధవ్యం పాలైతే తల్లిదండ్రులు అల్లుడి సొమ్మును అపహరించి పిల్లకు జుట్టు తీయించి ముసుగేసి వంట పొయ్యిదగ్గర ఉంచి ఒంటిపూట తిండి పెట్టి ఏకాదశి ఉపవాసాలు చేయించి, ఆమె అత్తవారింటి రొక్కంతో వడ్డీవ్యాపారం చేస్తూ బాలవితంతువు ఘోష పుచ్చుకొని వాళ్ళు తల్లి దండ్రు లు ఎలా అవుతారన్నది ఆమె తర్కం. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు వెనుకంజ వేసినా వితంతువులను చేరదీసి , ఆదరించి, జీతాలు కట్టి చదువులు చెప్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న, వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపుతున్న వీరేశలింగం దంపతులే నిజమైన జననీ జనకులు అవుతారని ఆమె తేల్చి చెప్పింది.
మరొకటి దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ది కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం లో చేసిన చిన్న ప్రసంగం. (డిసెంబర్ )పోచిరాజు మహాలక్ష్మమ్మ అనే మహిళ ఉన్నతోద్యోగి అయిన భర్త తో ఆ వూరు వదిలివెళ్తున్న సందర్భంలో ఏర్పరచిన వీడుకోలు సభలో ఆమె ఈ మాటలు మాట్లాడింది. రక్త సంబంధాలకన్నా , బంధుత్వాల కన్నా ఆధునిక యుగంలో స్నేహ బంధాలు బలవత్తరం అవుతున్న విషయాన్ని, ఆ స్నేహాలు సాధారణ ఆసక్తులు, పాల్గొనే కార్యక్రమాలను బట్టి ఏర్పడుతాయన్న విషయాన్ని ఈ ప్రసంగం సూచిస్తుంది. శ్రీ విద్యార్థినీ సమాజంలో స్త్రీల ప్రయోజనాలకోసం పనిచేయటమే వాళ్ళ స్నేహ సూత్రం. తమతో కలిసి పనిచేసిన స్త్రీ , స్త్రీల విద్యకోసం ఇంకెంతో పని చేసి సమాజానికి మేలు చేకూరుస్తుంది అను కొన్న నెచ్చలి వియోగానికి విచారం ఇందులో వ్యక్తం అయింది.
1903 ఫిబ్రవరి సంచికలో రుద్రవరపు కామేశ్వరమ్మ , వేమరుసు మహాలక్ష్మి స్త్రీవిద్యను ప్రస్తావిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. ఒక సుందరి అనే సర్వనామంతో ‘నీతిని గూర్చి’ అనే వ్యాసం ( ఏప్రిల్) ప్రచురించబడింది.సమాజ ప్రార్ధనకు స్త్రీలను ఇంటికి ఆహ్వానించిన ఒక స్త్రీ చేసిన ఉపన్యాసం ఇది. . సమాజ ప్రార్ధన అంటే బ్రహ్మసామాజికులు సామూహికంగా చేసే ఏకేశ్వరోపాసన. అందుకోసం స్త్రీలు తోటి స్త్రీలను తమ ఇళ్లకు ఆహ్వానించటం, స్త్రీలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకొనటం, ప్రార్ధనలు చేసి కీర్తనలు పాడుకొనటం అదొక అలవాటుగా మారిన కాలం అది. అలా ఈ సుందరి కూడా తన ఇంట్లో సమాజ ప్రార్థనకు స్త్రీలను పిలిచింది. వాళ్ళను ఆహ్వానిస్తూ ఆమె చేసిన చిన్న ప్రసంగమే ఈ వ్యాసం.
అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన భండారు అచ్చమాంబ సకుటుంబంగా తమ నగరానికి వచ్చిన విషయం ప్రస్తావించింది. అచ్చమాంబ నాగపూర్ లో ఉంటున్నా రచయిత్రి గా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా తెలుగు దేశపు స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. 1902 డిసెంబర్ నుండి కుటుంబంతో ఆంధ్రదేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ కాశీకి వెళ్ళింది. బందరు లో మొదలుపెట్టి 1903 జనవరి ,ఫిబ్రవరి నెలలలో ఏలూరు, రాజమండ్రి కాకినాడ మొదలైన నగరాలలో పర్యటించి స్త్రీల సమావేశాలలో ప్రసంగాలు చేసింది. ఆమె తమ నగరానికి వచ్చి ఆనందం కలిగించిందని ఈ సుందరి చెప్తున్నదంటే ఈమె నివాసం ఏలూరు , రాజమండ్రి , కాకినాడ లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. అచ్చమాంబ సద్గ్రంధాలు చదివితే ఆమె ఉన్నతమైన ఉద్దేశాలు అర్ధం అవుతాయని, విద్యామహత్యం వల్లనే ఆమె అందరి హృదయాలను ఆకర్షించగలిగిందని అంటుంది ఈ సుందరి.
చోరులు తస్కరించరానిది, పరులకు ఇచ్చినా తరగనిది విద్య అని , అలాంటి విద్య పురుషులకు మాత్రమే అందుబాటులో ఉందని, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నత విద్యలో కనిపిస్తారని చెప్పి , ఇరుగుపొరుగు వారి అభ్యంతరాలకు, ఇంట్లో ముసలమ్మల సణుగుడుకు భయపడి ఆడపిల్లల చదువు మూడు నాలుగు తరగతుల లోనే మాన్పిస్తున్నారని ఒక వాస్తవాన్ని చెబుతూ స్త్రీలే చదువు చెప్తున్న బడులకు ఆడపిల్లలను పంపక పోవ టాన్ని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలు చదివిన ఆ కాస్త చదువు కూడా పెళ్లిళ్లు అయి సంసారాలు మీదపడిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నదని బాధపడుతుంది. ఇంటి పనులు అయినా తరువాతనైనా సరే కాస్త సమయం కేటాయించి సద్గ్రంధాలు చదువరాదా అని వేడుకొన్నది. చదువు జనాభివృద్ధి సాధకం అని పేర్కొన్నది. విద్య కన్నా విలువైనది నీతి అని దానివలన విద్యకు వన్నె చేకూరుతుందని సీతను ప్రస్తావిస్తూ నీతి శ్రేష్ఠతను వక్కాణించింది.
‘దేశాభిమానము గల స్త్రీలకొక ప్రార్ధన’ అనే వ్యాసంలో (జూన్ ) గొడవర్తి బంగారమ్మ దేశంలో అనేకరకాలైన పేదరికాలు ఉన్నాయని , విద్యలో ప్రత్యేకించి స్త్రీ విద్యలో దేశం కడు పేదరికంలో ఉందని కనుకనే ఈ దేశంలో స్త్రీలు బానిసలవలె ఏలబడుచున్నారని చెప్పింది. న్యాయంగా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన స్నేహం కొరవడటానికి విద్య లేకపోవటమే కారణం అంటుంది. నాగరికతకు మూలభూతమైన విద్యను స్త్రీలలో వృద్ధిచేయటానికి మహా జనసభలు పూనుకోవాలని , గడచిన సంవత్సరం కలకత్తా సభ స్త్రీవిద్య గురించి ప్రస్తావించటం సంతోషం కలిగించింది అని చెప్పింది.
స్త్రీవిద్యకు తగిన వసతులు లేవని, క్రిస్టియన్ మిషనరీలు అందుకు కొంత పనిచేశాయని స్త్రీలకు బడులు పెట్టి స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించి నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రేరణతో విజయనగరం మహారాజా ఆనందగజపతి రాజు వంటి వారు అలాంటి పనికి పూనుకున్నారని ఆయన బాలికల విద్య కొరకు చెన్నపురిలో నాలుగు , విజయనగరంలో ఒకటి పాఠశాలలు ఏర్పరచాడని పేర్కొన్నది. విజయనగరంలోని బాలికా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 150 మంది బాలికలు చదువుకోగా ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందని సమాచారం ఇయ్యటమే కాదు అందుకు కారణాలను కూడా ఆమె వాస్తవ భూమిక మీద ఊహించింది. పదేళ్లు దాటినా ఆడపిల్లను బడికి పంపటానికి అవసరమైన సంస్కారం సమాజంలో లేకపోవటం దానికి తోడు ఆ పాఠశాలలో అధ్యాపకులు అందరూ పురుషులే కావటం అందుకు కారణం అంటుంది.
గొడవర్తి బంగారమ్మ కు స్త్రీవిద్య గురించి ఉన్న ఈ ఆరాటం ఆమెను ఆచరణలోకి నడిపింది. ఈ వ్యాసాన్ని బట్టి ఆమె 1897 లోనే ఒక బాలికా పాఠశాల ఏర్పరచినట్లు తెలుస్తున్నది. పదిమంది తో ప్రారంభమై ఇప్పుడు అందులో చదువుతున్న బాలికల సంఖ్య యాభైకి చేరిందని దానిని తాను ఒక్కతే నిర్వహించటం కష్టంగా ఉందని తెలుగు, ఇంగ్లీష్ చెప్పటానికి ఇద్దరు, కుట్లూ అల్లికలు నేర్పటానికి ఒకరు సహాయకులు కావాలని అందుకు విజయనగరం మాహారాణి అయిదువందల రూపాయల చందా , నెలకు 20 రూపాయలు ఇయ్యటానికి అంగీకరించిందని ఈ వ్యాసంలో ఆమె పేర్కొన్నది. స్త్రీలందరినీ తమతమ ప్రాంతాలలో స్త్రీ విద్యకు తోడ్పడాలని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగించింది.
విద్య సమానత్వ సాధనమని , స్త్రీ పురుషులమధ్య స్నేహం అనే విలువను అభివృద్ధి చేస్తుందని భావించిన గొడవర్తి బంగారమ్మ అభివృద్ధికి తనదయిన నిర్వచనాన్ని ఇయ్యటం ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఏది అభివృద్ధి కాదో చెప్పటం ద్వారా ఆమె ఈ పని చేసింది. ఆమె దృష్టిలో అభివృద్ధి అంటే
కేవలం విద్య మాత్రమే. అంటే ఆమె అభివృద్ధి నిర్వచనం పరిధి లోకి స్త్రీ పునర్వివాహాలు, పురుషులతో సామాజిక సంబంధాలు, మత సమానత రావన్న మాట. అది గొడవర్తి బంగారమ్మ సంస్కరణ పరిమితి. అయినప్పటికీ స్త్రీ విద్య వరకు ఆమె ఒక ఆచరణ వాది అన్నది స్పష్టం.
వలివేటి బాలాత్రిపుర సుందరమ్మ రాజము నందలి జనానా సభలో చేసిన ప్రసంగం ( జులై ) కూడా స్త్రీ విద్య కేంద్రంగానే సాగింది. స్త్రీలు సభలకు రావటం వల్ల ఇంటిపనులు కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరూ చేరి మాట్లాడుకొనటం వలన కలిగే లాభం అంతకంటే గొప్పది అని చెప్తూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. మానవ జాతిలో పురుషుడు మొదటివాడుగా శరీరదారుఢ్యం , విద్య కలిగి ఉండగా స్త్రీ రెండవది గా అబల గా విద్య లేనిదానిగా ఉండిపోవటం గురించిన ప్రశ్నతో దానిని కొనసాగించింది. విద్య లేకపోతే జీవనం లేదా? లేకుండా ఆడవాళ్లు ఇప్పుడు జీవించటంలేదా? చదువుకొని ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా అంటూ స్త్రీలకూ చదువు చెప్పించకుండా నిరుపయోగులుగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది.
విద్య అంటే తెలుసుకొనటం అని తెలుసుకొనటానికి విస్తృతమైన జ్ఞాన ప్రపంచం ఉందని బాలా త్రిపుర సుందరమ్మ అంటుంది. జీవ పదార్ధాలు , నిర్జీవ పదార్ధాలు అని పదార్ధాలు రెండురకాలు అని మొదటి దానిలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైనవి ఉంటే రెండవదానిలో భూమి, ఆకాశం, నీరు, గాలి , అగ్ని మొదలైనవి ఉంటాయని ఇవన్నీ తెలుసుకోవలసినవే అంటుంది. చదువు ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పింది. ప్రపంచంలో స్త్రీపురుషులకు ఏర్పాటైన పనులు సక్రమంగా నిర్వహించటానికి విద్య అవసరమని చెప్తూ చివరకు ఇల్లు చక్కదిద్దటం, పిల్లలను పెంచటం వంటివి చక్కగా చేయటానికి స్త్రీలకు విద్య అవసరమని చెప్పటంలో మళ్ళీ స్త్రీ విద్యను ఇంటి పనులకే పరిమితం చేయటం కనబడుతుంది. ఏమైనా స్త్రీలు తరచు కలుసు కొనటం కలిసి చదువుకొనటం ప్రయోజనకరమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది.
మొసలికంటి రమణాబాయమ్మ ( వెంకట రామణాబాయి ) కూడా రాజమునందలి జనానా సభలో చేసిన ప్రసంగం స్త్రీవిద్య గురించే( సెప్టెంబర్ &అక్టోబర్). అందరికీ తెలిసిన విషయమే అయినా తన మాటలు బాలభాషితాలవలె ఆనందపరచగలవని అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. తల్లిదండ్రులు చదువు చెప్పించకపోవటం వల్ల ఆడపిల్లలు కాపురంలోని కష్ట సుఖాలను అన్నదమ్ములకు ఉత్తరం వ్రాసి తెలుపుకొనటానికి వీల్లేక పోతుందని , ఎవరికైనా చెప్పి వ్రాయిద్దామంటే ఆ విషయం అత్తమామలకు తెలిసి పోతుందన్న భయంలో నిర్బంధంలో జీవితాలు గడిపేస్తున్నారని తనకెదురైనా ఒక స్త్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. ఇది అర్ధమైతే దానిని దాటటానికి ఇప్పుడు ప్రయత్నించి అయినా విద్య నేర్చుకోవచ్చని చెప్పింది. విద్యా స్పర్శ వల్ల స్త్రీల చిత్తం పరిశుద్ధం అవుతుందని స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పతిభక్తి , దైవ భక్తి, సత్యశీలత మొదలైన సద్గుణాలు సాధించటానికి సాధనం అవుతుందని , గృహకృత్య నిర్వహణ సమర్ధవంతంగా చేసుకొంటారని బాలా త్రిపుర సుందరమ్మ వలెనే అభిప్రాయపడింది.
కసవరాజు రంగమ్మ స్త్రీవిద్య గురించి వ్రాసినది ఈ వరుసలో చివరిది ( డిసెంబర్ ) చిన్న విన్నపం పత్రికాముఖంగా ప్రచురించండి అని కోరుతూ ఆమె వ్రాసిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఆమె భర్త పేరుమీద దేశోపకారి అనే పత్రికను తెప్పించుకొని కొన్ని నెలలుగా చదువుతున్నానని అందులో హిందూ సుందరి పత్రిక గురించి వ్రాసినది చూసి తెప్పించుకొని చదివానని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంచికలు చదివాకా తనకు కూడా వ్రాయాలనిపించి వ్రాస్తున్నానని పేర్కొన్నది.
తనకు విశేష విద్య పరిశ్రమ లేదని , ఉన్న స్వల్ప విద్యనయినా అభివృద్ధి చేసుకొనటానికి ఎక్కువకాలం సంసార విషయాలలో వ్యయం అయిపోతున్నదని తప్పులెంచక తన వ్యాసం చదవమని కోరింది. వ్రాయటం, వ్రాసిన దాన్ని చదవటం మాత్రమే విద్య కాదని సత్యం , వినయం , వివేకం, భక్తి , పరోపకారం, పత్ని వ్రతం ,పాతివ్రత్యం మొదలైన సద్గుణ సముదాయాలను పెంచుకొనటమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు స్త్రీలకు పాతివ్రత్యం గురించి చెప్పిన వాళ్ళే కానీ స్త్రీలకూ పత్ని వ్రతం గురించి చెప్పిన వాళ్ళు, ప్రత్యేకించి స్త్రీలు ఎవరూ కనబడరు. దానిని చేర్చటం ద్వారా రంగమ్మ గుణాలను స్త్రీపురుషులిద్దరికి సమానమైనవిగానే భావించినట్లు. అందువల్లనే ఇటువంటి విద్య స్త్రీపురుషులిద్దరూ పొందవలసినదే అని, అది పురుషులకు మాత్రమే హక్కు కాదని చెప్పగలిగింది. విద్యాస్వాతంత్య్రం అందరికీ హక్కు అయిఉండగా మగపిల్లల చదువులో శ్రద్ధపెట్టి ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయటం ఏమని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలను చదువు చెప్పించక పోవటం వల్ల వాళ్ళు కూపస్థ మండూకాలై , విద్యాగంధం లేని జ్ఞాన హీనులై అందరికీ సంతాపకారకులు అవుతున్నారని అందువలన స్త్రీల చదువుకు సౌకర్యాలు కల్పించాలని అంటుంది. ఉత్తర సర్కారు జిల్లాలలో చదువుకొన్న స్త్రీలు ఎక్కువ కనబడతారని పరిశీలన మీద చెప్పింది. స్త్రీలకు చదువు పట్ల ఆసక్తిని పెంచే స్నేహం, సహవాసం, ప్రొత్సాహం ఇయ్యాలని పేర్కొన్నది. భండారు అచ్చమాంబను స్త్రీలు అనుసరించవలసిన నమూనా గా పేర్కొన్నది. భర్త కేశవరాజు నరసింగరావు తనకు రచనా స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొన్నది.
రంగమ్మ అభిప్రాయాలను ఆమె చదివానని చెప్పుకొన్న హిందూసుందరి (1903, ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్) సంచికలలో స్త్రీ విద్య గురించి వచ్చిన రచనలపై ప్రతిస్పందనగా పేర్కొనవచ్చు. వాటి మీద కొంత మెరుగైన అవగాహన , స్త్రీపురుష సమానత్వ భావన, హక్కుల స్పృహ ఈ వ్యాసంలో కనబడతాయి.
----------------------------------------------------------------------------------
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు